‘‘పెదనాన్నా! పెదనాన్నా!! పెళ్ళికి మీరు రాలేదేం’’గడపలోకి అడుగుపెడుతూనే అరచినట్టు అన్నాడు సీతారాం. ఆ ఉదయం వేళ వరండాలో వాలుకుర్చీలో కూర్చుని ఆనాటి దినపత్రిక తిరగేస్తున్న సుందర రామయ్య ఒక్కసారి తలెత్తి చూస్తూ ‘‘ఏమిటి సీతా ఏమిటా హడావుడి! ఎక్కడ నుండి నీ రాక? ముందుగా కూర్చుని మాట్లాడు. పెళ్ళేమిటి? ఎవరిపెళ్ళి? ఏమిటా సంగతులు?’’ అని అడిగేసరికి ‘‘ఎవరి పెళ్ళేమిటి పెదనాన్నా! మా శేషాద్రి మావయ్య లేడూ? అతని కూతురు జానకి పెళ్ళి’’.సీతారాం గొంతు గుర్తుపట్టి, హడావుడిగా వంటింటిలోంచి వస్తూ, ‘‘ఏంటి! సీతా! పెళ్ళంటున్నావు. ఎవరిపెళ్ళి!’’ అడిగింది సుశీలమ్మ మంచినీళ్ళ గ్లాసు అందిస్తూ ఆత్రంగా.

‘‘మీ చిన్నతమ్ముడు శేషాద్రి కూతురు – చిన్న కూతురు, జానకి పెళ్ళి దొడ్డమ్మా’’‘‘అదేంట్రా! ఎక్కడ జరిగింది? ఎప్పుడు జరిగింది?’’‘‘మీ ఊళ్ళోనే దసపల్లాలో, నిన్నరాత్రి అందరూ వచ్చారు. మీ కోసం అంతటా కలియవెతికాను. మీరు రాలేదేం దొడ్డమ్మా. అక్కడ అప్పగింతలు అవుతుంటే, మీరెలా ఉన్నారో అని కంగారుపడి పరుగెత్తుకుని వచ్చాను’’.‘‘మా ఊళ్ళో జరిగే మనవాళ్ళ పెళ్ళికి మేము రాకపోవడమేమిటరా? ఈ పెళ్ళి సంగతి మాకు తెలియనే తెలియదు’’ ఆశ్చర్యపోతూ అడిగాడు సుందరరామయ్య.‘‘అదేమిటండి! మా తమ్ముడు అలా చేశాడు. శుభలేఖ లేదు, కనీసం ఫోనైనా చెయ్యలేదు.

ఇంతకీ ఎవరెవరు వచ్చారు?’’‘‘మీరు తప్ప అందరూ వచ్చారు. మంచంమీద ఉన్న మా నాన్న! ఆయన సేవలో అమ్మ, నా భార్య తప్ప అందరూ వచ్చారు. అందుకే నేను వచ్చాను’’.‘‘ఇంతకి పెళ్ళి విశేషాలేమిటరా’’.‘‘విశేషాలేముంటాయి. కట్నకానుకలు, ఆర్భాటాలు, హోదాల ప్రదర్శనలు, చీరలు, నగల ప్రదర్శనలు. అంతే కదరా! సీతా!’’ అంటూ వంటింట్లోకి వెళ్ళి కాఫీ గ్లాసుతో తిరిగి వచ్చింది సుశీలమ్మ. చేయివణుకుతుంటే సీతారాంకి కాఫీ గ్లాసు అందించింది.