‘‘మమ్మీ’’గబుక్కున వచ్చి వెనుకవాటుగా సుభద్రను గట్టిగా వాటేసుకుంది సుమ.‘‘అబ్బబ్బ వదలవే తల్లీ! పిండి తడపనీ’’ వంటింట్లో చపాతీలకు పిండి తడుపుతున్న సుభద్ర చిన్నగా విసుక్కుంది.‘‘సరే! సరే! సరే! సారీ సారీ సారీ. ఒక్కసారి ఇలా చూడు’’.

అమిత ఉత్సాహంగా ఉంది సుమ గొంతు.వెనక్కి తిరిగి చూసింది సుభద్ర ‘ఏమై ఉంటుందబ్బా’ అనుకుంటూ.చూసిన వెంటనే కెవ్వుమంది.‘‘ఏమిటే సుమా! మళ్ళీ సెల్‌ కొన్నావా? ఒకటి ఉందిగా?’’‘‘ఉంటే ఏం! ఇది ఇంకోటి. మా ఫ్రెండ్స్‌ అందరి దగ్గర రెండేసి మొబైల్స్‌ ఉన్నాయి. అయినా ఒక సెల్‌ ఆఫీసు పనికి, ఇంకోటి నా సరదాకి’’ కళ్ళెగరేస్తూ అరచేతిలోని సెల్‌ని ముచ్చటగా చూస్తూ జవాబిచ్చింది.‘‘ఏమిటో బాబూ ఈ పిచ్చి! ఆఫీసు వాళ్ళతో ఒకదాంట్లోంచి మాట్లాడుతూ, ఇంకో సెల్‌ నుండి మీ ఫ్రెండ్స్‌తో కాలక్షేపం చేస్తూ, లేదా వాట్సప్‌లు, ఫేస్‌బుక్కులు వీటితో కనెక్ట్‌ అవుతుంటే, ఇంక ఇంట్లో నాతో గానీ, నాన్నతో గానీ ఎప్పుడే నువ్వు మాట్లాడేది’’ కయ్యిమంది సుభద్ర.

ఒకవైపు కూతురుమీద కోపం ముంచుకొస్తోంది.‘‘పోదూ మమ్మీ! నీది మరీ చాదస్తం. మీ ఇద్దరితో రోజూ రాత్రిపూట వసపిట్టలా వాగుతూనే ఉంటాగా? అయినా అన్నిటికీ నువ్వు అంత ఫీలయితే కష్టం మమ్మీ’’.‘‘ముందా మమ్మీ అన్న పిలుపు మాను. చక్కగా అమ్మా అని పిలవ్వే. మా అమ్మవు కదూ’’ కూతురు గడ్డం పుచ్చుకు బతిమిలాడింది సుభద్ర.‘‘సరేలే! రేపట్నించి పిలుస్తాగా’’ కొంచెం గ్యాప్‌ యిచ్చి.‘‘గుడ్‌నైట్‌ మమ్మీ’’ అని తుర్రుమంది సుమ.‘‘అయ్యో! అన్నం తిని వెళ్ళవే నా తల్లివిగా’’.‘‘ఓ గంటాగి వస్తా! అయినా డాడీ ఇంకా రాలేదుగా వస్తే పిలువ్‌’’ గది లోపలినుంచే ఓ గావుకేక పెట్టింది సుమ.