‘‘గురుద్వారాలో దర్శనం చేసుకుని, జామా మసీదు దగ్గర విందారగించి బయల్దేరేసరికి చాలా రాత్రయింది. కారెక్కి కూర్చుంది ప్రియంవద, మా అబ్బాయితో. వాడికి రెండేళ్లు. నేను కారు స్టార్ట్‌ చేసి పోనిచ్చా. బాగా అలిసిపోయిందనుకుంటా... నిద్ర ముంచుకొచ్చి, కళ్ళు మూసుకుంది తను. రోహిణీ జైలు దాటి ముందుకు వెళ్లాక, వెనుక నుంచి ఒక కారు స్పీడుగా దూసుకువచ్చేసింది. ఆ కారులోంచి పిస్టల్‌ పట్టుకుని ఒక చెయ్యి బయటికొచ్చింది. నేను భయపడి కిందకి వంగాను. ఆ పిస్టల్‌తో కొట్టి, అద్దం పగులకొట్టేశారు. ఆ వెంటనే నిద్రలో వున్న ప్రియంవద తలలోకి రెండు బుల్లెట్లు పేల్చారు. నేను షాక్‌లోంచి తేరుకునేలోపే పారిపోయారు...’’

చెప్పడం అయిపోగానే, ‘‘నిజానికి నన్ను చంపాలనుకున్నారు సార్‌, వాళ్ళు!’’ అని గట్టిగా అరిచాడు పంకజ్‌.‘‘ఎవరు?’’ అడిగాడు డీసీపీ మిలింద్‌. ‘‘ఆ సింగ్‌ మనుషులే! వాడి దగ్గర లోన్‌ తీసుకున్నా. అది కట్టలేక పోతూంటే, చంపుతానని బెదిరించడం మొదలెట్టాడు. ఇప్పుడు ఇలా అర్ధరాత్రి దాడి చేసి, నా భార్యని చంపేశారు!’’ అంటూ ఏడ్వసాగాడు పంకజ్‌.సింగ్‌ కోసం ఇంటికెళ్తే, అప్పటికే పారిపోయాడు. పంకజ్‌ 40 లక్షలు ఎందుకు లోన్‌ తీసుకున్నాడని ఆరా తీస్తే, అతను నడుపుతున్న రెండు రెస్టారెంట్లు వెలుగులోకొచ్చాయి. రెస్టారెంట్లు ప్రారంభించే ముందు గార్మెంట్స్‌ వ్యాపారం చేసి కోట్లు నష్టపోయిన పంకజ్‌ను, మామ ఆర్థికంగా ఆదుకున్నాడని తెలిసింది.మిలింద్‌ రెస్టారెంట్స్‌ వ్యాపారం బావుంది. మొదట్లో బాగా నడవలేదనీ, ఈ మధ్యే పుంజుకుందనీ చెప్పారు రెస్టారెంట్స్‌ సిబ్బంది.

‘‘అప్పు తెచ్చి డెవలప్‌ చేశాడా?’’ అడిగాడు మిలింద్‌. కాదనీ, లైవ్‌ సింగర్‌ని తెచ్చాక డెవలప్‌ అయ్యిందనీ చెప్పారు వాళ్లు.‘‘సింగరా? ఎవరామె?’’ఫ ఫ ఫ‘‘ప్రియంవద, పంకజ్‌ కాలేజీలోనే ప్రేమించుకున్నారు. పెళ్లి చేశాం. మా అమ్మాయికి అణుకువ చాలా ఎక్కువ. అల్లుడూ బాగానే వుండేవాడు. గార్మెంట్స్‌ వ్యాపారంలో నష్టపోయాడు. రెస్టారెంట్లు పెట్టి అవీ సరిగ్గా నడవక పోతే, మా అమ్మాయే లైవ్‌ మ్యూజిక్‌ సెక్షన్‌ పెట్టమని సలహా ఇచ్చింది. అల్లుడికి నచ్చి, ఒక సింగర్‌ని నియమించాడు. బిజినెస్‌ పెరిగింది. కానీ ఆ ఐడియానే అమ్మాయికి శనిలా మారింది...’’