‘‘అక్షరాల విత్తనాలను శ్రోతల మనోక్షేత్రంలో వెదజల్లటమే కవిత్వం...అక్షరాల నక్షత్రాలను పాఠకుల మనోవిను వీధిలో ప్రకాశింపజేయటమే కవిత్వం...’’‘ఎంత అర్ధవంతంగా వుందీ భావన... ఎంత మధురంగా వుందీ వర్ణన.... అక్షరాలను మొలకెత్తే విత్తనాలతోనూ, మెరిసే నక్షత్రాలతోనూ, అలంకరించే తోరణాలతోనూ, మంటలు రేపే అగ్నికణాలతోనూ... ఇలా పోల్చగలగటం... ఇలాంటి భావనలు మదిలో మెలగటం... నిజంగా అద్భుతం... అక్షరాలపై చేసిన అద్భుతమైన ప్రయోగం... అక్షరాన్ని ప్రేమించే మనసే కాదు... పూజించే భక్తి భావం వుండాలి... అక్షరయజ్ఞం చేయగలగాలి... ఆ సరస్వతీదేవి అనుగ్రహమూ పొందాలి.... అలా పొందగలిగిన ఆ మహాకవి నిజంగా ధన్యుడు...’ ఆలోచిస్తూన్న రేఖ గడియారం మోగటంతో ఉలిక్కిపడింది. సరిగ్గా పదకొండు గంటలు.. గుండెలు ఝల్లుమన్నాయి రేఖకు... ఇది పోస్టుమ్యాన్‌ వచ్చే సమయం... వేగంగా మేడ దిగి వచ్చి వీధి మలుపు వరకూ చూసింది... ఎక్కడా అతని జాడే లేదు.‘ఛఛ... ఈ పోస్టుమ్యాను ఒకడు ఎప్పుడూ లేటే’ తిట్టుకుంటూ గడియారం వంక చూసింది. పదకొండు గంటలా ఒక్క నిముషం... పోస్టుమ్యాను మలుపు తిరుగుతూ కనిపించాడు.‘పాపం ఒక్క నిముషానికేనా అతనిని తిట్టింది... తనకు మరీ తొందరెక్కువ...’’ తనని తానే తిట్టుకుంది రేఖ.

అతను... వచ్చేస్తున్నాడు... గుండె వేగంగా కొట్టుకుంది రేఖకు. సైకిల్‌ ఆగింది.. బెల్‌ మోగింది...అది సైకిల్‌ బెల్‌లా లేదు..వీణానందంలా... బిస్మిల్లాఖాన్‌ షెహనాయిలా... సుశీల గానంలా... కోయిల గీతంలా... పొడవైన తెల్లని కవరు బ్యాగులోంచి తీస్తున్న అతనిని చూడగానే... ఏ దేవుడో ప్రత్యక్షమై వరమిస్తున్న భావన... వణుకుతున్న చేతులతో అందుకుంది రేఖ.ఇదే... ఇదే... తను ఎదురు చూస్తున్న లేఖ. ఆనందంతో మురిసిపోయింది రేఖ.పరుగు పరుగున తన గదిలోకి వచ్చి తలుపేసుకుంది. ఇది మామూలు ఉత్తరమా... కాదు కాదు... తాను రెండేళ్ళుగా ఆరాధిస్తున్న ప్రముఖ కవి నరహరి రాసిన ఉత్తరం...‘‘తోకలేని పిట్ట తొంభై ఆమడలు పోతుందిప్రేమికులకు మేఘ సందేశం అవుతుందిఉత్తరాలను తలక్రింద పెడితే తీపి కలలు అవుతాయిచెక్కిలిని నొక్కుకుంటే ముద్దులవుతాయి’’.నరహరి రాసిన ‘తోక లేని పిట్ట’ రేఖ మనసులో మెదిలింది. ‘మరి ఈ ఉత్తరం తనకు ఏ సందేశాన్నిస్తుందో...’ ఆ ఉత్తరాన్ని అపురూపంగా గుండెకు హత్తుకుంది రేఖ. మెల్లిగా ఓపెన్‌ చేసింది... ఆ ఉత్తరంలో ఏ ప్రత్యేకతలూ లేవు. మామూలుగా సాగింది.... పి.జి. చేస్తున్న తనని బాగా చదువుకోమనీ, టెన్షన్‌ లేకుండా పరీక్షలు రాయమనీ, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దనీ... ఏదేదో ఆశించిన రేఖకు ఎంతో నిరాశ కలిగించిందీ ఉత్తరం...

‘ఛ... ఇదేమిటి యిలా రాసారు... వయసు, చదువు, ఉద్యోగం... ఇలా అన్ని వివరాలు కావాలని తను రాస్తే అదేమి రాయలేదే... ఇలా పోస్టు ఆఫీస్‌ అడ్రస్‌కాక యింటి వివరాలు చెప్పటం యిష్టం లేదా. లేక ఎవరికీ చెప్పరా... తను అడగటం తప్పా... మరి తప్పయితే కోపం వచ్చి వుండాలి.. ఎప్పటిలా పదిహేనో రోజు ఉత్తరం రాసారు... అంటే తనపై కోపం లేదు... మరెందుకు తన వివరాలు రాయలేదు... తను ప్రతి చిన్న విషయమూ అతనికి రాస్తూందే... అతనెందుకు రాయలేదు...’‘‘రేఖా...’’ తండ్రి కేక వినిపించి చటుక్కున ఉత్తరాన్ని దిండుకింద దాచేసి వడివడిగా మేడ దిగి వచ్చింది రేఖ. తండ్రి ‘శివరామ్‌’ ఏం చెపుతాడో రేఖకు తెలుసు. ఈ రోజు సాయంత్రం తనకి పెళ్ళి చూపులు... ఇరవై దాటిన ప్రతి ఆడపిల్లకీ వుండే సమస్యే యిది... ఎప్పుడూ యింట్లో పెళ్ళి గురించే ప్రస్తావించటం... ఎవరో ఒకరు రావటం... దానికోసమే ఎదురు చూస్తున్న ఆడపిల్లకయితే అదో అందమయిన అనుభవం... వచ్చేవాడు ఎలా వుంటాడో, తను నచ్చుతుందో లేదో, తనకు అతను నచ్చుతాడో లేదో... టెన్షన్‌... టెన్షన్‌....