ఒకానొకప్పుడు మగధదేశాన్ని వీరసేన మహారాజు పాలించేవాడు.ఆయనకు ఇద్దరు భార్యలు. పెద్దరాణి సునంద. చిన్నరాణి లతాంగి.సునందను అందరూ పట్టపురాణి అనేవారు. ఏ వేడుకలోనైనా ఆమె తర్వాతనే లతాంగిస్థానం. ఈ తీరు మారాలంటే భర్తను కొంగున ముడేసుకోవడం ఒక్కటే మార్గం అనుకుంది లతాంగి. ఆమె వయసులో చిన్నది, పైగా కొత్త పెళ్ళాం. రాజుకి తనంటేనే ఎక్కువ మోజుంటుంది. ఆ మోజు పెంచుకోవాలంటే తను రాజకీయాల్లో కూడా జోక్యం చేసుకోవాలి. భర్తని తన సలహాలతో మెప్పించాలి. ఇదీ ఆమె ఆలోచన.

సునంద అంతఃపుర విషయాలు దాటివెళ్లదు. తను రాజకీయాల్లో భర్తకి చేదోడువాదోడుగా ఉంటే, ఆయన క్రమంగా సునందను మరచిపోయి అన్నింటికీ తనమీదనే ఆధారపడతాడని ఆమె ఆశ. శ్రీకృష్ణుడికి సత్యభామ ప్రియమైనభార్య కావడానికి కారణం అదేనని నమ్మిన లతాంగి, సత్యభామలాగే తనూ చరిత్రలో పేరు ప్రతిష్ఠలు సంపాదించాలని కోరుకుంది.లతాంగి మనసు మంచిదే. కానీ ఆమెకు చెప్పుడుమాటలు వినే అలవాటు. పొగడ్తలకు సులభంగా లొంగిపోతుంది. ఇది కనిపెట్టిన రాజాద్యోగులు కొందరు తరచుగా ఆమెను కలుసుకుని ఇతరులపై చాడీలు చెబుతూ ఆమెను పొగుడుతూ ఉండేవారు.

ఇలా పొగడ్తలు, చాడీలు కలిపిచెప్పడంవల్ల వాళ్ళు చెప్పే చాడీలను సంతోషంగా వినేదామె.తనని కలుసుకునేవారి మాటలనుబట్టి లతాంగి కొన్నాళ్ళకు ఓ ముఖ్యవిశేషం గ్రహించింది.పట్టపురాణి సునంద తనకంటే పదేళ్లు ముందుగా అంతఃపురంలో అడుగుపెట్టింది. ఈ పదేళ్లలో అంతఃపుర దాసదాసీజనం, రాజోద్యోగుల్లో చాలావరకూ ఆమె మనుషులైపోయారు. కొందరిని ఆమే నియమించి ఉండొచ్చు కూడా. ఆమె కూడా వారిని బాగా ఆకట్టుకోగలిగింది. ఇప్పుడు వారికి తాను ఎంతమంచి చేసినా, వాళ్లు తనని మెచ్చుకుంటే మెచ్చుకోవచ్చు. కానీ వాళ్ళ మనసులలో తన స్థానం సునంద తర్వాతనే ఉంటుంది.