‘‘నాకు మీరే న్యాయం చేయాలి’’తలెత్తి ఆమెవైపు చూశాడు డిటెక్టివ్‌ శరత్‌.ఇరవైఐదేళ్లలోపు వయసు అమ్మాయి. ఆధునికంగా ఉంది.‘‘కూర్చోండి. మీ సమస్య ఏమిటో, జరిగిన అన్యాయం ఏమిటో చెప్పండి’’ అన్నాడు శరత్‌ అనునయంగా.ఆమె విసురుగా కుర్చీలో కూర్చుంది. బ్యాగ్‌ టేబుల్‌పైన విసిరేసింది.

‘‘నన్ను ఎవరూ నమ్మటం లేదు. పైగా నన్నే దోషిలా చూస్తున్నారు. నేనేదో నేరం చేసినట్టు ప్రవర్తిస్తున్నారు. నా గురించి తమకే ఎక్కువ తెలుసు అన్నట్టు మాట్లాడుతున్నారు నా కన్నవాళ్ళు!’’ దాదాపు అరిచినట్టు చెప్పింది. కానీ ఆ అరుపులో క్రోధంకన్నా ఆక్రోశం ఎక్కువ ఉంది. దుఃఖం ఉంది.శరత్‌ మౌనంగా ఆమెవైపు చూస్తూ కూర్చున్నాడు.ఆమె కాస్సేపు మౌనంగా ఉంది. చివరికి నిట్టూర్చి, ‘‘నేను మానభంగానికి గురయ్యాను. ఐ వజ్‌ రేప్డ్‌’’ అని భోరున ఏడవటం ఆరంభించింది. ఆమెని ఏడవనిచ్చాడు శరత్‌. ఏడుపు ఉధృతి తగ్గిన తరువాత అడిగాడు మృదువుగా ‘‘జరిగింది ఏమిటో చెప్పండి’’.

‘‘చెప్పటానికి ఏమీలేదు. అదే నా బాధ’’‘‘మీరు చెప్పగలిగిందేమిటో చెప్పండి’’ అన్నాడు.ఆమె అటూ ఇటూ బెరుకుగా చూసి, మెల్లిగా ఆరంభించింది.‘‘నాపేరు అవని. సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తున్నాను. చిన్న సమస్యవచ్చి డాక్టర్‌ దగ్గరకు వెళ్లాను. మందులిచ్చి నాలుగురోజుల తరువాత రమ్మంది. రెండోసారి వెళ్లినప్పుడు డాక్టర్‌ ఫ్రీగా ఉంది. కాస్సేపు మాట్లాడుకున్నాం. కాఫీ తాగాం. తరువాత ఏమైందో నాకు తెలియదు. మెలకువ వచ్చేసరికి నర్సింగ్‌ హోంలో బెడ్‌మీద ఉన్నాను. లోబీపీ ఉందనీ, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోమని చెప్పింది. కానీ...కానీ... ఆ రోజు....’’