మూలం: పి.జి. వుడ్‌హౌస్‌

అనుసృజన: గబ్బిట కృష్ణమోహన్‌

ఉప్పలూరు, ఇందుపల్లి, గుడ్లవల్లేరు లాంటి పల్లెటూళ్ళని కలుపుతూ బందరు వెళ్ళే మీటర్‌ గేజి ప్యాసింజర్‌ ఆరోజు మధ్యాన్నం దట్టంగా పొగ విడుస్తూ బద్ధకంగా బెజవాడ స్టేషను వదిలి నత్తనడక సాగిం చింది. ఆ రైల్లో రోజూ క్రమం తప్పకుండా ప్రయాణం చేసేవాళ్ళు - బందరు చుట్టుపక్కలున్న గ్రామాల్నించి పాలబిందెల్తోనూ, పెరుగు కుండల్తోనూ తెల్లవారుఝామునే పాలబండిలో బయల్దేరి బెజవాడకి యివతలున్న సత్యనారాయణపురం స్టేషన్‌ బయట అమ్ముకునేవారు కొందరు; మరికొందరు బిందెల్నిండా తెచ్చిన పాలని హోటళ్ళకి సరఫరా చేస్తూ వూరి అవసరాలని తీర్చి పుణ్యం కట్టుకుంటారు. వర్తకం ముగించుకుని తిరిగెళ్ళేందుకు ఈ మధ్యాహ్నం రైలు మంచి సదుపాయం. దీంట్లో ప్రయాణం చేసే వాళ్ళందరూ విధిగా టిక్కెట్టు కొనే ఎక్కుతారని రైల్వేవాళ్ళుకూడా నమ్మరు.ఆ రైల్లో ఇంటర్‌ క్లాస్‌ సదుపాయం వుంది. డబ్బూ, దర్పం వున్నవాళ్ళు దాంట్లోనే ప్రయాణం చేస్తారు. ఇవాళ ఆ డబ్బాలో యిద్దరు ప్రయాణీకులుండటం విశేషం. వాళ్ళలో ఒకతను యువకుడు. నిండు విగ్రహం. భారీగా కండలు తిరిగున్న శరీరం. మొహం మాత్రం కమిలిపోయి నల్లగా బొగ్గు పులిమినట్టుంది. రెండో ప్రయాణీకుడు ఆ యువకుడికన్నా వయసులో యించుమించు ముప్ఫై ఏళ్ళు పెద్ద. వయసులో పెద్దవాడే అయినా సన్నగా, పొడుగ్గా వుండి, వెండి తీగెల్లా తెల్లగా మెరిసే మీసంతో దర్జాగా వున్నాడు. దానికి తోడు మిలమిల మెరిసే కళ్ల మూలాన చలాకీతనం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.

గతించిన కాలంలో ప్రతి నిమిషాన్నీ ఎంతో ఖుషీగా, వుల్లాసంగా గడిపినట్టూ; ముందురోజులు కూడా అదేవిధంగా గడపాలన్న పట్టుదల వున్నట్టు ముఖంలో స్పష్టంగా వెల్లడవుతోంది. టోపీ షోగ్గా నెత్తిమీద పక్కకి వొరిగించి పెట్టుకుని పైపు ముట్టించి తాపీగా పీల్చడం మొదలెట్టాడాయన. రైలు బయల్దేరి పది నిమిషాలైంది. ఇంతసేపూ నిశ్శబ్దమే వుంది వాళ్ళిద్దరి మఽధ్య. అప్పటిదాకా తోటి ప్రయాణీకుడిని కళ్ళ కొసల నించే గమ నిస్తూ కూచున్న యువకుడు, ఊహూఅంటూ గొంతు సవరించుకున్నాడు. ఆఁ ... ఆఁ ... అని గొణిగినట్టు చేశాడు. దానికా వయసుమళ్ళిన వ్వక్తి ఏమిటన్నట్టు తల పైకెత్తి చూశాడు. దాంతో అతను మరీ నల్లబడిపోయి నోరెందుకు విప్పానా అనవసరంగా అనుకుంటూ, ‘క్షమించాలి, తమరు జమీందారు సోమేశ్వర్రావుగారు కదూ?’ అని అడిగాడు.‘ఔను బాబూ, నేనే ఆయన్ని.’‘సంతోషం.’పెద్దాయన ఆశ్చర్యపడ్డాడు.‘ఆ సంగతంటే నాకే విపరీతమైన సంతోషం, మరి నీక్కూడా ఎందుకు బాబూ?’‘ఏం లేదండీ, మీరా కాదా అని సందేహం వచ్చింది.’ అలా అని, రైల్లోతారసపడ్డ ప్రతివాడినీ పలకరిస్తూ పోతుంటే ఏం తంటానో అనుకుని కొంచెం తటపటాయించాడతను. ‘అసలండీ, మిమ్మల్ని నేను బాగా ఎరుగుదును. మీవాడు శేషావతారమూ, నేనూ చిన్నపడు మీ యింట్లో ఆడుకుంటుండే వాళ్ళం. ఆ విధంగా మీ యింటికి తరచు వస్తూ పోతూ వుండేవాణ్ణి. మీకు గుర్తుందో లేదో, ఓసారి మీరు - ముద్దొస్తున్నావురా అంటూ పావలాకాసిచ్చి తాయిలం కొనుక్కోమన్నారు.’