‘‘నువ్వు ఎవరివి?’’రాఘవరావు ఆమె ముఖంలోకి అనుమానాస్పదంగా చూశాడు. అతను పడమటి సూర్యుడిలా వడిలిపోయి ఉన్నాడు.

ఆ ప్రశ్నతో తుమ్మల్లో పొద్దు కుంగినట్లు సుగుణ ముఖంలో చీకటి ఆవహించింది. ఒకటా... రెండా... నలభై మూడేళ్లు కలిసి కాపురం చేసిన భర్త అలా అడిగేసరికి ఆమెకి వెంటనే ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. అప్పటికే కాఫీ కప్పు అతని చేతిలోకి వెళ్లిపోయింది కానీ, లేకపోతే వేడివేడి కాఫీ అతని ముఖాన కుమ్మరించాలన్నంత కోపం వచ్చింది. విసురుగా వంటగదిలోకి వెళ్లింది.కొద్దిసేపు తర్వాత ...రాఘవరావు వంటగది దగ్గరకు వచ్చి ‘‘నా భార్య సుగుణ ఎక్కడికి వెళ్లిందో తెలుసా?’’ అన్నాడు.

ఈ కొత్త ప్రశ్నతో ఆమె కోపం తారస్థాయికి చేరుకుంది. తన ఉనికిని భర్త గుర్తించక పోవడమనేదానికి ఈ ప్రశ్న పరాకాష్ట అనిపించింది. తన కోసం కప్పులోకి కాఫీ ఒంపుకోబోతున్న సుగుణ, చేతిలో మసిగుడ్డ ఉందని కూడా మర్చిపోయి, అలానే బయటికి నడిచింది.‘‘అడుగుతుంటే వినిపించుకోకుండావెళ్లిపోతావేం?’’ వరండా దాటి, కాంపౌండు గేటు తీస్తున్నప్పుడు వెనకగా వినిపించిన భర్త మాటలు మరింత రోత కలిగించాయి.వడివడిగా గమ్యం లేకుండా నడుస్తుందేగాని, ఆమెలో దుఃఖంతో పాటు ఆయనతోముడిపడ్డ తన జీవితం కూడా కళ్లల్లో గిరగిరతిరిగింది. పెళ్లయిన కొద్ది నెలలకే చదువుకున్న కాలేజీలోనే సుగుణకి జాబ్‌ వచ్చింది. భర్త ఉద్యోగం కూడా అదే ఊళ్లో కాబట్టి, తను జాబ్‌ చేయడానికి ఎవరికీ అభ్యంతరం ఉండదను కుంది.

ఆ ఉద్యోగంలో చేరడానికి దాదాపు ఓ యుద్ధం లాంటిది చేయాల్సి వచ్చింది.వెంటవెంటనే ఇద్దరు పిల్లలు కలగడంలో కూడా ఆమె నిర్ణయం ఏమీ లేదు. ఓ పక్క పిల్లల బాధ్యతా, మరో పక్క ఉద్యోగ బాధ్యతతో ఆమె సతమతమవుతున్నా భర్త ఏనాడూ పూచికపుల్లంత సాయం చేయలేదు.పైగా, పిల్లల ఆలనాపాలనా సరిగ్గా జరగడం లేదనీ, సుగుణ వెంటనే ఉద్యోగం మానేయాలనీ పంతం పట్టాడు. ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేవరకూ ఆమెతో మాట్లాడటం మానేశాడు.రోజులు గడుస్తున్న కొద్దీ, పిల్లలిద్దరూ ‘పెద్ద’వాళ్లయిపోయి తండ్రి పార్టీలోకి చేరిపోయారు. ‘కష్టపడి’ ఉద్యోగం చేస్తూ, కుటుంబాన్ని పోషిస్తున్నందుకు తండ్రి ‘బ్రెడ్‌ విన్నర్‌’ అయ్యేడు. ఏ ‘పనీ పాటా’ లేకుండా ఇంట్లో ఉంటోందన్న ఆలోచనతో తల్లి ‘బ్రెడ్‌ తిన్నర్‌’ అయింది.