‘‘ఆదీ!... ఆదీ!’’ లోపల్నించి శిరీష పిలుపు వినిపించింది.ఆదిత్యకి పలకాలనిపించలేదు.. తను కూర్చున్న బాల్కనీలోంచి కదలాలనీ అనిపించలేదు... అమ్మ పిలుస్తూనే ఉంటుంది... కాస్సేపన్నా రిలాక్స్‌ అవనివ్వదు... కాలేజ్‌ నుంచి వచ్చి గంటసేపు కూడా ఆడుకోలేదు... ఆదిత్యకి చాలా కోపంగా ఉంది శిరీష మీద.. తనకి పదహారేళ్లు దాటుతున్నాయి. అయినా చిన్నపిల్లాడిలా ట్రీట్‌ చేస్తుందేంటో ఈ అమ్మ అనుకున్నాడు...ఆదిత్యకి శిరీష ఎందుకు పిలుస్తోందో తెలుసు... చదువుకో, చదువుకో అని చంపుకు తినడానికి... చదువు, చదువు... ఆ మాట వింటేనే చిరాగ్గా అనిపిస్తుంది. ఆడుకోనివ్వదు.... ఫ్రెండ్స్‌తో మాట్లాడనివ్వదు... ఎప్పుడూ నాలుగ్గోడల మధ్యే కూర్చుని క్లాసు పుస్తకాలతో ఫ్రెండ్‌షిప్‌ చేయాలంటుంది.. ఎంత బోర్‌!ఆదిత్య చూపులు కింద వాకిట్లో క్రికెట్‌ ఆడుతున్న కుర్రాళ్ల మీద కేంద్రీకృతమై ఉంది... వాళ్లంతా ఎంచక్కా ప్రతిరోజూ ఆడుకుంటారు. క్రికెట్‌, షటిల్‌ ఎన్ని ఆటలున్నాయి... ఎంతసేపూ వెధవ చదువేనా? పిల్లలన్నాక ఆడుకోవద్దా? వాళ్లంతా గంటా, గంటన్నరసేపు ఆడుకుని ఆ తరువాత ఇంట్లోకి వెళ్లిపోయి కాస్సేపు చదువుకుంటారు... టి.వి. చూస్తారు ఎంజాయ్‌ చేస్తారు.. వాళ్లంతా అదే అపార్ట్‌మెంట్‌లో ఉండే పిల్లలు.. ఆడపిల్లలంతే, మగపిల్లలంతే.... వాళ్లందరి ఇళ్లల్లో చాలామంది ఉంటారు. నలుగురుంటారు ఇద్దరు పిల్లలు, అమ్మా, నాన్న, కొంతమంది ఇళ్లల్లో వాళ్ల నాన్నమ్మలు, తాతయ్యలు కూడా ఉంటారు.... ఎప్పుడూ వాళ్లింటికి ఎవరో, వస్తూ పోతూ ఉంటారు... వాళ్లమ్మలు ఉద్యోగాలు చేయరు. ఇంట్లోనే ఉంటారు..కానీ, ఈ ఇంట్లో అమ్మా, తనూ... ఎప్పుడూ ఎవరూ ఈ ఇంటికి రారు... రెండు రోజులకోసారి వివేక్‌ అంకుల్‌ తప్ప ఇల్లంతా ఎప్పుడూ నిశ్శబ్దంగా, ఏంటోగా ఉంటుంది.... ఆ నిశ్శబ్దం అంటే ఆదిత్యకి భయం.. ఇల్లంతా సందడిగా ఉండాలని ఆదిత్య కోరిక... చుట్టుపక్కల ఫ్లాట్స్‌లో లాగా ఈ ఇల్లు ఎందుకుండదో అనిపిస్తుంటుంది.ఆదిత్యకెందుకో భయం వేసింది.... ఇలా ఒంటరిగా, కామ్‌గా ఉంటే భయం కదా... సాధారణంగా కామ్‌గా ఉన్న ఇంట్లో దయ్యాలుంటాయని విన్నాడు తను... కథల్లో కూడా అలాగే రాస్తారు. దయ్యాలున్న ఇల్లు నిశ్శబ్దంగా ఉంటుందని... కొంపదీసి... వణికిపోయాడు..‘ఆదీ పిలుస్తుంటే వినిపించడం లేదా? ఏం చేస్తున్నావిక్కడ?’’ శిరీష కొంచెం కోపంగా అరుస్తూ వచ్చింది బాల్కనీలోకి... ఆదిత్య బెదిరిపోయి లేచి నిలబడ్డాడు.

‘‘ఏం లేదు మమ్మీ... బోర్‌గా ఉంటే నూ’’ నసిగాడు...‘‘బోర్‌ ఏంటిరా చదువుకోక.. పద... పరీక్షలు దగ్గరకొస్తున్నాయి. ఫైనల్‌ ఇంటర్‌ అవగానే ఐఐటి కూడా రాయాలా? ఇలా టైం వేస్ట్‌ చేస్తే నీకు ర్యాంక్‌ ఎలా వస్తుంది... పద, పద... చదువుకో...’’ఆదిత్య మౌనంగా లోపలికి నడిచాడు...తన గదిలోకి వెళ్లిపోయి పుస్తకం తీశాడేగానీ చదవాలనిపించలేదు... ఏడుపొస్తోంది... ఏంటి ఈ ఇల్లు... అమ్మకి ఎందుకింత కామ్‌గా ఉండడం ఇష్టం... అసలు నాన్న ఏమయ్యాడు? ఎప్పుడు అడిగినా చెప్పదు అమ్మ.ఒకటి రెండుసార్లు అడిగాడు కూడా ‘‘అమ్మా! నాన్న ఎక్కడ? మనింటికి ఎందుకురారు?’ అని. ఖయ్యిమని లేచింది. ‘‘నీకెందుకురా ఆయన సంగతి... నీకేం తక్కువైంది ఇక్కడ. వెళ్లి చదువుకో వెధవ ఆలోచనలు మానేయి..’’బైట పిల్లలతో ఆడుకోనివ్వదు... ఎవరింటికీ వెళ్లనివ్వదు... వేరే ఫ్లాట్స్‌ వాళ్లతో కలవనివ్వదు... ఎందుకో ... ఆదిత్య కళ్లు పుస్తకం మీద ఉన్నాయి... కానీ, ఆలోచనలు మాత్రం ఎటో ఉన్నాయి...