మా మేనత్తకు బాగలేదట. ఎట్లయిన బొయి సూసిరావాలె. వూరికి బొయి బలగాన్ని కలుసుడు కండ్ల పండుగ. ఆడోల్లకు యెప్పుడుబడితె అప్పుడు వూల్లకు బోనికే కుదురది. యిగ ఉద్యోగం వున్నాడోల్లకు అసలే కుదురది. అదేందో మొగోల్లు ఎటంటె అటు సిటుక్కున పోతరు. ఆడోల్లకేయిల్లిడిసి వూరికి బోవాలంటెసవాలక్ష లంకెలు, సంకెండ్లు.

గయన్నిట్ని పక్కకు దొబ్బి మా మేనత్తింటికి బైల్దేరిన. మా మేనత్తది మొలుగు దగ్గెర వూరు. బస్టాండు కొచ్చేటాలకు హన్మకొండ బస్సు ప్లాట్‌ఫామ్‌ మీద రడీ గున్నది. యిదివరకటిలాగ మొగోల్లు ఎక్కెక్కి, వురికురికి సీట్ల మీద దస్తులు, తువ్వాల్లేసి సీట్లు ఆపుకునే లొల్లి కనబడలే. డ్రైవరే టిక్కెట్లిస్తుంటే ... నేను హన్మకొండకు టికెట్‌ తీసుకొని కూసున్న.బస్సు రోడ్లను చెండాడుకుంట వుర్కుతంది. యిది వరకు రోడు సిన్నగ సెట్ల మద్దెన సేద దీరుకుంట పొయినట్లు పోయేది. యిప్పుడు దరి దాపున ఒక్క సెట్టులేదు. యెడారోలె యెడల్పుగ పర్సుకున్నది. అయినా రోడు ప్రమాదాలు విపరీతంగా పెరిగినయి. రోడ్లు సిన్న సన్నగున్నప్పుడు గింత గనం ప్రమాదాలు జరుగలే.హన్మకొండ బస్టాండుల దిగి గంట ఎదురు చూసినంక మొలుగుకు బొయే ఆర్డినరీ బసొచ్చింది.

ఎర్రబసులే కనబడ్తలేవు సూద్దామన్నా. యిదివరకు వూరి దుబ్బంత పోసుకొని ఎంత ముద్దుగుండెనో! ఎర్రబసును జూస్తె మా గూడేన్ని సూసినంత కడుపునిండేది. ఎర్ర బసెక్కితె ఏనుగెక్కినంత సంబురంగుండె. సెమట మనుషులు, సెమట మొకాలు, సెమట మూటలు, మట్టి సెమట కలెగలిపిన మాటలు ఎర్ర బసునంత గుమ్మెక్కిస్తుండేయి. బస్సుమారినా ఆ గుబాలింపులు మారలే. ఆడోల్లు, మొగోల్లు, పిల్లలు ఎక్కి సీట్లల్ల కొందరు, నిలబడి కొందరు బసు కదిలేదాక లొల్లిలొల్లిగుండి బసు కదులంగానే లొల్లి బందైంది.

నాకొకామె పక్కన సీటుదొర్కితే కూసున్న. కొంచెం సేపు అయినంక ఆమె ‘ఏ వూర్కు బోవాలె’ అని అడిగింది. చిన్నామెనే గాని పెద్దమనిషిలాగ కనబడ్తుంది. ఎండకు సేగ బారిన నల్లటి రంగు. మెడల తెల్లటి దొడ్డు దారం దండున్నది. దానికి ఒక తాళం చెవి, ఒక పిన్నీసున్నది. ఒక సేతికి రెండు ఎర్రగాజులు యింకో సేతికి ఒక పచ్చగాజున్నది. సెవులు మొండిగనే వున్నయి. ఒక మాసిన పూలసీరె.