పోలీస్‌స్టేషన్‌ వెనుక నుంచీ షాక్‌తో పరిగెత్తుకుంటూ వచ్చాడు ఇన్‌స్పెక్టర్‌ పార్ధ సింగ్కోన్‌. రాత్రి పదిన్నరవుతోంది. నోట మాట రాక చూస్తున్నారు సిబ్బంది. చూస్తూంటే బోధపడ సాగింది ఇన్‌స్పెక్టర్‌కి - మొన్న జరిగిందానికి ఇదా సమాధానం - అని. ‘మంచి నీళ్లేదో తాగొస్తానని కదా వెళ్ళాడు... ఎవరొచ్చారు వెంట?’ అనడిగాడు. తెలీదని తలూపారు సిబ్బంది. ‘మళ్ళీ అల్లర్లు. ఇప్పటికే కిష్కింధకాండ అయిపోయింది. కమాన్‌ కాల్‌ ది అంబులెన్స్‌!’ అంటూ తన ఛాంబర్‌లోకి వెళ్లాడు, పై అధికారులకి రిపోర్టు చేయడానికి.

మూడురోజుల క్రితం రాత్రి...‘‘తినడూ సైలెంట్‌గానూ ఉండడు వీడు!’’‘‘పేపర్‌కి రాస్తాడేమో, అది చూడు!’’‘‘కాళ్ళ దగ్గరి కొస్తాడులే ...’’‘‘ఐతే నేషనల్‌ పార్కు గుర్తు చెయ్యి - నువ్వో తన్నుతన్ను, మేమూ నాల్గు తంతాం!’’‘‘ఇంకొంచెం పొయ్యి!’’‘‘పోస్తే పోసుకుంటావ్‌ గా!’’‘ఈ తాగుబోతులు ఇంటికెళ్ళరా?’... బయట గేటుదగ్గర కాపలా కాస్తున్న చౌకీదారు హరేన్‌ విసుక్కుంటూ పక్కకి చూశాడు. బెంచి మీద అప్పుడే గుర్రు పెడుతున్నాడు మోరన్‌. హెడ్‌ మాస్టర్‌ జుగెన్‌, టీచర్లు రబీంద్రనాథ్‌, మునీంద్ర మద్యం మత్తులో ఊగుతూ, ఇంకా ఇంకా తాగేస్తున్నారు. అసోం, తీన్‌ సుకియా జిల్లాలోని బాగ్జన్‌ తరంగ్‌ హైస్కూల్‌ మినీ బార్‌లా మారింది.మర్నాడు రాత్రి పదిన్నర, బ్రహ్మచారి రబీంద్రనాథ్‌ ఇంట్లో... ‘‘రండి రండి లచిత్‌ సాబ్‌! ప్రఖ్యాత కవి, రచయితా, రిపోర్టర్‌, ఇంకేంటదీ... పర్యావరణ కార్యకర్త!!....తమకి సుస్వాగతం...’ వ్యంగ్యంగా అన్నాడు రబీంద్రనాథ్‌ పేకలు వేస్తూ.

‘‘ఇంకోటి మరిచావ్‌, అసలైంది- కమిటీ మెంబర్‌!’’ వచ్చి కూర్చుంటూ అన్నాడు లచిత్‌. ‘ప్లస్‌... మీ తోటి టీచర్ని కూడా...’‘ఇంకేంటి సంగతులు, మాట్లాడు కుందామా?’... పేకలు పేర్చుకుంటూ కొంటెగా చూశాడు హెడ్‌మాస్టర్‌ జుగెన్‌. అందరికీ మరోసారి మందు పోశాడు టీచర్‌ మునీంద్ర. లచిత్‌ తీసుకోలేదు- ‘ఇక్కడుండను, చెప్పేసి పోతా. ఎమౌంట్‌ అకౌంట్‌లో వేసేస్తే, కొత్త కమిటీ వేసుకుంటాం!’‘ఓహో, లేకపోతే?’‘ఫైనల్‌గా రెండు జరుగుతాయ్‌. సైన్స్‌ లాబ్‌ కట్టుకోమని ప్రభుత్వం మంజూరు చేసిన 22 లక్షల్లో నాలుగు లక్షలు ఒకసారీ, ఆరు లక్షలు ఇంకోసారీ బొక్కిన అవినీతిని పేపర్‌కి రాసేస్తా, ఆర్టీఐకి యేసేస్తా!’