‘‘రేప్పొద్దున పది గంటలకు రమ్మనమని వాళ్ళకు చెప్పారు నాన్న!’’అప్పుడు సరిగ్గా తొమ్మిది దాటి అరగంటయింది. ఎండ మండిపోతోంది.‘‘ఎవరిని?’’‘‘ఎవరినేమిటే...ఎన్నిసార్లు చెప్పాలి నీకు... నిన్ను చూసేందుకు ఆ కుర్రవాడు, వాళ్ళ బాబాయి, పిన్ని వస్తున్నారు!’’సుగుణ గొంతును గంయ్‌న పెంచింది. ‘‘నేను చెప్పాను గదే నాకు వీలుగాదని...అమ్మా! నన్ను సతాయించొద్దు...నేను మాత్రం ప్రయాణం మానుకోను...మేం నెల రోజులబట్టీ ప్లాన్‌ చేసి, కంపెనీలో శెలవు తీసుకుని బయల్దేరుతుంటే ఎవడో బడుద్ధాయి వచ్చి నన్ను చూస్తానంటే నా ప్రోగ్రాం మార్చుకోవాలా ? నేను ముందే చెప్పాను ఇప్పుడప్పుడే చేసుకోనని...వినిపించుకోవేం నువ్వు!’’ సుగుణ తన బెడ్‌రూంలో అద్దంలో చూస్తూ ఐబ్రోస్‌ దిద్దుకుంటున్నది. అప్పటికే జీన్స్‌ ప్యాంట్‌ మీద టీ షర్టు వేసుకున్నది.‘‘పెళ్ళి చేసుకోక ఏం చేస్తావే ? ... సన్యాసుల్లో కలుస్తావా... ఏం మాట్లాడుతున్నావ్‌...నువ్వు చదువుకుని నేర్చుకున్నది ఇదా... పొగరెక్కిన మాటలు కాకపోతే...! నోర్మూసుకుని ఇంట్లో కూర్చో...!సుగుణ చేస్తున్న పని ఆపలేదు. చేతిలో పెన్సిల్‌ పక్కన పడేసి, అరచేతిలో కాస్త సాండల్‌ పౌడర్‌ వేసుకుని ముఖాన దూమెరుగ్గా రాసుకుంది. బంగారు రంగులో మెరుస్తున్న సన్నని స్టిక్కరును తీసుకుని నుదుట బొట్టులా పెట్టుకున్నది. పెదవులకు గులాబి రంగు లిప్‌స్టిక్‌ పూసుకున్నది.

‘‘ఆ అబ్బాయి ఆఫీసు పనిమీద మద్రాసు నుంచి వచ్చాడట... రేపు సాయంత్రం చెన్నయ్‌ ఎక్స్‌ప్రెస్‌కు తిరిగి వెళ్ళిపోవాలిట... నీ ప్రయాణం సాయంత్రం నాలుగు గంటలకు గదా... ఎలాగూ శెలవు పెట్టావ్‌... ఓ గంట పని... ఉదయాన అతను వస్తే ఏమైంది... బ్రేక్‌ ఫాస్ట్‌ తీసుకుంటూ మాట్టాడుకోవచ్చు...మీ నాన్న కొలీగ్‌ జగన్నాథం అంకుల్‌ నీకూ తెలుసుకదా... వారి పెద్దన్నయ్యగారి అబ్బాయి... మంచి సంబంధమని తెలిసే నిన్ను చూడటానికి రమ్మనమన్నది!’’ ఆమె గొంతు పెంచింది.సుగుణ వ్యానిటీ తీసుకుని తన గదిలోంచి బయటకు వచ్చింది.‘‘రేపు మా ప్రయాణానికి కొనుక్కోవాల్సినవి చాలా ఉన్నాయి...ఆ పని పెందరాళే అయితే సరే... లేదా ఎక్కడయినా హోటల్లో భోజనం చేస్తాం అంతా!’’‘‘గంగలో దూకండి... రేపుదయం మాత్రం నువ్వు ఎక్కడికీ వెళ్ళటానికి వీల్లేదు!’’సుగుణ బయటకు వెళుతున్నదల్లా విసురుగా తల్లి దగ్గరకు వచ్చింది.

‘‘నాకేమన్నా చెప్పి రమ్మనమన్నారా ఆయనగార్ని మీరు... నేను ఊరికెళుతున్నానని తెలియదా... నాకు ఇంకా చాలా ముఖ్యమైన పనులున్నాయి... నాకు వీలు కాదు... మా అమ్మాయి ఊళ్ళో లేదని , రావద్దని చెప్పండి... కాదూ గూడదూ అని తీసుకువచ్చి నా ముందు కూర్చో బెట్టారో మొహానే చెప్పేస్తాను... నువ్వు నాకు నచ్చలేదు... నేను చేసుకోను అని... తరువాత నన్నని లాభం లేదు!’’ ఎత్తు మడమల చెప్పులను టకటకలాడించుకుంటూ బయటకు వచ్చి కారిడార్‌లో వున్న స్కూటీ స్టాండు తీసి రోడ్డెక్కించింది, కురచగా కత్తిరించుకున్న జుత్తు గాలికి ఎగురుతుండగా.‘‘దీన్ని కాదు అనాల్సింది... నెత్తినెక్కించుకున్న ఆయనగార్ని అనాలి... ఒక్కతే కూతురు ఒక్కతే కూతురు అంటూ ఒళ్ళూ పై తెలియకుండా అది ఆడింది ఆటలా పెంచాడు... ఇప్పుడు కొరకరాని కొయ్యలా తయారయింది!’’ చికాగ్గా హాల్లోకి వచ్చి భర్తకు చెప్పటానికి సెల్‌ను చేతిలోకి తీసుకుంది.పదో తరగతి వరకూ బాగానే వుండేది... చక్కగా జరీ అంచు పరికిణీ కట్టుకుని, ఓణీ వేసుకుని, పొడుగాటి జడలో గుప్పెడు పూలు పెట్టుకుని స్కూలు కెళ్ళేది. కాలేజీలో జేరింది మాయరోగం పట్టుకుంది... మగరాయుడిలా ప్యాంటు, టీ షర్టు, అపభ్రంశంగా జుట్టు కత్తిరించుకోవటమే గాకుండా హెన్నాతో కొబ్బరిపీచులా తయారు చేసుకుని, అది గాలి కెగురుతుంటే కులుక్కుంటూ బయట తిరగటం... హవ్వ! పిదప కాలం పిదప బుద్ధులు... ఏమైనా అంటే... వెధవ ముసలమ్మ కబుర్లు చెప్పబోకు... ఇప్పటి ఫ్యాషన్‌ ఇది... ఒక్కసారి బయటకు వచ్చి ప్రపంచం ఎలా మారిపోతున్నదో చూడు-అంటూ ఓ దీర్ఘం...