జీవితం అంటే ఒక సమస్య నుంచి ఇంకో సమస్యకి ప్రయాణం.

----------------

డిసెంబర్‌ నెలచలిచలిగా వుంది.రాత్రి పన్నెండు గంటలు దాటింది. లూనా మీద ఎవరో స్పీడుగా వస్తూ రోడ్డువారగా పడుకున్న కుక్కపిల్లను చూసుకోలేదు. ముడుచుకుని పడుకుందేమో, నిద్ర మత్తులో వుందేమో కుక్కపిల్లకీ ఆ అలికిడికి మెలకువ రాలేదు. దాంతో కుక్కపిల్ల కాలిమీదుగా లూనా పోవడంతో ఒక్కసారిగా బాధగా కుయ్యి మందది. దానరుపుని పట్టించుకోలేదు లూనా మీదున్న వ్యక్తి. తన ధ్యాసలో తానుండి వెళ్లిపోయాడు. అలావెళ్లిపోయిన వ్యక్తిని గుర్రుగా ఓసారి చూసి ‘మళ్లీ ఇట్రారా నీ సంగతి చెప్తాను’ అన్నట్లుగా తల విదిల్చి నొప్పి పెడుతున్న కాలిని మడిచి కుయ్యి కుయ్యి మంటూ ముందుకి ఎలక్ర్టికల్‌ పోల్‌ దగ్గరగా కుంటుకుంటూ వచ్చి, పోల్‌నానుకుని ముడుచుకుని మళ్లీ పడుకుంది కుక్కపిల్ల. లూనా రెండు మూడు మలుపులు తిరిగి శ్రీ సాయి కిరాణా అండ్‌ జనరల్‌ స్టోర్స్‌ దాటి కన్యకా పరమేశ్వరి కోవెల దాటి రథం వీధి దాటి కుడివైపునకు తిరిగి అక్కడి పైకప్పులేని మొండి గోడలు వున్న పాడుబడిన ఇంట్లోకి ప్రవేశించి ఆగింది. లూనా ఆగీ ఆగడంతో పందికొక్కొకటి భయంభయంగా పరుగులు తీసి రాళ్ల మధ్యన చేరి దాగుంది. లూనా ఆఫ్‌ చేసి, కిందికి దిగి, చేతులనోసారి రబ్‌ చేసుకున్నాడా వ్యక్తి. అరకొరా వెలుగులో ఆ వ్యక్తిని జాగ్రత్తగా గమనిస్తే -అతనంత పొడవూ కాదు, పొట్టీ కాదు. మధ్యస్తంగా వున్నాడు. వైట్‌ అన్‌ వైట్‌- తెల్లలాల్చీ షరాయి మీదున్నాడు. అతని ఎడం చేతికి వాచీ వుంది. కుడిచేతి ఉంగరం వేలికి వుంగరం వుంది. అయితే అది బంగారంది కాదు, వెండిది.

వేలికేదో ప్లాస్టర్‌ చుట్టినట్టుగా మాసిపోయి అసహ్యంగా వుందా వుంగరం. మెడలో ఒంటిపేటది వెండి గొలుసుంది. అదీ అంతే! పాతబడిపోయి చచ్చిన పాములా వుంది. గొంతులో రాయేదో ఇరుక్కున్నట్టుగా గొంతుముడి, జారుడు ముక్కు, లోతు కళ్లు, చక్కు దవళ్లు. మొత్తానికి మొహంలో మాంసాన్నీ, గాలినీ ఎవరో లాగేసినట్టుగా వున్నాడతను. ముప్పయ్యేళ్ల వయసుంటుందతనికి. అందులో అనుమానం లేదు. అయితే... తనకు పాతికేనంటూ చెప్పుకొస్తూ అసలు పేరు ‘కిష్టపల్లి కుక్కల నా కొడుకు’ ట్రిపుల్‌ కె ని. ‘కిష్టపల్లి కొంటె కిష్టుడ’ంటూ చెప్పి కిసుక్కున నవ్వుతాడతను. అతనికందరిలాగే రెండు కాళ్లున్నా ఒక కాలు కుంటిది. దాంతో అతను ఒక కాలు పోగొట్టుకున్న నిచ్చనలా పక్కకి ఒరిగి నిల్చుంటాడు.ఇప్పుడలాగే నిల్చున్నాడు ట్రిపుల్‌ కే. నిల్చుని షరాయి జేబులోంచి సిగరెట్‌ తీసి ముట్టించాడు. రెండు దమ్ములు లాగి ముక్కులోంచి కూడా పొగ నొదిలి, ఎవరి కోసమో చూస్తున్నట్టుగా చూస్తూ వెయిట్‌ చెయ్యసాగాడు.

---------------

గబగబా నడుస్తోంది లక్ష్మి. నడుస్తూ ఆయాసపడుతూ చెమటలు పట్టిపోతోంది. రాత్రి పన్నెండు గంటలు దాటినా డిసెంబర్‌ నెలయినా చలిచలిగా వున్నా, లక్ష్మి చెమట్లు పట్టిపోతోందంటే తనేదో చెయ్యరాని పనో, చెయ్యకూడని పనో చేస్తోంది. దాంతోనే భయంతోనూ, ఆందోళనతోనూ చెమట్లు పట్టిపోతోంది.లక్ష్మికి మొన్నటికి మొన్న దీపావళికి పదిహేడెళ్లి పద్ధెనిమిదేళ్లొచ్చాయి. పద్దెనిమిదేళ్ల లక్ష్మి పాండవ వనవాసం సినిమాలో హేమమాలినిలా సన్నగా, పొడుగ్గా చూడముచ్చటగా వుంటుంది. సంపెంగ ముక్కు, పెద్ద పెద్ద కళ్లు, చిన్న నోరు, చక్కనైన మెడ, సరసమైన గుండెలు... చెక్కినట్టుగా వుంటుంది. ‘ఈ గుంట ఎవడికి పడతాదో కాని, ఆడు బూర్ల గంపలో పడ్డట్టే...’ అన్నట్టుగా కూడా వుండి, అందరినీ ఊరిస్తూ వుంటుంది. బ్రాందీకి బీరు తోడైనట్టుగా ఇన్ని అందాల లక్ష్మికి నటన కూడా తోడవడంతో ఇక చెప్పేదేముంది? కాక్‌టెయిల్‌ అయ్యి అందరికీ కిక్కిచ్చేస్తోంది.