అద్భుత గోళంరచనః వసుంధరఒక ఊళ్లో జయదేవుడు అనే యువకుడుడేవాడు. అతడికి ఆటపాటలమీదే తప్ప చదువుమీద దృష్టి ఉండేది కాదు. ఏంచేసినా తనకు తోచినట్లు చెయ్యడమే తప్ప,  తప్పొప్పులు ఆలోచించేవాడు కాదు. అది తగదని ఇంట్లో తల్లిదండ్రులు కొడుకుని రోజూ మందలించేవారు. అందుకు జయదేవుడు నొచ్చుకునేవాడు కాదు. కానీ, ప్రతిదానికీ తనని తన ఈడువాడే అయిన వితరణుడితో పోల్చడం అతడికి నచ్చేది కాదు.వితరణుడు శ్రద్ధ్ధగా చదువుతాడు. ఆశువుగా కవిత్వం చెపుతాడు. అందంగా బొమ్మలు గీస్తాడు. శ్రావ్యంగా పాటలు పాడతాడు. ఇవన్నీ చేస్తూనే తలిదండ్రులకు అన్ని పనుల్లోనూ సహాయపడతాడు.రోజు సాయంత్రాలు, ఓ రెండు గంటల సేపు వితరణుడు తన ఈడువారితో ఆటలాడేవాడు. ఆ ఆటల్లోనూ అతడిదే పైచేయిగా వుండేది.'వితరణుడికి తెలిసిన విద్యల్లో ఒక్కటంటే ఒక్క దానిలోనైనా నువ్వతణ్ణి మించగలవా?' అని తల్లిదండ్రులు జయదేవుడిని చిన్నబుచ్చేవారు.జయదేవుడికి ఎలాగూ ఏ విద్యపట్లా ఆసక్తి లేదు. ఆటల్లోనైనా వితరణుడిని ఓడించి తలిదండ్రుల్ని మెప్పించాలని అనుకున్నాడు. కానీ, ఎంత కృషి చేసినా అతడు ఏ ఆటలోనూ వితరణుడిని మించలేక పోయాడు. ఇది అతడికి ఎంతో బాధగా ఉన్నది.'వితరణుడు నీతిమంతుడు. అతడి బలం నీతిలో ఉన్నది. అతడు అన్నింటా తలిదండ్రులకు సాయం చేస్తాడు. అందువల్ల అతడికి వారి దీవెనలు బలంగా ఉంటాయి. నీవూ అలా ఉండు, అతడిని మించిపోతావు' అని తల్లి జయదేవుడితో అనేది. కొన్నాళ్లకు ఈ మాట జయదేవుడి బుర్రకెక్కింది. ఒకరోజు తండ్రి కొబ్బరి మొక్కలు పాతడానికి పెరట్లో గోతులు తవ్వుతుంటే, ఆయన్ని తప్పుకోమని, తానే గోతులు తవ్వసాగాడు జయదేవుడు.చివరి గొయ్యి తవ్వుతుండగా జయదేవుడికి ఒక పంచరంగుల గోళం దొరికింది. అది ఎంతో అందంగా మెరుస్తున్నది. జయదేవుడది తీసుకుని స్నానాలగదికి వెళ్లాడు. గోళాన్ని కడిగి శుభ్రం చేసి, తనూ స్నానం చేశాడు. ఆ తర్వాత, మంచి బట్టలు వేసుకుని, గోళాన్ని తన రొంటిన దాచుకున్నాడు. విచిత్రంగా ఉన్న ఆ గోళాన్ని తన మిత్రులకు చూపించాలని ఇంట్లోంచి బయల్దేరాడు. అప్పుడతడిలో కొత్త ఉత్సాహం పుట్టింది.