రహస్యంగా చెబుతున్నాడతను, ‘‘31వరకూ అతన్నాపండి.140 కోట్లు మీరేం కట్టనవసరంలేదు, నేను చూసుకుంటా! బేఫికర్‌గా ఉండండి...బహుత్‌ సీదీ బాత్‌ హై సాబ్‌,క్యా?’’ ఎన్‌.డి.ఎం.సి(న్యూ ఢిల్లీ మునిసిపల్‌కౌన్సిల్‌) ఉద్యోగి మాటలకి సరేనన్నాడు రమేష్‌ కక్కర్‌.మర్నాడు కక్కర్‌చెబుతున్నది రాం ఫూల్‌విని, ‘‘పెద్ద నెట్‌వర్క్‌లోకివెళ్ళాలి సాబ్‌’’ అన్నాడు. టైం లేదన్నాడు కక్కర్‌.

మూత బడ్డ ‘కక్కర్‌ నైట్‌క్లబ్‌’ బౌన్సర్లలో ఒకడైన రాం ఫూల్‌ వెళ్లి, తోటి బౌన్సర్‌ ఇస్రాయిల్‌ని కలిశాడు. ఇద్దరూ న్యూ దిల్లీ కాంట్రాక్ట్‌ కిల్లింగ్‌ నెట్‌వర్క్‌ని తెలుసుకుంటూ బయల్దేరారు. ఇందులోకి ఇప్పుడు కొత్త కుర్రాళ్ళు దిగుతున్నారు. ఐదు వేలిచ్చినా చంపి పారేస్తారు. కుట్రదారుడు మొదట లోకల్‌ క్రిమినల్‌ని పట్టుకోవాలి. ఈ లోకల్‌ క్రిమినల్స్‌ చిల్లర నేరగాళ్ళై ఉంటారు. వీళ్ళు కుట్రదారుణ్ణి బాస్‌తో కలుపుతారు. బాస్‌ కాంట్రాక్ట్‌ కిల్లర్స్‌ని కలుపుతాడు. అప్పుడు డీల్‌ ఫిక్స్‌ అవుతుంది. కిల్లర్స్‌కి ఆయుధాలు, వాహనాలు సమకూర్చే పని బాస్‌దే. కిల్లర్స్‌కి రెండు లక్షలు ముడతాయి. ఒకప్పుడు కిల్లర్స్‌ యూపీ, బీహార్‌ల నుంచి వచ్చేవాళ్ళు. ఇప్పుడు దిల్లీ కుర్రాళ్ళు కూడా తయారైపోతున్నారు.

అప్పట్లో ఆయుధాలు యూపీ, బీహార్‌ల నుంచి వచ్చేవి. 30 లక్షలు చేసే బ్రెజిల్‌ టారస్‌ ఆటోమాటిక్‌ పిస్టల్స్‌నీ, అమెరికన్‌ దళాలు ఉపయోగించే .455 బోర్‌ పిస్టళ్ళనీ తెప్పించి వాడుకుంటున్నారిప్పుడు. కిల్లింగ్‌ ఇరుకు ప్రాంతాల్లో జరపాలంటే మాత్రం రెగ్యులర్‌ కిల్లర్స్‌ కాకుండా, ఆ గల్లీలు బాగా తెలిసిన లోకల్‌ క్రిమినల్స్‌నే రంగంలోకి దింపుతారు. ఎన్‌.డి.ఎం.సి అసిస్టెంట్‌ లీగల్‌ అడ్వైజర్‌ ఎం.ఎం. ఖాన్‌, ఇరుకు గల్లీలోనే నివాసముంటాడు.ఫఫఫ‘‘క్యా పరేషానీ హై రే భాయ్‌?’’ అన్నాడు బాస్‌. చెప్పాడు కక్కర్‌. తను టూ స్టార్‌ యూత్‌ హాస్టల్‌ కట్టేందుకు ఎన్‌.డి.ఎం.సి భూమి లీజుకు తీసుకున్నాడు. అందులో ‘ది కన్నాట్‌’ అనే స్టార్‌ హోటల్‌ కట్టాడు.

ఆ భవనాన్ని ఎన్‌.డి.ఎం.సి వాళ్ళు సీజ్‌ చేసి, లీజు నిబంధనలు ఉల్లంఘించినందుకు రూ.140 కోట్ల జరిమానా కట్టమంటున్నారు. దీన్ని ఆపాలని అసిస్టెంట్‌, లీగల్‌ అడ్వైజర్‌ ఖాన్‌కి మూడు కోట్లు ఆఫర్‌ చేశాడు. అతను కాదని ఫైనల్‌ ఆర్డర్‌ ఇవ్వడానికే సిద్ధమయ్యాడు. అతణ్ణి చంపి ఆ ఆర్డర్‌ని ఆపాలి. బాస్‌ కేసుని సమీక్షించి, బాట్లా హౌస్‌ లోకల్‌ క్రిమినల్‌ సలీం ఖాన్‌ని పిలిపించి, ‘‘పన్చూసుకో!’’ అన్నాడు. సలీం ఖాన్‌కి సహాయంగా అమర్‌, అన్వర్‌, బిలాల్‌ చేరారు. కక్కర్‌ సంతృప్తికరంగా వెళ్ళిపోయాడు బౌన్సర్లతో. ఎక్కడో దక్షిణ పురిలో ఒకచోట, పోలీస్‌ ఇన్ఫార్మర్‌ ఏం చెయ్యాలా అని ఆలోచనలో పడ్డాడు.