‘నలుగురి మధ్యన కూర్చునీ ఏమిటా పరధ్యానం లక్ష్మీ! ఏమైంది నీకు? ఒంట్లో బాగుండ లేదా డాక్టర్‌ దగ్గిరకి వెడదామా?’’ అనునయంగా, జాలిగా కూడా అడుగుతున్న భర్తకి ఏం చెప్పాలో అర్థం కాక బోరున ఏడవడం ప్రారంభించింది లక్ష్మి. కారణం లేని ఏడుపు! ‘అరె ఎందుకా ఏడుపు? ఇప్పుడేమైంది!పద డాక్టర్‌ దగ్గరికి వెడదాం! అంటూ లేస్తున్న భర్తని చెయ్యి పట్టి ఆపింది.‘నేనొకటి అడుగుతాను.....నిజం చెప్తావా?‘‘నువ్వేం అడుగుతావు? నేను నిజం చెప్పనని ఎందుకనుకుంటున్నావు’’ ఆప్యాయంగా ఆమె తలపై చేయివేసి నిమురుతూ అడిగాడు భర్త. లక్ష్మికి దుఃఖం పొంగుకు వస్తుంది. భర్త ముఖంలోకి సూటిగా చూడలేకపోతోంది.‘‘లక్ష్మీ అనవసరపు ఆలోచనలు మాను. అడుగు! నేను నిజమే చెప్తాను. అబద్ధం చెప్పను’’ కాస్త తేలికగా అంటున్న భర్తని చివాలున తలెత్తి చేసింది.‘‘అందుకే...అందుకే అడగడానికింత అనుమానం. తెలిసిందా? కాస్త ఆవేశంగా అంది.’’‘ఛ అలా అనుకుంటావెందుకు? నేను నీకు అబద్ధం చెప్పానా? ఎప్పుడైనా? ఎందుకు చెప్తాను? నీకు కోపం తెప్పించే పని చేసినా కూడా నీతో నిజమే చెప్పాను కదా! అయినా లక్ష్మీ నువ్విలా రోజంతా అన్యమనస్కంగా వుంటూ నీలో నువ్వే దేనిలోనూ తెగని సమస్యతో సతమతమవున్నట్టుగా వుంటే మాకు ఎంత బాధగా....బెంగగా....భయంగా వుంటుందో వూహించుకోలేవా? చిన్నదాని ముఖంలో ఈ మధ్య ఎప్పుడైనా సూటిగా చూశావా? నిన్నే అది దొంగ చూపులు చేస్తోంది. ‘నాన్నా అమ్మకేమైంది...అలా వుంది’ అని అడుగుతుంది. పిల్లలిద్దరూ...నువ్వూ నేనూ పొట్లాడుకున్నాం అనుకుంటున్నారు.

నేనేం చెప్పగలను వాళ్లకి! వాళ్ల ప్రశ్నలకి సమాధానం నువ్వే చెప్పాలి. ‘అమ్మకి వంట్లో బాగలేదు’ అంటే డాక్టరెందుకు రాలేదంది పెద్దది. ’మరో పాప రాబోతుందా? అదిష్టం లేదా అమ్మకి అని అడుగుతోంది చిన్నది. ఇంత అర్థం లేని ఆరాటం పిల్లలకి అవసరమా? చెప్పు నువ్వే! అందరమ్మల్లాంటి దానివి కాదని వాళ్లు నమ్ముతున్నారు. నువ్వే వాళ్లకి అంతా నిజం చెప్తావని వాళ్ల నమ్మకం. నాకు తెలియని ఎన్నో నీకు బాగా తెలుసనీ, నువ్వే వాళ్లకి ధైర్యం యిచ్చేదానివని ఏ విషయమైనా అర్థం అయ్యేలాగా చెప్తావనీ వాళ్ల గట్టి నమ్మకం. నీ లాంటి అమ్మ తమ స్నేహితులెవరికీ లేదని గర్వపడిపోతారే. వాళ్లను నిరాశపరచకు, భయపెట్టకు, వాళ్ల నమ్మకం వమ్ము చేయకు, సరేనా! చెప్పు ఏమిటి నీ బాధ? ఏమిటీ నీ అనుమానం? దేనికి ఈ అర్థం లేని ఆరాటం. అలసిపోయిన వాడిలాగా లక్ష్మి భర్త కుర్చీలో జేరబడి కూర్చుంటూ జుబ్బా చేతితో ముఖం వత్తుకున్నాడు. ఈ చేష్టని చూసి కిసుక్కున నవ్వింది లక్ష్మి.

ఉలిక్కిపడి భార్య కేసి చూస్తూ వస్తున్న చిరునవ్వు దాచుకుని ‘ఇంకా అడగాలా? కోపం పోయిందా!?’ భార్య చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అడిగాడు.సుతారంగా అతని చేతిలోంచి తన చేతిని విడిపించుకుంటూ, అతని ముఖంలోకి సూటిగా చూసింది. ఆ చూపు ఏదో విషయం అడగానా? మాననా? అన్నట్టు అనిపించి ‘‘ఎందుకంతగా ఆలోచించడం, అడగడం అయిపోతే నేను వివరణ ఇచ్చుకోవడం మొదలు పెడతా! అన్నాడు కొంచెం నవ్వి.