‘‘హలో, మీరు వెంటనే రండి! ఇక్కడ కమాండెంట్‌ని కలవడానికొచ్చిన మీ రిపోర్టర్‌కేదో జరిగింది...’’ అని సీనియర్‌పోలీసాఫీసర్‌ నుంచి వచ్చిన కాల్‌మధ్యలోనే కట్‌ కావడంతోకంగుతిన్నాడు శాందన్‌ పత్రిక ఎడిటర్‌ సుబల్‌ డే. తేరుకుని టిప్పుసుల్తాన్‌కి కాల్‌ చేసి విషయంచెప్పాడు.

అరగంట తర్వాత టిప్పుసుల్తాన్‌ ఎడిటర్‌కి కాల్‌ చేసి చెప్పాడు, లోపలికి రానివ్వడం లేదని!స్వయంగా బయల్దేరి వెళ్ళాడు సుబల్‌ డే, త్రిపుర రాజధాని అగర్తలకి ఇరవై కిలోమీటర్ల దూరంలో వున్న త్రిపుర స్టేట్‌ రైఫిల్స్‌ (టీఎస్‌ఆర్‌) సెకెండ్‌ బెటాలియన్‌ హెడ్‌ క్వార్టర్స్‌కి. అక్కడి పరిస్థితి చూసి గుండె దడ మొదలైంది...చీఫ్‌ ఇన్వెస్టిగేటివ్‌ రిపోర్టర్‌ సుదీప్‌ దత్తా బైక్‌ గేటు బయటే ఆపి ఉంది. రిపోర్టర్‌ టిప్పుసుల్తాన్‌తో కలిసి అతికష్టంమీద లోపలికి వెళ్లాడు సుబల్‌. కమాండెంట్‌ ఆఫీసుకి చేరుకున్నాడు. గచ్చు తడిగా ఉంది, తలుపు ఎర్రగా వుంది. గబరాగా చూస్తూంటే, జూనియర్‌ ఆఫీసర్‌ వచ్చి తీసుకెళ్ళిపోయాడు. కాలి బాట గుండా నడుస్తూంటే ఎర్రగా ఉంది. ఆవరణలో చాలా దూరం తీసికెళ్ళి ఆగాడు జూనియర్‌ ఆఫీసర్‌, ‘‘మీ రిపోర్టర్‌ తపన్‌ సర్‌తో గొడవపడి పారిపోతూంటే, ఆయన పర్సనల్‌ బాడీగార్డ్‌ ఫైరింగ్‌ ఓపెన్‌ చేశాడు. మీ రిపోర్టర్‌ ఇక్కడ పడిపోయాడు....’’ అని చూపించాడు. ‘‘ఎక్కడున్నాడిప్పుడు?’’ ’‘హాస్పిటల్లో...’’హాస్పిటల్‌కు ఉరికాడు సుబల్‌.

అక్కడ సుదీప్‌ దత్తా రక్తసిక్త మృతదేహం. ఒళ్ళంతా వొరుసుకుపోయి, కడుపు మీద రెండు తూటా గాయాలతో... ‘నోనో! ఇదబద్ధం! ఆఫీసులో షూట్‌ చేసి తీసికెళ్ళి అక్కడ పడేశారు! ఆఫీసులో గచ్చు కడిగేశారు! తలుపు మీద చిమ్మిన రక్తం అలాగే ఉంది! కాలిబాటంతా రక్తముంది! ఈడ్చుకుంటూ వెళ్లారు! బాడీ ఇలా రప్చర్‌ అయ్యింది!...’’ అరవసాగాడు సుబల్‌.‘‘పారిపోతూంటే కాలిస్తే, బుల్లెట్లు వీపులో తగలకుండా కడుపులో ఎలా తగుల్తాయి సర్‌?’’ సుబల్‌ ప్రశ్నకి సాలోచనగా చూశాడు ఐజీ నాథ్‌, ‘‘అసలేం జరిగింది?’’ అనడిగాడు.‘‘కమాండెంట్‌ తపన్‌ పిలిస్తే వెళ్ళమన్నాను సుదీప్‌ని. మాటలు రికార్డు చేయమన్నాను, నోట్స్‌ తీసుకోమన్నాను. తపన్‌ పాల్పడ్డ పదికోట్ల అవినీతిని సుదీప్‌ రిపోర్టు చేశాడు. ఇంకా వివాహేతర సంబంధం కూడా ఉందని తెలిసి దానిపైనా రిపోర్టిచ్చాడు. ఇవి మా పేపర్లో వచ్చేసరికి, వివరణ ఇస్తాను రమ్మన్నాడు తపన్‌. మా స్కూప్స్‌ వల్ల తపన్‌కి ఐపీఎస్‌ కన్ఫర్మేషన్‌ ఆగిందని కూడా మాకు తెలుసు. ఈ కక్ష పెట్టుకునే ఎటాక్‌ చేశాడు సర్‌!’’ చెప్పాడు సుబల్‌.