దట్టమైన పోక్లా అడవుల్లో సాగిపోతున్న వాహనం లోంచి తొంగి చూస్తూ, ‘‘ఇంకెంత?’’ అన్నాడు ఇన్‌స్పెక్టర్‌ బంబం కుమార్‌. మరికాస్తన్నాడు గ్రామ చౌకీదారు. కొంత దూరం వెళ్ళాక గుంపుగా జనం వున్నారు. దిగివెళ్లి చూశాడు కుమార్‌. అట్టకట్టిన రక్తపు మరకలు.

ఉదయం నుంచీ పోలీస్‌ స్టేషన్‌కి కాల్స్‌ వస్తున్నాయి ప్రజల నుంచి. అడవిలో రక్తపు మరకలు కన్పిస్తున్నాయని. జంతువేదో దాడి చేసినట్టుంది చూస్తూంటే. ఆ రక్తపు మరకల్ని అనుసరించి వెళ్తూ వెళ్తూ వంద అడుగుల దూరంలో ఠక్కున ఆగిపోయాడు. కంగారు పుట్టింది... వెంటవెంటనే అక్కడికి మరింత మంది పోలీసులు చేరుకున్నారు. కూలీలొచ్చారు. ఆఖర్న వచ్చిన మేజిస్ర్టేట్‌ సమక్షంలో తవ్వకం మొదలయ్యింది. తవ్విపోస్తున్న మట్టిలో తెల్లగా ఏవో కలిసిపోయాయి. తవ్వాక గొయ్యిలోకి చూసి మాన్పడిపోయారందరూ. రెండు అర్ధనగ్న మృతదేహాలు: ఒకమ్మాయి, ఒకబ్బాయి. ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రం, కుంతి జిల్లా, ముర్హు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పోక్లా అడవుల్లో బయటపడ్డ మృతదేహాల వివరాలందాయి కుమార్‌కి. అబ్బాయి టింట్లస్‌ బోద్రా, అమ్మాయి పెమినా వాద్రి. ఇద్దరి వయసూ పాతికలోపే. టింట్లస్‌ చిన్నఉద్యోగం చేస్తున్నాడు, పెమినా డిగ్రీ చదువుతోంది. వాళ్ళిద్దరికీ నిశ్చితార్ధం జరిగిందని చెప్పారు బంధువులు.

గిరిజన ఆచారం ‘లోటా పానీ’ ప్రకారం నిశ్చితార్ధం జరిగాక కలిసి ఉండచ్చని చెప్పారు. పోస్ట్‌మార్టం రిపోర్టు పరిశీలిస్తూ కుమార్‌తో అన్నాడు డీఎస్పీ రణవీర్‌ సింగ్‌, ‘‘రేప్‌ లేదు, ఘర్షణ లేదు. సడన్‌ ఎటాక్‌. కడ్డీలతో తలల మీద మోది చంపారు. ఇద్దరి ఒంటి మీదా కుర్తాలు లేవు. రక్తపు మరకలు వంద అడుగుల మేర ఉన్నాయంటే అవి మొదలైన చోటే మర్డర్స్‌ జరిగుండాలి. శవాల చర్మాలు ఒరుసుకుపోయి ఉన్నాయంటే అక్కడ్నించీ ఈడ్చుకుంటూ వెళ్లి వుండాలి. చంపాక గొయ్యి తవ్వడానికి వాడిన పనిముట్లేమిటి? ఆ కుర్తాలు, ఈ పనిముట్లు సెర్చ్‌ చేయండి...’’కేసంతా విని రణవీర్‌తో అన్నాడు ఎస్పీ అనీష్‌ గుప్తా, ‘‘లవ్‌ యాంగిల్లో చూడండి, ఈ లోటాపానీ రిలేషన్‌షిప్‌ ఎవరికో నచ్చివుండదు. ఆ లవరెవరో కనుక్కోండి’’