చెత్త ఏరుకునే ఇద్దరు కుర్రాళ్ళు ఆ బాక్సుల చుట్టూ తిరిగి చూస్తున్నారు. ఒక బాక్సులోంచి కొయ్యబారిన చెయ్యి ఒకటి బయట వేలాడుతోంది. భయంతో అరుస్తూ పరుగుతీశారు. పోలీసు లొచ్చారు. డంప్‌యార్డ్‌లో రెండు బాక్సుల్లో రెండు అర్ధనగ్న శవాలు. ఒక శవం చిత్రకారిణి హేమది, రెండో శవం ఆమె లాయర్‌ హరీష్‌ది... ముందు రోజే వీళ్ళిద్దరి మిస్సింగ్‌ కేసులు నమోదయ్యాయి.ముంబయి చిత్రకళా ప్రపంచం హాహాకారాలు చేసింది ఈ అకృత్యానికి...

ఇన్‌స్పెక్టర్‌ సుధీర్‌ దాల్వీ కాండివిలీలోని లాల్జీపద బయల్దేరాడు. ఇంకోవైపు ఇక్కడికి దూరంగా వారణాసి రైల్వే స్టేషన్‌ దగ్గర, అనుమానాస్పదంగా కన్పిస్తున్న ఒకణ్ణి స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ ఎస్పీ అమిత్‌ పాఠక్‌ పట్టేసుకున్నాడు. వాడి దగ్గర ఏటీఎం కార్డులు, సిమ్‌ కార్డులు చూసి, ‘‘ఎక్కడివిరా ఇవీ?’’ అని రెండు పీకాడు.ఇన్‌స్పెక్టర్‌ దాల్వీ లాల్జీపద చేరుకుని ఒక ఫ్యాబ్రికేషన్‌ యూనిట్‌ దగ్గర ఆగాడు. యూనిట్‌ తాళం వేసి వుంది. శవాలు దొరికిన కార్డు బోర్డు బాక్సుల మీద వాటి తయారీ వివరాలు ఈ అడ్రసువే వున్నాయి. చిత్రకారిణి హేమ చివరి కాల్‌ ఈ ఏరియాలోని విద్యాధర్‌కే వచ్చింది.

విద్యాధర్‌ ఈ యూనిట్‌ ఓనర్‌. ఫోన్‌ పలకడం లేదు.చుట్టుపక్కల ఇళ్ళల్లో సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించడం మొదలెట్టాడు దాల్వీ. ఒక ఫుటేజీలో గతరాత్రి యూనిట్‌లోంచి ఒక వ్యాను బయటికి పోతూ కన్పించింది. గంటలో ఆ వ్యాను డ్రైవర్‌ విజయ్‌ దొరికాడు.‘‘తెలీదు సార్‌, వాటిలో శవాలున్నాయని తెలీదు. లోపలేం జరిగిందో నాకు తెలీదు!’’‘‘ఎక్కించిందెవరు, దింపిందెవరు బాక్సుల్ని? అది చెప్పు!’’‘‘యూనిట్‌ వర్కర్స్‌ సార్‌... ఆజాద్‌, ప్రదీప్‌, సాధు...’’వారణాసిలో ఎస్పీ పాఠక్‌కి సాధు చెప్పేస్తున్నాడు. అంతా విని, ‘‘హేమ గార్ని చంపేశారా?’’ అని పై అధికారులకి సమాచారమందించసాగాడు పాఠక్‌.‘‘ఓనర్‌ ఎక్కడ?’’ అడిగాడు విజయ్‌ని దాల్వీ. దాల్వీ దగ్గర అప్పటికే సమాచారముంది. ఫ్యాబ్రికేషన్‌ యూనిట్లో హేమ తన చిత్రకళకి సంబంధించిన పనులు చేయిస్తుందనీ, ఈ చనువుతో హేమ దగ్గర విద్యాధర్‌ ఐదు లక్షలు అప్పు తీసుకున్నాడనీ, దీని గురించి ఇద్దరి మధ్యా గొడవలున్నాయనీ.