చీకటి రాత్రి... ఊరికి దూరంగా గుడిసెలో ఓ ఒంటరి నిండుచూలాలి ప్రసవ వేదన! సహాయంకోసం ఆమె చేసిన ఆక్రందన అడవిగాచిన వెన్నెలైపోయింది. అంతలోనే దొంగ..దొంగ..అంటూ కేకలు. పరుగుల శబ్దాలు. ఆమెలో ఏదో ఆశ! కానీ దొంగే గుడిసెలో దూరాడు. అమె కంఠంమీద కత్తిగుచ్చి అరిస్తే చంపుతా అన్నాడు. ఇంతకీ ఆ రాత్రి ఆ గుడిసెలో, ఆ ఊళ్ళో ఏం జరిగింది?

ఆ రాత్రి...వెన్నెల జాడలేని నల్లనిరాత్రి....సకల జీవరాశులను వణికిస్తున్న చల్లనిరాత్రి... దట్టంగా మంచు కురుస్తున్న నడిరాత్రి.... అంతటా నిశ్శబ్దం అలుముకున్న కాళరాత్రి.ఊరికి దూరంగా ఒంటరిగా, దీనంగా చిన్నగుడిసె. సన్నగా, బాధగా వెలుగుతున్న దీపం బుడ్డి, కిర్రుకిర్రుమంటూ మూలుగుతున్న కుక్కిమంచం, చిక్కిశల్యమైనట్టు పీలికలుదేలిన చిరుగులబొంత, దాని మీద అటూఇటూ దొర్లుతూ హృదయవిదారంగా ఆక్రందిస్తున్న ఒంటరి అబల...! నొప్పులకు తాళలేక బిగ్గరగా రోదిస్తున్న నిండుచూలాలు!కడుపులో బిడ్డ అడ్డం తిరిగిందో లేక పేగులు బిడ్డమెడకు చుట్టుకుపోయాయో తెలియదుగానీ రెండు గంటలనుంచి ప్రసవవేదన అనుభవిస్తోంది. నరకాన్ని చవిచూస్తోంది. ఆమె గుడిసె జనవాసాలకు దూరంగా ఉండడంతో ఆమె రోదన అరణ్యరోదనగానే మిగిలిపోతోంది.బిడ్డను కనడానికి ఆమె గింజుకుని గింజుకని అలసిపోయింది.

ఏడ్చిఏడ్చి కన్నీళ్ళు ఇంకి పోయాయి. పళ్ళు బిగపట్టి, పిడికిళ్ళు బిగించి, కాళ్ళను మంచంకోళ్ళకు తన్నిపెట్టి, నిస్స హాయంగా నిస్సత్తువుగా పడి ఉంది.తన మీద దయదలచమని ముక్కోటి దేవతలను మూగగా ప్రార్థిస్తోంది ఆమె. కడుపులోనిబిడ్డను క్షేమంగా భూమ్మీద పడేయమని దయనీయంగా వేడుకుంటోంది. తన భర్త ప్రతిరూపాన్ని ఆ బిడ్డలో చూసుకునే అదృష్టం కలిగించమని అతిదీనంగా ప్రాధేయపడు తోంది. సాయంకోసం ఆశగా, ఆర్తిగా అశోకవనంలోని సీతలా, కౌరవసభలోని ద్రౌపదిలా ఎదురుచూస్తోంది.ఆమె పేరు గంగ. శివుడి జటాజాటంలో బంధించబడిన గంగను భూమ్మీదకు తీసుకు రావడానికి భగీరథుడు ఎంతగా కష్టపడ్డాడో, మేనత్త ఆధీనంలో ఉన్న ఈ గంగను భార్యగా తన గుడిసెకు తీసుకురావడానికి కూడా అంతలా కష్టపడ్డాడు శివుడు. కల్లుగీత కార్మికుడైన శివుడు పుట్టి బుద్ధెరగకముందే అతడి అయ్య చెట్టుపైనుంచి కిందపడి, పైకెళ్ళిపోయాడు. ఎదిగిన తర్వాత అతడి తల్లిని కూడా ఏదో మాయదారిరోగం వచ్చి తీసకుపోయింది. దాంతో ఒంటరివాడైపోయాడు శివుడు. ఒంటరితనం పోగొట్టుకోవడంకోసం ఓతోడు తెచ్చుకోవాలనుకున్నాడు.