ఒకానొకప్పుడు మగధదేశాన్ని త్రిలోకసేనుడనే మహారాజు పరిపాలించేవాడు. ఆయన ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకునేవాడు. ప్రజలు ఆయన్ని దేవుడిలా భావించేవారు. పొరుగురాజులు అసూయ పడేటంత సుభిక్షంగా ఉండేది మగధదేశం. అలాంటి సమయంలో తరుణ వయస్కురాలైన మహారాణి సునందాదేవి, పండంటి మగబిడ్దనుకని అకాల మృత్యువుకు గురైంది.

అప్పుడు త్రిలోకసేనుడు అంతులేని విచారానికి గురయ్యాడు. ఆయన అన్నిసుఖాలూ విడిచిపెట్టి అంతఃపురంలో మూలగదిలో కూర్చుని చనిపోయిన మహారాణినే తల్చుకుంటూ దిగులుగా ఉండేవాడు. రాచకార్యాలన్నీ మంత్రులే చూస్తున్నారు. మహారాజులో క్రమంగా మార్పువస్తుందని మంత్రులాశించారు కానీ, రాజకుమారుడికి నాలుగేళ్లవయసొచ్చినా ఆయన దిగులు తగ్గకపోయేసరికి అంతా కంగారుపడ్డారు. ఎందుకంటే రాజు సంగతి తెలిస్తే ప్రజల్లో కలకలం పుడుతుంది. పొరుగు రాజులకు దుర్బుద్ధి పుడుతుంది. రాజు జోక్యంలేకుండా సమర్థ రాజ్యపాలన సాధ్యపడదు.మంత్రులందరూ ఈ విషయమై సమాలోచన జరిపారు. వారిలో వృద్ధమంత్రి, ‘‘రాజు మామూలు మనిషి కావాలంటే ఆయన్ను అంతఃపురంనుంచి కదిలించి మరోచోటకు తీసుకెళ్ళాలి.

అందుకు నాకొక్కటే మార్గం తోస్తోంది. సమీపారణ్యంలోని క్రూరమృగాలు ప్రజల్ని బాధిస్తున్నాయనీ, వాటిని వారించడం ఎవరికీ సాధ్యంకావడంలేదనీ రాజుకు నచ్చజెబితే, అప్పుడు ఆయన వేటకు బయలుదేరుతాడు. సప్తవ్యసనాల్లో వేట ఒకటి. క్రమంగా రాజు మామూలు మనిషి కాగలడు’’ అన్నాడు.ఈలోగా, సమీపారణ్యంలోకి కొత్తగా ఓ రాక్షసి వచ్చింది. అది అక్కడ కనిపించిన జంతువుల్ని ఇష్టం వచ్చినట్లు చంపితింటూ భీభత్సం సృష్టిస్తోంది. ఆ కారణంగా అక్కడి జంతువులన్నీ అడవివదిలి చుట్టుపక్కల గ్రామాలమీదపడి రాజ్యంలో భీభత్సం సృష్టిస్తున్నాయి. మామూలుగా అయితే కొంత సైన్యాన్ని పంపించి ఈ ప్రమాదాన్ని నివారించవచ్చు. కానీ, రాజును అంతఃపురం నుంచి కదిలించాలనుకున్న మంత్రులకిది సదవకాశంగా భావించి సరేనన్నారు. ఈ ఉపాయం ఫలించింది. రాజు వేటకు బయలుదేరాడు.