‘‘కృపా గార్డెన్స్‌’’నగరంలోని అందమైన హోటల్‌ అది. అధునాతనమైన వసతులూ, అందమైన బిల్డింగ్‌, స్విమ్మింగ్‌పూల్‌ వగైరాలతో అది స్వర్గాన్ని మరిపిస్తుంటుంది. అక్కడి రూఫ్‌ గార్డెన్‌లో ఒక పార్టీ జరుగుతోంది.కీర్తి ఆతృతగా ఎవరికోసమో ఎదురుచూస్తోంది. ఇరవై నాలుగేళ్ళ వయసు, అయిదడుగుల ఆరంగుళాల ఎత్తు. బంగారు రంగు, శిల్పంలాంటి శరీరం, సిల్కులాంటి జుట్టు, చురుకైన కళ్లు...అందం, వివేకం, విజ్ఞానం కలబోసినట్లుంటుంది.కీర్తి పక్కన ఆమె లవర్‌ అనిల్‌ నిలబడి వున్నాడు. కీర్తి ఆతృత చూసి అతనికి నవ్వు వచ్చింది.‘‘మీ ఫ్రెండ్‌ వస్తుందిలే. పార్టీ ఎంజాయ్‌ చెయ్యకుండా ఏమిటా వెయిటింగ్‌?’’ అన్నాడు.కీర్తి పట్టించుకోలేదు. చుట్టూ మనుషులు అలా గలగలా నవ్వుతూ, తింటూ, తాగుతూ కబుర్లు చెపకుంటున్నా, ఆమె కళ్లు మాత్రం ఎంట్రన్స్‌ దగ్గరే అతుక్కుపోయాయి.‘‘ ఇపడు కాకపోతే మళ్లీ భ్రమరిని చూడడం కష్టం. రేపే తన అమెరికా ప్రయాణం. నీకు ఇంట్రడ్యూస్‌ చెయ్యాలని నా బాధ’’ అంది.‘‘భ్రమరి? ఏంటా పేరు?భ్రమల్లో బతుకుతుంటుందా ఏంటి?’’ నవ్వాడు అనిల్‌.‘‘నీకన్నీ జోక్సే. ఒక్కటీ సీరియస్‌గా తీసుకోవు’’ అంది కీర్తి చిరుకోపంతో.‘‘అదేమరి. నవ్వుతూ బతికేస్తే ఆయువు పెరుగుతుందంటారు.

ఎందుకు సీరియస్‌గా వుండడం? టేకిట్‌ ఈజీ పాలసీ. బెటర్‌’’ మళ్లీ నవ్వాడు అనిల్‌.కీర్తి నిరీక్షణ ఫలించింది. భ్రమరి ఎంట్రన్స్‌ దగ్గర కనిపించింది. తెల్లటి డ్రెస్‌లో పావురంలా మెరిసిపోతోంది.‘‘హాయ్‌ భ్రమరీ’’కీర్తి ఆనందంగా చెయ్యూపింది.భ్రమరి తనూ చేయి వూపింది. భ్రమరి, కీర్తిలతో పాటు చదివిన అర్చన కూడా రేపు అమెరికా వెళుతోంది. ఆమె ఇస్తున్న గెట్‌ టు గెదర్‌ పార్టీ ఇది.‘‘భ్రమరీ... ఇతడే అనిల్‌...’’ కీర్తి ఆనందంగా పరిచయం చేసింది.భ్రమరీ అనిల్‌నే పరీక్షగా చూస్తోంది. ఆమె మొహం ఒక్కసారిగా తె ల్లబడిపోయింది. మనిషి ఆందోళనగా టెన్షన్‌గా అయిపోయింది.‘‘నమస్తే’’ అన్నాడు అనిల్‌.భ్రమరి పట్టించుకోలేదు. ఏవో ఆలోచనల్లో పడిపోయి, అనిల్‌ వైపే చూస్తూ వుండిపోయింది.‘‘అనిల్‌...తను భ్రమరి...’’ అంది కీర్తి.అనిల్‌ ఈసారి ‘‘హాయ్‌’’ అన్నాడు.భ్రమరి దీనికి కూడా రెస్పాండ్‌ కాలేదు. అలాగే చూస్తూ వుండిపోయింది.‘‘హాయ్‌’’ గట్టిగా అరిచాడు అనిల్‌.భ్రమరి ఉలిక్కిపడింది. కీర్తి నవ్వేసింది.‘‘హాయ్‌’’ గొణిగింది భ్రమరి.ఆమె మొహంలో దిగులు, దుఃఖం కనిపిస్తున్నాయి. అనిల్‌ని చూసి ఎందుకింతగా డిస్టర్బ్‌ అయిపోయిందో కీర్తికి అర్థం కాలేదు.ఇంతలో అనిల్‌ని రఘు పిలిచాడు. అనిల్‌ అక్కడికి వెళ్లాడు. అతను ఎపడు వెళతాడా అని చూస్తున్నట్లుంది భ్రమరి వ్యవహారం.వెంటనే నోరు విప్పింది.

‘‘కీర్తీ... ఇతన్నేనా నువ్వు చేసుకోవాలనుకుంటున్నది?’’‘‘ఎందుకా సందేహం? అన్నీ ఆల్రెడీ చెప్పానుగా’’ కీర్తి నవ్వేసింది.‘‘అతడి కంపెనీలో నువ్వు పనిచేస్తున్నావని చెప్పావు. అంతే. అతడి పేరూ, వివరాలూ ఏమీ చెప్పలేదు. అతడి పేరు అనిల్‌ కుమార్‌. ఊరు రంగాపురం. జమీందారీ వంశం. ఒక్కడే కొడుకు. వాళ్లమ్మ అతడి చిన్నపడే చచ్చిపోయింది’’ గబగబా చెప్పింది భ్రమరి.‘‘నా కన్నా నీకే ఎక్కువ తెలుసులా వుందే’’కీర్తి నవ్వేసింది.భ్రమరి జాలిగా చూసింది.‘‘కీర్తీ... నేను అతణ్ని చూడడం ఎంత మంచి పనో తెలుసా. దేవుడు నిన్ను రక్షిస్తాడు. కీర్తీ...వెంటనే అతనికి నో చెప్పేసేయ్యి. ఈ పెళ్లి జరిగితే నువ్వు చాలా చిక్కుల్లో పడతావు. చిక్కుల్లో పడడం కాదు. అసలు నువ్వే వుండవు. చచ్చిపోతావు. ఆ దెయ్యం నిన్ను చంపేస్తుంది.’’ అంది భ్రమరి. ఆమె చేతులు వణుకుతున్నాయి. మొహంలో ఆందోళన, విచారం. అందులోనే కాస్త రిలీఫ్‌ కూడా కనిపిస్తోంది. బహుశా సమయానికి కీర్తిని సేవ్‌ చెయ్యగలిగానన్న ఆన0దం కావొచ్చు.