నేర్పుగలుగువారికీ, నెరయోధులైనవారికీ తెలివితేటలు, విద్యాగంధం ఉన్నంతమాత్రాన సరిపోదు. ఎంతవిద్యావంతుడైనా మూర్ఖత్వం ఉన్నవాడు సమాజంలో రాణించలేడు. అతడివల్ల కుటుంబసభ్యులే బాధలకు గురికావచ్చు. ఈ కథలో సుదర్శనుడనే యువకుడు కూడా అంతే. సాక్షాత్తూ సరస్వతీ అవతారమూర్తి అనేవారు ఊరు ప్రజలు. అతడిని ఎంతగానో ప్రేమించి పెళ్ళిచేసుకున్న యువతి ఎన్ని కష్టాలు ఎదురైనా అతడికే కట్టుబడి ఉంది కానీ ఏం జరిగిందంటే

*****************************

పూర్వం ఒకానొకగ్రామంలో సుదర్శనుడనే బ్రాహ్మణయువకుడు ఉండేవాడు.అతడికి చిన్నతనంలోనే తలిదండ్రులు పోయారు. ఆ గ్రామంలో మిహిరకుడనే మరో బ్రాహ్మణుడు అతణ్ణి చేరదీసి, తానే విద్యాబుద్ధులు గరపి పెంచి పెద్దవాణ్ణి చేశాడు.సుదర్శనుడు చురుకైనవాడు. ఎంతటి క్లిష్టమైన విశేషమైనా, అతడికి ఇట్టే ఒంటబట్టేది. పదహారు సంవత్సరాలు నిండేసరికే సకల విద్యాపారంగతుడయ్యాడు.మిహిరకుడు ఎందరో యువకులకు విద్యాదానం చేసేవాడు. విద్యాభ్యాసం కోసం అతడివద్దకు ఎందరో వచ్చేవారు. అందరిలోనూ సుదర్శనుడు తనకు తానేసాటి అనిపించుకున్నాడు. ఇది చూసి మిహిరకుడి కూతురు శోభ సుదర్శనుణ్ణి ప్రేమించింది. సుదర్శనుడు ఏం చేసినా ఆమెకు అబ్బురంగా తోచేది. చదువైపోయాక, సుదర్శనుడు గ్రామంలోనే ఉండి, పురాణాలకు వ్యాఖ్యానం చెపుతూ, ఊరివారి అభిమానం సంపాదించుకున్నాడు. గ్రామస్థులందరూ అతడికి తరచుగా కానుకలు ఇస్తూండేవారు. పుణ్యతిథుల్లో అతడిచేత పురాణపఠనం చేయించి, తెలియని విశేషాలకి అర్థం చెప్పించుకుని, ప్రత్యేకంగా సన్మానించేవారు గ్రామస్థులు.అచిరకాలంలోనే, సుదర్శనుడి ఖ్యాతి ఆ గ్రామంలోనేకాక, చుట్టుపక్కల గ్రామాలక్కూడా పాకింది. అంతవరకూ ఎవరికీ తెలియని విశేషాలను అతడు నలుగురికీ చెబుతుండేవాడు. పురాణకథల్లోని పరమార్థాలు అతడు వివరించి చెబుతూంటే, సామాన్యులక్కూడా ఆసక్తికరంగా ఉండేవి.

అలా సుదర్శనుడు - సరస్వతీఅపరావతారమూర్తి అన్నపేరు వచ్చింది. ఆ సమయంలో, మిహిరకుడు కూతురికి పెళ్ళి సంబంధాలు చూడసాగాడు. అప్పుడు శోభ తల్లితో, ‘‘నాన్నను నాకోసం వేరేసంబంధాలు చూడవద్దనిచెప్పు. నేను సుదర్శనుణ్ణి పెళ్ళి చేసుకుంటాను’’ అని చెప్పింది.భార్య ద్వారా ఈ విషయం మిహిరకుడికి తెలిసింది. ఆయన కూతుర్ని పిలిచి, ‘‘నేను నీకోసం మంచి సంబంధం తెస్తాను. సుదర్శనుడి గురించిన ఆలోచనలు నీ మనసునుండి తొలగించు’’ అని చెప్పాడు.‘‘సుదర్శనుడు సకల విద్యాపారంగతుడు. నీ శిష్యులందరిలోకీ మేటి. అతడి కీర్తి చుట్టుపక్కల గ్రామాలక్కూడా పాకింది. నేనతడంటే ఇష్టపడుతున్నాను. ఇంతకంటే మంచిసంబంధం నీకెక్కడ దొరుకుతుంది?’’ అని శోభ తండ్రిని అడిగింది.