థేమ్స్‌!లండన్‌ నగర ప్రజల జల జీవధార!నదీతీరాన, నదికి సమాంతరంగా సాగే రోడ్డుకు ఒక వైపున, నగరం నడిబొడ్డున, ఒక బహుళ అంతస్తుల మేడ. సుమారు పాతిక అంతస్తులుంటాయి. దాని పైన చిట్టచివరన, రెండు పెంట్‌ హౌసెస్‌, ఒకదానికి స్వంతదారు సౌమ్యమూర్తి, ప్రవాస భారతీయుడు.యాభై ఏళ్ళ వయసులో వున్న అతను ఆ శుక్రవారం సాయంత్రం వేళ బయటకి వచ్చి పిట్టగోడనానుకుని వున్న ఊయలలో కూర్చుని నది వైపే చూస్తూ వున్నాడు.సౌమ్యమూర్తి మనసులోని ఆలోచనలు కూడా ఆ నదీ ప్రవాహంలాగే నిదానంగా ప్రవహిస్తూ స్థిరంగా వున్నాయి. అప్పుడప్పుడూ చిన్న చిన్న సుడులు నది మధ్యలో వస్తున్నట్టుగా ఆలోచనలు కూడా సుడులు తిరుగుతున్నాయి.దాదాపుగా పాతికేళ్ళ క్రితం తను చూసిన లండన్‌ నగరానికీ ఈనాటి లండన్‌ నగరానికీ తేడా ఏమిటని పోల్చుకోడానికి ప్రయత్నిస్తున్నాడు. అదే సమయంలో తను పుట్టి పెరిగిన ఊరు ఈనాడెలో వుంటుందోనన్న ఆలోచన కూడా ఏదో మూలన వుంది.అతని మనసులోని ఆలోచనలకు కారణం అతని చేతిలోని ఉత్తరం, సుదూరా తీరాల నుంచి వచ్చిన ఉత్తరం. ఇంటర్నెట్‌ ఈ మెయిల్‌ కాలంలో పోస్ట్‌ ద్వారా వచ్చిన సాధారణ ఎయిర్‌ మెయిల్‌!భారతదేశం నుంచి! తన స్నేహితుడు రాసిన ఉత్తరం.అతనికాశ్చర్యం తన అడ్రసు అతనికి దొరకడం! లండన్‌ వచ్చిన తరువాత ఏడాదిపాటు క్రమం తప్పక ఉత్తరాలు రాశాడు. తరువాత తను జీవితంలో కుదురుకునే క్రమంలో క్రమంగా రాతకోతలు తగ్గిపోయాయి. తరువాత పూర్తిగా కనుమరుగయ్యాయి.ఐతే ఇన్నేళ్ళ తరువాత తన అడ్రస్‌ ఎలా వెదికి పట్టుకోగలిగాడన్నదే విశేషం.

గత ఇరవై ఏళ్ళుగా మళ్ళీ భారతదేశం వైపు వెళ్ళలేదు. సరిగ్గా పాతికేళ్ళ క్రితం, ఆస్తులన్నీ అమ్మేసి, కుటుంబ సమేతంగా, కన్నవాళ్ళు తనను కాదనుకున్నా, వాళ్ళు నేర్పిన అప్పటి కుటుంబ సాంప్రదాయాలను తనతో తెచ్చుకుని లండన్లో స్థిరపడ్డాడు. అతను భారతదేశం విడిచి పెట్టే సమయానికి శ్వేతకు ఏడాది వయస్సు. అప్పుడు తనకు తోడుగా ఎయిర్‌పోర్టు వరకూ వచ్చి సాగనంపిన వ్యక్తి ఆ స్నేహితుడొక్కడే.స్వాతంత్య్ర సమరానికి ముందు ఎంతో మంది నాయకులు లండన్‌ వచ్చి ఇక్కడి విశ్వవిద్యాలయాల్లో చదివి తిరిగి స్వదేశం వెళ్ళిపోయి దేశ స్వాతంత్య్ర సమర కార్యక్రమంలో మునిగిపోయారు. తను స్వాతంత్య్రం వచ్చిన తరువాత పుట్టినందువల్ల సంగ్రామంలో పాల్గొనే అవసరం మాత్రం రాలేదు కానీ, చదివిన చదువుతో ఇతోధికంగా ఏదైనా అభివృద్ధి కార్యక్రమంలో పాలు పంచుకుని వుండవచ్చన్న ఆలోచన పలుమార్లు వచ్చింది. అయితే అది ఆలోచనలకే పరిమితమైంది. అందుకు అనేక కారణాలు, కొన్ని వ్యక్తిగతం, మరికొన్ని సామాజికం.

‘‘నదికిరువైపులా అపరిమితంగా పెరిగిన నగరం! ఒక పెద్ద కాంక్రీట్‌ జంగిల్‌, స్వచ్ఛమైన తెలుగులో చెప్పాలంటే కంకర కారడవి!ఈనాడటువంటి కారడవులు ప్రపంచంలో లెక్కకు మిక్కిలిగా వున్నాయి. రోజుకు రోజు ఇటువంటి కారడవుల విస్తీర్ణం పెరుగుతూంది. సహజంగానే ఈ కంకర కారడవిలో కూడా నిజమైన కారడవులకు మల్లే ఉడుతల్లాంటి అమాయక జీవులు మొదలుకొని పెద్ద పులులు, సింహాలను పోలిన అన్ని రకాల మనుషులూ వుంటారు.చేసిన వాగ్దానం నిలబెట్టుకోవడం కోసం కన్నబిడ్డను కాదనుకున్న పుణ్యకోటి వంటి గంగిగోవులు కూడా వుంటారు.