ఉదయం 8.30కి పిల్లల్ని బస్సెక్కించి ఆఫీసుకి బయల్దేరాడతను. కొంత దూరం వెళ్లాక, అలారం ఎలర్ట్‌ రావడంతో వెనక్కి వచ్చాడు. 8.45 నుంచి 9.00 గంటల మధ్య ఇంటికి వచ్చేటప్పటికి భార్య జిమ్‌కెళ్ళి పోయింది. ఏం జరిగిందా అని చెక్‌ చేసుకుంటూ పై గదిలో కెళ్ళాడు. అక్కడ కంప్యూటర్‌లో... ఆఫీసు సూపర్‌వైజర్‌కి తన ఆలస్యానికి కారణం తెలుపుతూ ఈమెయిల్‌ పెట్టాడు.

ఎందుకో వెనక్కి చూస్తే, ఒకడు నిలబడి వున్నాడు. ఫుల్‌ సూటులో, మొహానికి మాస్కు ధరించి వున్నాడు. ‘ఎవర్నువ్వు?’ అంటూండగానే భార్య వచ్చినట్టు అలికిడైంది. రావొద్దంటూ కిందకి పరుగెత్తబోతూంటే, ఆ మనిషి పట్టుకుని మణికట్టు మీద ప్రెషర్‌ పాయింట్స్‌ నొక్కి చలనం లేకుండా చేశాడు. కిందికి దూసుకెళ్ళి రెండు బుల్లెట్స్‌ పేల్చాడు. తిరిగి అదే టెక్నిక్‌తో అతణ్ణి చలనం లేకుండా చేసి కుర్చీకి కట్టేశాడు. లైటర్‌తో మొహం కాల్చ బోయాడు. ఆ లైటర్‌ లాక్కుని వాడి మాస్కుకి అంటించగానే మొహం పట్టుకుని అరుస్తూ పారిపోయాడు. అతను తేరుకుని పోలీసులకి ఫోన్‌ చేశాడు.రిచర్డ్‌ డిబేట్‌ చెప్పిందంతా విని ఆలోచనలో పడ్డారు కనెక్టికట్‌ పోలీస్‌ టీమ్‌.

డిబేట్‌ భార్య కోనీ మృతదేహం కింద పడుంది... రక్తం మడుగులో. ఆమె ఎడమ చేతికి ఫిట్‌ బిట్‌ బ్యాండ్‌ అలాగే ఉంది. హంతకుడి జాడ కోసం జాగిలాల్ని రప్పించినా ఫలితం లేకపోయింది. ఫోరెన్సిక్‌ టీమ్‌ శోధన మొదలెట్టింది. పోలీసులు చర్చించుకుని, డిజిటల్‌ ఫింగర్‌ ప్రింట్స్‌ కోసం డిబేట్‌, కోనీల సెల్‌ ఫోన్లు, కాల్‌ రికార్డ్స్‌, ఫేస్‌బుక్‌ రికార్డ్స్‌, కంప్యూటర్లు, ఇంటి అలారం లాగ్స్‌, కోనీ వాడుతున్న ఫిట్‌ బిట్‌ రికార్డ్స్‌, డిబేట్‌ లాప్‌ టాప్‌- వగైరాలన్నిటిపై వారంట్‌ తెచ్చుకుని జప్తు చేశారు.ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ అందుబాటులోని డిజిటల్‌ ఫింగర్‌ ప్రింట్స్‌ని సింక్రొనైజ్‌ చేయసాగింది. డిబేట్‌ మామూలుగా ఆఫీసుకి పోతూ వస్తూ ఉన్నాడు. వారం రోజులు గడవగానే భారీగా పోలీస్‌ టీమ్‌ అతడి ఇంటి ముందు వాలిపోయింది.

‘మిస్టర్‌ రిచర్డ్‌ డిబేట్‌, నువ్వు జీవిస్తున్నది డిజిటల్‌ ప్రపంచంలో. నీ ప్రతీ డిజిటల్‌ వేలిముద్రా రికార్డయి పోతుంది. డిజిటల్‌ ప్లాట్‌ ఫామ్స్‌లో నువ్వేది క్లిక్‌ చేస్తే అది నీ వేలిముద్రై పోతుంది. చెరపలేవు. నువ్వు సెల్‌ ఫోన్‌ వాడినా, ఫేస్‌ బుక్‌ వాడినా, ఏదైనా వెబ్‌ సైట్‌ చూసినా తక్షణం అవి నిన్ను ఫిక్స్‌ చేసేస్తాయి. నువ్వెన్ని డిజిటల్‌ పరికరాలు, యాప్స్‌ వగైరా వాడితే అంతగా నీ చుట్టూ... నీ వేలిముద్రలతో నువ్వు వల బిగించుకున్నట్టే. స్వయంగా నువ్వే సృష్టించుకునే డిజిటల్‌ ట్రాప్‌ నుంచి అస్సలు బయటపడలేవు. తప్పించుకోలేవు.