అర్ధరాత్రి ఆ ఇంట్లో కేకలకి లేచి పరుగెత్తుకెళ్ళింది అంజుం. కర్ర తీసుకుని భార్యని బాదుతున్నాడు ముఖేష్‌.‘‘వాణ్ణెందుకు చూస్తున్నావే, వాణ్ణెందుకు చూస్తున్నావ్‌!’’ అంటూ రాక్షసుడిలా అరుస్తూ, చావబాదుతుంటే కింద పడి కొట్టుకుంటూ, తను అలాంటి దాన్ని కానని బతిమాలుకుంటోంది గీత.

ఇంట్లో పదిమంది నించుని ఇదంతా చూస్తున్నారు. ఇక ఆగలేక అంజుం అడ్డుపడి గీతని పట్టుకుని లాగబోయింది. అంతే, ఆమెని తోసేసి కర్రతో గీత తల మీద కొట్టి కొట్టి వదిలేశాడు. ప్రాణాలు వదిలేసి కుప్పకూలింది గీత. 

‘‘అది హత్యే, కానీ గంటలో కేసు మారిపోయింది. ముఖేష్‌ని వదిలేశారు...’’ అంజుం చెప్పుకుపోతూంటే ముఖేష్‌ తమ్ముడు అడ్డుతగిలి, ‘‘తప్పు చేసినందుకు అనుభవించింది, అన్న చేసింది న్యాయం. అదిగో అటు చూడండి... అదే న్యాయం...’’ అంటూ వీధిలోకి చూపించాడు.ఎలెన్‌బారీ అటు చూస్తే.. ఇంకో అమ్మాయిని బైక్‌ ఎక్కించుకుని పోతున్నాడు ముఖేష్‌.‘‘నిన్ననే పెళ్లి చేసుకున్నాడు. కొత్త వదిన పేరు గీతగా మార్చాడు’’ చెప్పాడు. పోలీస్‌స్టేషన్లో ఎలెన్‌బారీని చూసి అధికారులు కానిస్టేబుల్‌నిచ్చి పంపారు.

కానిస్టేబుల్‌ జహంగీర్‌ ఆమెని బయట చెట్టు కింద బెంచి మీద కూర్చోబెట్టుకుని చెప్పసాగాడు... ‘‘అది ప్రమాదమే. మిద్దె మీద పడుకుంది. బాత్రూంకని లేచి చెక్కమెట్లు దిగుతూ దొర్లిపడిపోయింది. తల పగిలి చచ్చిపోయింది...’’‘‘వేరే దెబ్బలు కూడా తగిలాయి కదా?’’ ‘‘కర్రతో తల మీద కొడితే అది ఒక్కటే(తల) పగిలి చచ్చిపోతుంది. మెట్ల మీద దొర్లిపడితే అలా చాలా దెబ్బలు తగులుతాయిగా?’’ ‘‘దొర్లి పడ్డా మెడ విరగలేదు కదూ? ఆమెని భర్త కొట్టాడని చుట్టూ పక్కల ఎవరూ చెప్పలేదా?’’ ‘‘మేడం, ఇక చాలు. మీ ఫారినర్స్‌తో ప్రాబ్లం ఏంటంటే, ఇండియా గురించి నీచంగా మాట్లాడతారు. జరగరాని ఘోరాలు ఇక్కడే జరిగిపోతున్నాయనీ, డెవలప్‌ కావాలంటే ఇంకో వందేళ్ళు పడుతుందనీ జోకులేస్తారు. చాలు, ఇక వెళ్ళండి మేడం...’’

ముఖేష్‌ వదినెలిద్దరూ చెబుతున్నది వింటోంది ఎలెన్‌. గీతని ముఖేష్‌ కొట్టి చంపేశాడనీ, తామే రక్తమంతా పేడతో అలికి కడిగేశామనీ, ముమ్మాటికీ అది హత్యేననీ చెబుతున్నారు వాళ్లు. ఇంట్లో ఆడవాళ్ళను బానిసలకంటే హీనంగా చూస్తారని గోడు వెళ్లబోసుకున్నారు. ఎలెన్‌ మిద్దె మీదికెళ్ళింది. అక్కడ ముఖేష్‌ కొత్త భార్య గీతతో ఉన్నాడు. ఆమె ప్రేమగా కాకరకాయలు కోసి చూపిస్తోంది. ఎలెన్‌ నెమ్మదిగా మాటల్లో పెట్టింది. అతను చంపానని చెప్పేశాడు. గీత సమర్థించింది. అలాంటి ఆడదాన్ని చంపాల్సిందేనంది. పేరుతో బాటు, ఆమె పెట్టుకున్న నగలు చనిపోయిన గీతవే. అత్తగారు ఇచ్చిందని చెప్పింది. గీత మేకప్‌ బాక్సు కూడా అత్తగారు తీసిచ్చిందని చెప్పింది.