ఆమె విధి వంచితురాలు. ఆ ఫ్యాక్టరీలోకి వెళ్ళింది. ఏదైనా కూలి పని ఇప్పించమని అక్కడున్న సూపర్వైజర్‌ను అడగబోయింది. అంతలోనే అతడిని పోల్చుకుంది. చిన్నప్పుడు మనం కలిసి చదువుకున్నాం కదూ! అని అడిగింది. ఒకరినొకరు గుర్తుపట్టారు. ఆమె కష్టాలు విని అతడు కరిగిపోయాడు. ఆమెకు ఉద్యోగం ఇప్పించాడు. ఉండటానికి కాలనీలో ఇల్లు ఇప్పించాడు. తర్వాత ఇంకా ఏం చేశాడు?

పొద్దుపొడిచింది, టైము ఆరైంది.ఓ వ్యక్తి హడావుడిగా పడుతూ లేస్తూ ‘సాహెబ్‌గంజ్‌’ పోలీస్‌స్టేషన్‌లోకొచ్చాడు.సీనియర్‌ ఇన్‌స్పెక్టర్‌ భరత్‌ భూషణ్‌ ని చూసి, ‘‘సార్‌! అవతలివైపు వీధిలో హత్య జరిగింది. దేవిని చంపేశారు’’ కంగారుగా అన్నాడు.భరత్‌ భూషణ్‌ ఉలికిపడ్డాడు.‘‘హత్య!? ఎవరు చంపారు? నువ్వు చూశావా? అసలు నువ్వెవరు?’’ గబగబా అడిగాడు.‘‘‘చప్రా’లోని కొన్ని ఇళ్ళకు రోజూ పాలు పోస్తుంటాను. నా పేరు రామ్‌ప్రసాద్‌. ఇంతకుముందే దేవి ఇంటి ముందు నిలబడి సైకిల్‌ బెల్‌ కొట్టాను. ఎంతకీ బయటికి రాలేదు. తలుపు కొడదామని చెయ్యి వెయ్యగానే తలుపులు తెరచుకున్నాయి. గట్టిగా పిలిచాను. సమాధానం లేదు. ఎందుకో అనుమానం వచ్చి నాలుగడుగులు లోపలికేసి గదిలోకి తొంగిచూశాను. మంచంమీద దేవి శవం! భయంవేసింది. వెంటనే ఇలా పరుగెత్తుకొచ్చాను, మీ దగ్గరికి పరుగెత్తుకొచ్చాను, అంతకంటే నాకేం తెలియదు సార్‌’’ అన్నాడు భయంగా.

ఇద్దరు కానిస్టేబుల్స్‌తో వెంటనే బయలు దేరాడు భరత్‌. రామ్‌ప్రసాద్‌ దారి చూపించాడు. చప్రాలో ఉన్న ఫ్యాక్టరీ క్వార్టర్స్‌ ఆరో నెంబర్‌ ఇంటి ముందు పోలీసు జీపు ఆగింది.లోపలికెళ్ళిన ఇన్‌స్పెక్టర్‌ భరత్‌ అక్కడ కనిపించిన దృశ్యంచూసి నిర్ఘాంతపోయాడు. కానిస్టేబుల్స్‌ కొయ్యబారిపోయారు.పాతికేళ్ళలోపు వయసు గల యువతి శవం మంచంమీద నగ్నంగా పడి ఉంది. ఆమె ఛాతీ పొట్ట భాగమంతా రక్తం. దుప్పటి రక్తంతో తడిసిపోయింది. ముఖం భయంకరంగా కనిపిస్తోంది.అందరినీ వెనక్కి జరగమన్నాడు భరత్‌. జాగ్రత్తగా అడుగులేస్తూ వెళ్ళి క్షుణ్ణంగా పరిశీలించాడు. బుగ్గలపై, ఛాతీపైన పంటిగాట్లు, గోళ్ళ రక్కినట్టు కనిపిస్తోంది. అత్యాచారం జరిగిందన్నమాట. కనుగుడ్లు బయటికి పొడుచుకొచ్చాయి. గొంతు పిసికి చంపేయత్నం చేశారు. తర్వాత పదునైన ఆయుధంతో ఛాతీలో, పొట్టలో పొడిచి ఉంటారని అర్థమైంది భరత్‌కి.