చుక్కలు చుక్కలుగా మంచు బిందువుల్లా నుదుటిమీద చెమట చుక్కలు. ‘‘జ్వరం... ఇప్పుడే కాస్త తగ్గి చెమటలు పడుతున్నాయి డాక్టర్‌...’’ అంటూ ఒడిలో బిడ్డను కంగారుగా ఛాతికి హత్తుకుంటున్న డ్రాగన్‌ రాజు ముఖంలో బాధను చూడటం ఇదే మొదటి సారి. మామూలు జ్వరానికి, జలుబుక్కూడా బిడ్డను మోసుకొచ్చేసే డ్రాగన్‌ రాజుని చూసినప్పుడల్లా ‘వీడేంటి చీటికిమాటికీ పొలో మని ఇక్కడికి వచ్చేస్తున్నాడు’ అని ఆశ్చర్యంగా ఉంటుంది ‘డత్తో’ డాక్టర్‌ కందయ్యకు.డ్రాగన్‌ రాజు ఈ హాస్పిటల్‌కు రావడం నచ్చలేదు డాక్టర్‌కి. డ్రాగన్‌ రాజు ఆకారం అలాంటిది. 

అతను హాస్పిటల్లోకి వస్తున్నప్పుడే కొంచెం ఆగి కొన్ని క్షణాలైనా చూసి ఆశ్చర్యపోతూ లోపల్లోపలే నవ్వుకునిగాని కదలని మనుషులుండరు.రాగిచెంబుని బోర్లించి పెట్టినట్టు మచ్చుకైనా జుట్టేలేని మాడు. చెవిలో మెరిసే కమ్మ. బొటనవేలి మందంతో బంగారు గొలుసు. రుద్రాక్ష దండ, స్ఫటిక హారం అన్నీ చొక్కాకు బయటా లోపలగా వేలాడుతూ ఉంటాయి. అన్ని వేళ్ళకీ ఉంగరాలు. పొదలో దాక్కున్న కుందేలు తల బయటకు చాపినట్టు నవ్వేప్పుడు నల్లటి నిగనిగల గడ్డం మీసాల మధ్య కనిపించే పలువరుస. దట్టమైన కనుబొమల పైన విశాలమైన నుదురు, కనుబొమలు రెండూ కలిసే చోట నుదుట దిద్దిన కామాక్షి కుంకుమ. మోచేతులను కప్పేస్తూ మోకాళ్ళదాక వేలాడే చొక్కాలో పెద్ద పెద్ద డాలర్‌ గుండీలు. ఆరడగులు ఎత్తు, దానికి న్యాయం చేసే ఆకారం. వీడు రౌడీనా, జోకరా అని పోల్చుకోలేనట్టు ఉంటాడు.‘‘డెంగీ జ్వరం అయినా కావచ్చు. వార్డ్‌లో అడ్మిట్‌ చెయ్యాలి. ఇక్కడ ఖర్చు కొంచెం ఎక్కువ అవుతుంది. యూనివర్సిటీ హాస్పిటల్‌కు రాసివ్వనా?’’ అన్న డాక్టర్‌ మాటల్లోని తటపటాయింపు అర్థం అయింది డ్రాగన్‌ రాజుకు.‘‘డాక్టేర్‌... డబ్బు గురించి ఆలోచనొద్దు. ఎంత ఖర్చయినా పరవాలేదు. నా బిడ్డకంటేనా డబ్బు? నా ప్రాణం డాక్టర్‌. ఇక్కడే అడ్మిట్‌ చేసుకోండి. నో ప్రాబ్లం.’’తన మాటలు డాక్టర్‌కు నమ్మకం కలిగించినట్టు లేవని అర్థం అయింది.‘‘హాంకాంగ్‌ నుండి వస్తున్నాను డాక్టర్‌. జెంటింగ్‌ బాస్‌ ‘డత్తో’ శ్రీకి బాడీగార్డ్‌గా వెళ్ళాను. నిన్న నైట్‌ లిల్లి ఫోన్‌ చేసింది బిడ్డకు జ్వరం అని. బాస్‌తో చెప్పేసి పొద్దున ఫ్లైట్‌ పట్టుకుని వచ్చేశాను’’ తనకు డబ్బొక లెక్క కాదు అన్నదాన్ని ఇలా మాత్రమే చెప్పడం వచ్చు డ్రాగన్‌కు.