‘‘ఒరే వీరభద్రం.... వీరభద్రం.... వీరభద్రం...’’‘‘వస్తున్నా... వస్తున్నా... అబ్బబ్బ... ఇంత పొద్దున్నే వచ్చి తలుపులు బాదుతున్నారు ఎవరో.’’‘‘నేను చెల్లెమ్మా... యాదగిరిని.’’‘‘అయ్యో.... మీరా అన్నయ్యా... రండి రండి.’’‘‘ఏమ్మా వీడేడి...’’‘‘ఇంకా లేవలేదన్నయ్యా...’’‘‘ఓరినీ.... ఆరు గంటలైంది, ఇంకా లేవలేదా?’’‘‘ఒరే భద్రం...భద్రం... లేవరా...’’‘‘అబ్బబ్బ.... ఏమిట్రా నీగావు కేకలు... ఇంత పొద్దున్నే తగలడ్డావేమిటి? ఏం కొంపలు మునిగాయిరా...?’’‘‘ఒరే భద్రం... కిందికి అరవై ఏళ్ళొచ్చాయి. ఉదయం అయిదింటికి లేవాల్సింది పోయి, ఆరు దాటినా లేవకుండా ఏం కొంపలు మునిగాయంటున్నావా...?’’‘‘అలా గడ్డిపెట్టండన్నయ్యా. అందరూ ఉదయమే అయిదింటికి లేచి వాకింగ్‌కు వెళుతుంటే ఈయనగారు మాత్రం పొద్దెక్కేదాకా లేవటంలేదు. ఇంకా కుర్రాడినే అని అనుకుంటున్నారు’’.

‘‘ఎప్పుడు సందు దొరుకుతుందా అని చూసి నామీద విరుచుకుపడుతుంది. ఇదీ దీని వరస...’’‘‘మా చెల్లాయి అన్నదాంట్లో తప్పేముందిరా...’’‘‘అన్నాచెల్లెలు బాగా దొరికారు. నన్ను తిట్టే కార్యక్రమం ఆపి ఇంత పొద్దున్నే ఎందుకు తగలడ్డావో ఆ విషయం చెప్పరా. ఏమోయ్‌ సుమతీ... నువ్వెళ్ళి మా ఇద్దరికీ టీ తీసుకురా’’.‘‘ఆగు చెల్లెమ్మా! అన్నట్లూ ఈరోజు టిఫిన్‌ ఏం చేస్తున్నావమ్మా...’’‘‘ఇడ్లీలు చేస్తున్నానన్నయ్యా...’’‘‘భలే భలే... అందులోకి మాత్రం పల్లీల చట్నీ చెయ్యమ్మ. మాంచిగ కరివేపాకు, ఎండుమిర్చి వేసి పోపుపెట్టి చెయ్యి. అలాగే కాస్త జీడిపప్పు దండిగా వేసి ఉప్మా చెయ్యమ్మా. నీ చేతి టిఫిన్ల రుచి ఎక్కడా రాదు... అసలే నీ చేతివంట తిని చాలా రోజులైంది’’.‘‘అలాగే అన్నయ్యా...’’‘‘ఒరే...ఒరే... అది కడుపా, చెరువా! ఈ వయస్సులో అంతంత తిండేమిటిరా! అయినా రెండు రోజుల క్రితమేగా మెక్కివెళ్ళావు...చాలా రోజులైందంటావేంట్రా...’’ గింజుకున్నాడు వీరభద్రం.

‘‘మీరు తినరు.... తినే వాళ్ళను తిననియ్యరు’’ విసుక్కుంది సుమతి. ‘‘అలాపెట్టమ్మా... గడ్డి. రోజూ రావాలని ఉంటుంది కానీ ఏదీ వీలుపడందే. చెల్లెమ్మ వంట రుచి మరెక్కడా రాదురా...’’ ప్రేమంతా కురిపిస్తూ అన్నాడు యాదగిరి.‘‘ఓరివెధవా! నువ్వేమో ఉబ్బెయ్యటం... అదేమో పొంగిపోయి నీవు అడిగిన టిఫిన్లుచేసి పెట్టడం. నా కొంప సర్వనాశనమైపోతోందిరా... నెల రోజులకు తెచ్చిన సరుకులు నీ పుణ్యమా అని పదిహేను రోజులు కూడా రావటం లేదు. ఇంకా రోజూ వస్తాడట. అప్పుడు నెత్తిమీద గుడ్డేసుకోవటమే!’’