‘‘అప్పుడే మందులు రాయను. కాకపోతే, కాస్త లైఫ్‌ స్టయిల్‌ మార్చుకోవాలి’’ ఈమధ్యనే తీరం దాటిన షుగర్‌ లెవల్స్‌ చూస్తూ చెప్పాడాయన.ఉన్నట్లుండి పది రోజుల క్రితం మోకాలు వాచి నొప్పి చేసింది. టాబ్లెట్లూ అవీ వాడి, తగ్గలేదని హాస్పిటల్‌కి వచ్చింది మొన్న. డాక్టర్‌ చెప్పిన టెస్టులు చేయించుకుని మళ్ళా వచ్చింది యీరోజు.

‘‘అంటే?’’ అన్నట్లు చూస్తున్న ఆమెతో ‘‘నొప్పికి టాబ్లెట్స్‌ ఇచ్చాను. ఇప్పుడూ, రాత్రికీ వేసుకోండి. తర్వాత నొప్పి ఉన్నప్పుడు వేసుకోండి. నొప్పి తగ్గాక, కనీసం ఒక 45 నిముషాలు నడవడం అలవాటు చేసుకోండి. కాస్త వెయిట్‌ తగ్గితే మీకా మోకాలు నొప్పి కూడా తగ్గుతుంది. నొప్పి అక్యూట్‌ అయినా, ఇంకాస్త బరువు పెరిగినా మీరు వాకింగ్‌ చేయడం కష్టం’’ చాలా నార్మల్‌గా అలవాటుగానే చెప్తూ బెల్‌ కొట్టాడు, తర్వాతి పేషంట్‌ కోసం.లేస్తూ అడిగింది. ‘‘వేరే ఆప్షన్‌? ఐ మీన్‌ ఫుడ్‌ ఎట్సెట్రా?’’‘‘కాస్త కార్బ్స్‌ తగ్గించండి. యూ కెన్‌ కన్సల్ట్‌ అవర్‌ నూట్రిషనిస్ట్‌ ఇఫ్‌ యూ..’’ డాక్టర్‌ ఏదో చెప్పబోతుంటే అతని చేతిలో ఫైల్‌ లాక్కున్నట్లు తీసుకుని గబగబా బయటకి వచ్చింది.ఇఫ్‌.. అని డాక్టర్‌ ఒక ఆప్షన్‌ ఇచ్చాక ఏం చేయాలో ఆమెకి తెలుసు. చిన్నప్పుడు ‘రెన్‌ అండ్‌ మార్టిన్‌’లో చెప్పినప్పుడు తలకి ఎక్కక పోయినా ఇప్పుడు ఆమె కాలావసరాలు బానే నేర్పించాయి. అప్పటికే ఆఫీసు నుంచి ఆరు సార్లు కాల్‌. గంటలో వస్తా అని పర్మిషన్‌ తీసుకుని హాస్పిటల్‌కి వచ్చింది. ఇంకో అరగంట లేట్‌ అయినా ఎవరూ ఏం అనరు. ఇన్‌కంటాక్స్‌ డిపార్ట్మెంట్‌లో సీనియర్‌ టాక్స్‌ అసిస్టెంట్‌గా చేస్తోంది. మామూలు ఎంక్వయిరీ అయి ఉంటుంది. చాలామంది దగ్గర తన నంబర్‌ ఉంటుంది. అయినా ఆమెకి ఇష్టం ఉండదు. నూట్రిషనిస్ట్‌ దగ్గరకి వెళ్ళకుండానే ఆఫీస్‌కి పరిగెత్తింది.బయటకి వచ్చి గేట్‌ దగ్గర అప్పుడే ఎవర్నో దింపుతున్న ఆటో దగ్గరకి వెళ్ళింది.‘‘ఎక్కడికి మేడం’’ అడిగాడతను.‘‘వాకింగ్‌. నలభై అయిదు నిముషాలు’’ పరధ్యానంగా చెప్పింది.అంతలోనే తేరుకుని ఆఫీస్‌ అడ్రస్‌ చెప్పి అతని సమాధానం కోసం చూడకుండా ఆటో ఎక్కి కూర్చుంది. అద్దంలోంచి వెనక్కి వింతగా చూస్తున్న అతన్ని పట్టించుకోకుండా ఫోన్‌లో యూట్యూబ్‌ తెరిచింది.