ఆ రాత్రికి, అతని దగ్గరికి వెళ్ళాలని లేదు. కానీ వెళ్ళాలి. ఏ స్వతంత్రం కోసం, తన జీవన విధా నాన్ని కావాలని ఇలా మలుచుకుందో, ఆ స్వతంత్రం తనకి ఉందా? లేదా? అదీ సందేహంగానే ఉంది అరుణకి.పూర్తి ఆందోళనా కాదు. అటూ, ఇటూ తేల్చుకోలేని సందిగ్ధం. ఓ రకం చికాకు.ఆ మూడ్‌ మారటం లేదు. స్తబ్దసముద్రంలా ఉండలేక, ఏదో కదలిక ఉంటే బావుంటుందని, పడుకున్న అరుణ లేచింది. వంట మనిషిని పిలిచి కాఫీ పెట్టమంది.

బాత్‌రూమ్‌కి వెళ్ళి ముఖం కడుక్కుని, ఫ్రెష్‌అయి వచ్చింది. సెల్‌ తీసుకుని కీర్తికి ఫోన్‌ చేసింది.కీర్తి పలగ్గానే, ‘‘మూడ్‌ బావుండలేదు. కాస్సేపు రాకూడదూ?’’ అడిగింది అరుణ.‘‘వెంటనే వస్తున్నా’’ చెప్పింది కీర్తి.తనకన్నా పదేళ్ళు చిన్నది కీర్తి. అయినా నలభైఏళ్ళ తనని ‘నువ్వు’ అంటుంది. అనటమే కాదు. అంత దగ్గరగానూ ఉంటుంది. చాలా చలాకీ. చలాకీతనమే కాదు, మొండితనం, ఓ రకం నిబ్బరం కలగలుపు అది. పదేళ్ళ తేడా అయినా, అది ఇంకోరకం జనరేషన్‌.‘‘మూడ్‌ బాగోలేక పోవటమేమిటి?’’ వస్తూనే అంది కీర్తి.‘‘సందేహం... అంతా, అన్నీ సందేహమే, అన్నీ అలాంటి ఆలోచనలే’’.‘అంటే’.... అన్నట్టు చూసింది కీర్తి.

‘‘మనీష్‌ దగ్గరికి ఓసారి వెళ్ళాలని చెప్పానుగా. ఇవాళ రాత్రికి వస్తానని చెప్పాను. ఇప్పుడేమో వెళ్ళాలనిపించటం లేదు. అదీకాక వాడి దగ్గర అంతా చిరాగ్గా ఉంటుందని చెప్పావుగా’’ అంది అరుణ. ‘‘వాడా... వాడో పెర్వర్ట్‌... అయినా ప్రమాదకారి కాదు. చికాకుపెడతాడు. మీన్‌ఫెలో... వెళ్ళాలని లేకపోతే మానేయ్‌ వెళ్ళకు’’ అంది అరుణవైపు చూస్తూ.‘‘అశోక్‌ చెప్పినపని. మనీష్‌ మంచి అధికారంలో ఉన్నాడు అతనివల్లే అయ్యే పని. నీకు తెలుసుగా. అశోక్‌ పనంటే, నా పనిలాంటిదే, వెళ్ళక తప్పదు’’.