ప్రారంభానికి ముందుగా...

‘రాజ్యం, ధనం కలకాలం ఒకరి దగ్గర వుండవు.’ అన్నది చరిత్ర చెబుతోన్న నగ్న సత్యం! క్రీ.శ.1565లో జరిగిన తళ్లికోట యుద్ధంతో విజయనగర సామ్రాజ్యం విచ్ఛిన్నమైపోయింది. హంపీ నుంచి పెనుగొండకు, అక్కడి నుండి చంద్రగిరికి జరిగిన రాజధాని మార్పిడి వల్ల అవశేషంగా వున్న రాజ్యం కూడా చిన్నాభిన్నమైపోయింది. రాయలేలిన సామ్రాజ్యం అంతరించి పోయింది. స్థానిక పాలకులు స్వతంత్రులయ్యారు. అలా స్వతంత్రులయిన వారిలో మైసూర్‌ పాలకుడు కృష్ణ స్వామి ఒడియార్‌ ఒకరు. అతని వద్ద ఓ చిన్న సిపాయిగా పనిచేసిన హైదరాలీ, విద్యాజ్ఞానం లేకున్నా, మంత్రాంగం పన్నడంలో దిట్ట. చకచక పావులు కదుపుతూ చివరికి మైసూరు రాజ్యానికే రాజయ్యాడు.అతని కొడుకు టిప సుల్తాన్‌ శౌర్య పరాక్రమాలు గల వాడిగా వినతికెక్కాడు. నూనూగు మీసాల ప్రాయంలోనే కత్తిపట్టి కదనరంగాన దుమికాడు. అతని జీవితం యుద్ధరంగానికే అంకితం అయింది. ఆంగ్లేయులతో నిరంతర యుద్ధాలు సాగిస్తూ ‘‘మైసూరు బెబ్బులి’గా పేరు గడించాడు. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా జరిగిన నాల్గవ మైసూరు యుద్ధంలో (క్రీ.శ.1799) పోరు సల్పుతూ ప్రాణాలు కోల్పోయాడు. రాజ్యం ముక్కలుగా విభజింపబడింది. యుద్ధంలో సహాయం చేసినందుకు గానూ నిజాం నవాబు అసఫ్‌ జాహి, మహారాష్ట్ర పీష్వాలు కొత్తరాజ్యాలు పొందారు.కర్నాటకలోని కొంత భాగం పీష్వాలకు, ఆంధ్రదేశంలోని కోస్తా నేటి రాయలసీమ ప్రాంతం నిజాం నవాబు ఏలుబడిలోకి వచ్చాయి. కొత్తగా చేజిక్కించుక్ను ఆంధ్రప్రాంతాలపై అధికారం సుస్థిరం చేసుకునేందుకు దృష్టి సారించాడు. నిజాం నవాబ్‌ ఆలీఖాన్‌ ఆసిఫ్‌ జాహీ! అయితే తాను అనుకొన్నది ఒకటి...అనుభవంలోకి వచ్చింది మరొకటి...పర్యవసానం...?

తెరిణెకంటి ముట్టడి

ప్రారంభం!

ఆరోజు క్రీ.శ.1800 సంవత్సరం అక్టోబర్‌ 12వ తేదీ!సికింద్రాబాద్‌లోని బొల్లారంలో వున్న సైనిక శిబిరం నుంచి బయలుదేరిందో సైనిక పటాలం! ఆ పటాలానికి ముందు గుర్రంపై ఠీవిగా కూర్చొని వున్నాడో యువకుడు. అతని పేరు ప్యాట్రిక్‌. బ్రిటీష్‌ వారి రాజ ప్రతినిధి. అతను తన పటాలాన్ని నిజాం నవాబు కోట వైపు నడిపించాడు.నిజాం నవాబు, గవర్నర్‌ కారన్‌ వాలీస్‌ ప్రవేశపెట్టిన సైన్య సహకార పద్ధతిని అంగీకరించి ఏటా ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అతని పొరుగు రాజులైన మహారాష్ట్ర పీష్వాల భయం లేకుండా చేసేందుకు, ఆంగ్ల ప్రభుత్వం తన సైన్యంలో కొంత అతని వద్ద వుంచింది. రానురాను బ్రిటీష్‌సైనికుల ఖర్చు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోవడంతో ఒక ఆ ఖర్చు భరించడం తన వల్ల కాదనుకొని నిశ్చయించుకొన్న నిజాం నవాబు ఆలీఖాన్‌ ఓ నిర్ణయానికి వచ్చాడు. అతని నిర్ణయం విన్న ఆంగ్ల ప్రభుత్వం ఎగిరి గంతేసింది. ఆ నిర్ణయం వ్రాత రూపకంగా వుండేందుకు, ఆంగ్లేయుల ప్రతినిధి ప్యాట్రిక్‌ హైదరాబాద్‌లో వున్న నిజాం నివాసానికి తన సైనిక పటాలంతో బయల్దేరాడు.ఓ గంట తర్వాత ప్యాట్రిక్‌ తన పటాలంతో నవాబు కోటను చేరుకున్నాడు. ఆ పటాలానికి నిజాం సైనికులు, ప్యాట్రిక్కుకు ఆలీఖాన్‌ ఎదురేగి స్వాగతం పలికారు.ఇరువురూ ఆశీనులయ్యాక ఆలీఖాన్‌ వంక చూస్తూ చెప్పాడు ప్యాట్రిక్‌‘‘ఈ రోజు మనం అగ్రిమెంట్‌ వ్రాసుకునే రోజు’’‘‘యాద్‌హై’’ అంటూ తలాడించి అడిగాడు ఆలీఖాన్‌