వాళ్ళిద్దరూ తమ తమ లక్ష్యాలు సాధించడంకోసం యజ్ఞం చేస్తున్నారు. వారిలో ఒకరికి బాల్యంనుంచీ గొప్పవాడు కావాలనే కసి ఉంది. ఆకలి, అవమానాలు, అసంతృప్తులు ఎదుర్కొన్న అనుభవాలున్నాయి. పులిని తప్పించుకోగల లేడి వేగం ఉంది. మరొకరిలో లేడిని ఒడుపుగా వేటాడగల పులివాటం ఉంది. తల్లి కోరిక తీర్చాలన్న తపన, ఆడపిల్ల ప్రేమను సాధించాలనే ఆరాటం ఉన్నాయి. అందుకే వాళ్ళిద్దరూ...

***********************************

రాత్రి పది గంటలైంది.సెల్‌ మ్రోగగానే గబుక్కున అందుకుంది నిత్య. ‘అనిల్‌ కాలింగ్‌’ అని వస్తోంది. ఆ కాల్‌ కోసమే గంటనుంచీ ఎదురుచూస్తోంది. వెంటనే కాల్‌ లిఫ్ట్‌ చేసింది.‘‘నాన్నా! అనిల్‌’’ అంది ప్రేమగా.అవతల నుంచి జవాబు లేదు.‘‘హల్లో! నాన్నా అనిల్‌!’’ అంది మళ్ళీ.అవతల ఫోన్లో వెక్కుతున్న శబ్దం....సన్నగా ఏడుపు వినిపిస్తోంది.‘‘అనిల్‌! ఏమైంది నాన్నా?’’ అంది కంగారుగా నిత్య.‘‘అమ్మా! చచ్చిపోతానమ్మా’’ అన్నాడు అనిల్‌ వెక్కివెక్కి ఏడుస్తూ. నిత్యకు ఒక్కసారి గుండె ఆగినంత పనైంది.‘‘ఏమైంది కన్నా? ఏమిటా మాటలు?’’ అంది ఆదుర్దాగా.‘‘బ్రతకడం వేస్ట్‌... సారీ అమ్మా! చచ్చిపోతాను’’‘‘ఏమైందిరా? ఎందుకు చచ్చిపోవడం?’’నిత్యకు చాలా ఆందోళనగా ఉంది. ‘నిక్షేపంలాంటి పిల్లాడు, పట్టుమని ఇరవైఏళ్ళుకూడా లేవు. ఏమిటిలా మాట్లాడుతున్నాడు? హైదరాబాద్‌లో ఎన్నో మంచి కాలేజీలుండగా ఆయనగారు చెన్నైలో పెద్ద యూనివర్శిటీ ఇంజనీరింగ్‌ కాలేజీ అని లక్షలు లక్షలు కట్టి చేర్పించారు. ఊళ్లో అయితే బిడ్డ కళ్ళముందు ఉండేవాడు. ఇప్పుడెలా? అసలేమైంది? ఎందుకేడుస్తున్నాడు? సెమిస్టర్‌లో మార్కులు తక్కువ వచ్చాయా? ఏమైనా గొడవలయ్యాయా?’ ఏమీ అర్థం కావడం లేదు నిత్యకు.

‘‘సెమిస్టర్‌లో మార్కులు బాగా రాకపోతే వర్రీ కాకు నాన్నా!’’ అంది నిత్య.‘‘ఛ...! మార్కులు కాదమ్మా! నా బ్రతుకే బాగాలేదు. ఇంత మోసమా అమ్మా?’’ అన్నాడు ఏడుస్తూ.‘‘మోసమేమిటిరా? ఎవరు చేశారు?’’ అంది నిత్య అయోమయంగా.‘‘నన్నెవరు చేస్తారమ్మా! అదే.. మానస’’నిత్యకు కొంత అర్థమైంది. ప్రేమ వ్యవహారమన్నమాట. ఇద్దరూ కొట్లాడుకుని ఉంటారు. కొంచెం ఆదుర్దా తగ్గింది.‘‘మానస మంచి పిల్లరా! మోసం చెయ్యడమేమిటి?’’ అంది అనునయంగా.‘‘దానిమాట ఎత్తకు. అది చీట్‌....నన్ను ఎప్పుడు చదువు చదువు అని సతాయిస్తుంది. ఎప్పుడు ఫోన్‌ చేసినా ఎంగేజ్‌. ఫోన్‌ లిఫ్ట్‌ చెయ్యదు. ఎవరితో మాట్లాడుతున్నావంటే ‘‘ఫ్రెండ్స్‌తో’’ అంటుంది. ‘‘బాయ్‌ ఫ్రెండ్సా?’’ అంటే, ‘‘నువ్వొట్టి అనుమానపుగొడ్డువి. నీకు గుడ్‌బై’’ అంది. ఫోన్‌ చేస్తే ఎత్తడంలేదు. నన్ను మోసంచేసింది. నేను బ్రతకడం వేస్ట్‌...’’ కసిగా అన్నాడు అనిల్‌. ఏడుపు ఆగిపోయింది. మాటల్లో కోపం బాగా కనిపిస్తోంది.