మెజిస్టిక్‌ దగ్గర ఆటో ఎక్కాడతను. ‘ఎక్కడికెళ్ళాల’న్నాడు ఆటో డ్రైవర్‌. ‘యెలహంక వెళ్ళాలన్నా’డతను. యెలహంక న్యూ టౌన్‌ చేరుకున్నాక ‘ఎక్కడ దిగాలి?’ అని ఆటో డ్రైవర్‌ అడిగితే, ‘అలా రౌండ్లేస్తూ వుండు’ అన్నాడతను. అర్థంగాక కాలనీ రోడ్ల మీద తిప్పసాగాడు ఆటో డ్రైవర్‌. కాసేపయ్యాక ఆటో ఆపమన్నాడతను. దిగిపోయి ఐదొందల నోటిచ్చాడు. చిల్లర ఉంచుకోమన్నాడు. హడావిడిగా అతను వెళ్ళిపోతుంటే ఏమీ అర్థంగాక బుర్ర గోక్కోసాగాడు ఆటో డ్రైవర్‌. మూడు నాల్గు ఇళ్ళు తాళాలేసినట్టున్నాయి కాలనీలో...

రాళ్ళు పడుతున్నాయి టపటపా ఇళ్ళ మీద అర్ధరాత్రి దాటాక. ఒక ఇంట్లో పిల్లాడు కెవ్వుమన్నాడు. ఇంకో ఇంట్లో పిల్ల గట్టిగా ఏడ్చింది. ఒక డూప్లెక్స్‌లో గాఢనిద్రలో వున్న అనంతరామయ్య ఉలిక్కిపడి అలికిడవుతున్న గదిలో కెళ్ళాడు. లైటేశాడు. ఒక్కపెట్టున కేకపెట్టి నిట్టనిలువునా కుప్ప కూలిపోయాడు. కలకలం లేచింది కాలనీలో. సమాచారమందుకుని పెట్రోలింగ్‌ పోలీసులు వస్తుంటే కాలనీ బయట పడేసిన బ్రీఫ్‌ కేసు దొరికింది. అందులో అనంతరామయ్య ఆధార్‌ కార్డుంది. కాలనీలోకి పోలీసులు వచ్చేటప్పటికి ఆస్పత్రికి తరలించేశారు అనంతరామయ్యని. తలపూర్తిగా చితికిపోయిన అరవై తొమ్మిదేళ్ళ అనంతరామయ్య ఆలోపే తుదిశ్వాస విడిచాడు.శివారు యెలహంకలో జరిగిన ఈ వరస దాడులు, హత్య తెల్లారేసరికి బెంగుళూరు దాకా పాకాయి. ఇన్‌స్పెక్టర్‌ మంజునాథ్‌ వచ్చి పరిశీలిస్తున్నాడు.

అనంతరామయ్య ఇంట్లో రక్తం అంటిన ఇనప రాడ్‌ పడుంది. పై అంతస్తులో నిద్రపోతున్న కొడుకు కోడలికి కాలనీలో గోలవుతుంటే గానీ మెలకువ రాలేదు. కిందికొచ్చి చూస్తే రక్తం మడుగులో పడున్నాడు అనంతరామయ్య. ఇంకో ఇంట్లో పిల్లాడికి గాయాలయ్యాయి. మరొక ఇంట్లోపిల్ల సురక్షితంగా బయటపడింది. ఆ ఇళ్ళల్లో సొమ్ములేవీ పోలేదు. కాలనీ బయట పోలీసులకి దొరికిన అనంతరామయ్య బ్రీఫ్‌ కేసులో పదిహేను వేల నగదు వుండాలి. ఇన్‌స్పెక్టర్‌ మంజునాథ్‌ ఇవన్నీ పరిశీలిస్తుంటే, మొబైల్‌ ఫోరెన్సిక్‌ వ్యాను వచ్చింది.ఫ ఫ ఫఅతను బార్‌ లో కూర్చుని బీరు తాగుతున్నాడు. హసన్‌ జిల్లాలో దొడ్డ గెనెగెరే గ్రామం. ఉదయమే స్కూలుకెళ్ళి పిల్లల ఫీజులు కట్టేశాడు. బార్‌లో బాకీ తీర్చేశాడు. పదిహేను వేల రూపాయల్లో మూడు వేలే మిగిలాయి. ఇద్దరు భార్యల్లో ఒక భార్యకి పంపడానికివి చాలవు. ఆలోచిస్తున్నాడు.