వెలుగుకి వీడ్కోలు తెలుపుతూ చీకటికి స్వాగతం పలుకుతూ సూర్యుడు నెమ్మదిగా కిందకి జారుకొంటున్నాడు. సంధ్యా సమయపు నులివెచ్చని సూర్యకిరణాలను మేఘాలు అడ్డగించడంతో ఆ ప్రాంతమంతా చీకట్లు ముసురుకుంటున్నాయి.అభివృద్ధికి నోచుకోని ఎన్నో కుగ్రామాలలో అది కూడా ఒకటి. పేరు పటవల. ఆ గ్రామానికి మూడు వైపులా పచ్చని పంటపొలాలు, పడమటి వైపున ఎత్తయిన కొండ, కొండ పైనించి కిందకు జాలువారే సెలయేటితో నయనానందకరంగా వుంటుంది. ఆ గ్రామ దేవత తలుపులమ్మ తల్లి. ఎవరైనా ఆ గ్రామంలోకి ప్రవేశించాలంటే ఆ గుడి ముందు నుంచే వెళ్లాలి. అందుకే అక్కడి ప్రజలు గ్రామంలోకి ఎటువంటి దుష్టశక్తులు ప్రవేశించకుండా ఆ తల్లి కాపాడుతుందని విశ్వసిస్తారు.ఆ దేవత మహిమల గురించే కాకుండా, ఆ గుడి నిర్మాణం గురించి కూడా అక్కడ చాలా కథలు వినిపిస్తాయి. ఆ గుడిని చాలాకాలం క్రితం దేవతలే స్వయంగా నిర్మించారని కొందరు, తలుపులమ్మ తల్లి భక్తుడు ఒకరు ఆలయం నిర్మిస్తే ఆ భక్తుని కోరిక మేరకు ఆ తల్లే స్వయంగా దేవతగా కొలువు తీరిందని కొందరు ఇలా రకరకాలుగా చెప్పుకుంటారు.ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఆ ఆలయం వద్ద సంబరాలు జరుగుతాయి. ఆ సమయంలో చాలా దూరాల నుంచి కూడా ప్రజలు వస్తారు.ఎప్పుడూ సెలయేటి నీటి హోరుతోనూ, పచ్చని పంటపొలాలను తాకుతూ వీచేటి చల్లని పిల్లగాలితో, కల్మషం లేని పల్లె హృదయాలతో ఆహ్లాదకరంగా వుండే ఆ పల్లె ప్రస్తుతం పెద్దవారి హడావుడితోనూ, చిన్నపిల్లల కేరింతలతోనూ, డప్పుల లయబద్ధమైన శబ్దాలతోనూ సంబరాల హడావుడితోనూ మునిగి వుంది.చిన్న చిన్న చినుకులతో ప్రారంభమైన వాన నెమ్మదిగా ఊపందుకుంది.

ఆ వర్షాన్ని చిన్న పిల్లలు ఏ మాత్రం లెక్కచేయకుండా పరుగులు తీస్తూ ఆటలాడుతున్నారు. డప్పుల హోరుతో వర్షపు జోరు కూడా కలవడంతో కొత్త కొత్త శబ్దాలు వినిపిస్తున్నాయి.అంత వర్షంలోనూ దాదాపు డెబ్బై సంవత్సరాల వయసుగల స్త్రీ కర్ర సహాయంతో నడుచుకుంటూ తలుపులమ్మ ఆలయం వైపు వచ్చింది. ఆమె ఆ గ్రామ పెద్ద రఘురామయ్య తల్లి. రఘురామయ్యకు మంచి మనిషిగా ఆ గ్రామంలోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా పేరుంది. అందుకే ఆ కుటుంబాన్ని ఆ గ్రామస్తులు ఎంతో గౌరవిస్తారు.ఆమె ఆలయాన్ని సమీపించి కళ్లు మూసుకొని దేవతకు నమస్కరించింది. అంతే ఆమె ఎలా నిలబడిందో అలాగే నేలకు ఒరిగిపోయింది. దైవ సన్నిధి లో ఆమె ఆత్మ శరీరాన్ని విడిచి మరొక శరీరం కోసం తన ప్రయాణాన్ని ప్రారంభించింది. సరిగ్గా అదే సమయంలో రఘురామయ్య భార్య తన ఏడవ కాన్పులో ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ విషయం తల్లితో చెప్పాలని రఘురామయ్య ఆమె కోసం ఇల్లంతా వెతికాడు. తల్లి కనిపించకపోయేసరికి ఇంత వర్షంలో ఎక్కడికి వెళ్లిందా అనుకుంటూ ఇంటిలో నుండి బయటకు వచ్చాడు.‘‘అయ్యా... అయ్యా...! మీ అమ్మగారు అమ్మోరు గుడి దగ్గర పడిపోయారయ్యా’’ అని ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పాడు.అతను చెపుతున్నదేమిటో రఘురామయ్యకు అర్ధం కాలేదు. అలాగే ఆవ్యక్తిని అనుసరించి వెళ్లాడు. అతను గుడిదగ్గరకు వెళ్లే సరికి అక్కడ జనమంతా గుమిగూడి వున్నారు. రఘురామయ్య వడివడిగా వాళ్ల దగ్గరకు వెళ్లి అక్కడ దృశ్యం చూసి నిశ్చేష్టుడై వుండిపోయాడు.