పొడుగ్గా, గుండ్రనిడబ్బాలా వున్న దాన్నేచూస్తున్నారు పోలీసు అధికారులు.‘‘అపూర్వ సాక్షి!’’ అనిపించింది చూస్తూంటే. లోపలేముందో విప్పి చూడలేని దీంతోచాలా తంటాలుంటాయని అప్పుడే తెలీదు. ‘‘అమెజాన్‌కి రాసి డేటా తీయించాలి’’ అనుకున్నారు. కచ్చితంగా మర్డర్‌ ఎలా జరిగిందో ఇది సాక్ష్యమిస్తుందని నోటీసులిచ్చారు. ప్రైవసీ చట్టాలు ఒప్పుకోవని వచ్చిన జవాబు చూసి, ‘‘నీతో కూడా ప్రైవసీతంటాలేనా అలెక్సా?’’ అని దీనంగాచూశారు డబ్బాలా వున్నఅమెజాన్‌ ఎకో వైపు.

అమెరికాలోని బెంటన్‌ విల్లీ పట్టణంలో ఆ రాత్రి. మ్యాచ్‌ చూద్దామని ఫ్రెండ్స్‌ ఇద్దరిని పిల్చాడు బేట్స్‌, ‘‘అలెక్సా, ఇప్పుడొస్తున్న సాకర్‌ మ్యాచ్‌ పెట్టు’’ అన్నాడు. అటు టేబుల్‌ మీద ఠీవిగా కొలువు దీరిన అమెజాన్‌ ఎకో, టీవీలో సాకర్‌ మ్యాచ్‌ పెట్టింది. బేట్స్‌ భార్య వచ్చి, ‘‘అలెక్సా, సాఫ్ట్‌ మ్యూజిక్‌ వుంటే పెట్టమ్మా’’ అంది. మ్యూజిక్‌ సిస్టమ్‌లో సాఫ్ట్‌ మ్యూజిక్‌ మొదలైంది. ‘‘అలెక్సా, ఏం మ్యూజిక్‌ పెట్టావమ్మా?’’ అనడిగింది.‘‘రిలాక్స్‌ డైలీ’’ అని చెప్పింది ఎకో. ఫ్రెండ్స్‌తో బీరూ వోడ్కా సేవిస్తూ మ్యాచ్‌ ఎంజాయ్‌ చేశాడు బేట్స్‌. తెల్లారే 911కి కాల్‌ చేశాడు కంగారుగా. పోలీసు టీం దిగిపోయారు. బేట్స్‌తో బాత్‌ రూమ్‌లో కెళ్ళారు. టబ్‌ నీళ్ళల్లో వెల్లికిలా శవం... 47 ఏళ్ల మాజీ పోలీసు అధికారి కొలీన్స్‌. కలవరపడి, ఏం జరిగిందని అడిగారు.

రాత్రి ఇతనితో, ఇంకో ఫ్రెండ్‌తో కలిసి మ్యాచ్‌ చూస్తూ నిద్రవస్తే ఒంటి గంటకు వెళ్లి పడుకున్నాననీ, తెల్లారిలేచి చూస్తే ఇలా కన్పించిందనీ చెప్పాడు బేట్స్‌. కొలీన్స్‌ ఎడం కన్ను, కింది పెదవి చిట్లి వున్నాయి. టబ్‌ పక్కన సీసా పగిలి వుంది. అక్కడంతా రక్తముంది. తాగిన మైకంలో ప్రమాదవశాత్తూ జరిగిన మరణంలా లేదు. రెండో ఫ్రెండ్‌ గురించి అడిగితే, తను నిద్రపోబోతూండగా వచ్చి ఇంటికెళ్తున్నట్టు చెప్పేసి వెళ్లిపోయాడని చెప్పాడు బేట్స్‌. వారం తర్వాత హత్యని నిర్ధారిస్తూ పీఎం రిపోర్టు రావడంతో బేట్స్‌ని అరెస్ట్‌ చేశారు. ఇంట్లో చూస్తే స్మార్ట్‌ హోం డివైసులు చాలా వున్నాయి. నెస్ట్‌ థెర్మో స్టాట్‌, హనీవెల్‌ అలారం, వైర్లెస్‌ వెదర్‌ మానిటరింగ్‌ సిస్టం, అమెజాన్‌ ఎకో...