అమ్మకిది చలిపిడుగులాంటి వార్త!క్షణాల తర్వాత తెప్పరిల్లి,‘‘అయితే అక్కనీ, నన్నూ వదిలేసి పోయి నీ సుఖం నువ్వు చూసుకోదలుచుకున్నావన్నమాట’’ కోపం, నిస్సహాయతా కలగలిసిన స్వరంతో అన్నది అమ్మ.నా మనసు చురుక్కుమంది. మొహాన్ని చమటపట్టింది.

నర్మదక్కని ఇలా చూస్తూంటే మనసంతా వికలమైపోతోంది. ఎండిన గన్నేరు కొమ్మలా ఉంది. వసివాడిన పువ్వులా ఉంది. చివికిపోయి, చిరిగిపోయి, చీలికలూ పేలికలూ అయిన నిలువెత్తు టెడ్డీబేర్‌తో సతమతమౌతోంది. మధ్య మధ్యలో నవ్వు! ఆ బొమ్మ మీద అలకా, కినుకా, విసుగూ, దాన్ని చేత్తో కొట్టడం, తిడుతున్నట్టు పెదవుల కదలిక, మూతి బిగింపూ, ఎన్నెన్ని భంగిమలు! ఎన్నెన్ని విన్యాసాలు! అక్క మనసూ, దేహమూ రోగగ్రస్థం! పిచ్చిపిల్ల! అక్కా, నేనూ ఒకేసారి టెన్త్‌ పూర్తి చేశాం. అది బాగాఎత్తరి, కాయబారు శరీరం. అందంగా, ఆరోగ్యంగా ఉండేది. నేనేమో ఒంటూపిరిదాన్ని! అక్కకి ఆటలంటే ప్రాణం. అన్ని గేమ్సూ ఆడేది. చాలా పోటీల్లో గెలిచేది. ఇంటినిండా కప్పులూ, ట్రోఫీలూ. చివరకి మాధవ్‌గారి సలహా మేరకు షటిల్‌లో కుదురుకుంది.

దాని సాధన చూసి కోచ్‌ మాధవ్‌గారు ‘‘మెరికలాంటి స్పోర్ట్స్‌ పర్సన్‌ మా నర్మద!’’ అని ఒకటే పొగడ్తలు.కాలేజీలు తెరిచే సమయం. ఇంటర్‌ చదవనని కుండబద్దలుకొట్టిందిఅక్క. అమ్మకిది అశనిపాతమే. ఆమె ఆలోచనలు వేరు. కూతుర్ని డాక్టర్ని చేయాలని ఆమె కల, కోరిక. తాను చిన్నప్పుడెప్పుడో కలలుగన్న మెడిసిన్‌ చదువునీ, డాక్టర్‌ అంతస్తునీ–కూతురు ద్వారా నెరవేర్చుకోవాలని వాంఛితం. తన నిర్ణయాన్ని ఎట్టాగైనా అమలు చేయాలని పట్టుదల. అసలే పెద్దనోటి అనసూయమ్మ.

నాన్నది మెతక స్వభావం. ప్రభుత్వంలో అతి చిన్నస్థాయి ఉద్యోగి. తన అరాకొర ఆదాయంతో నర్మద మెడిసిన్ చదువు ఎత్తలేని బరువు అవుతుందని ఎంతగానో చెప్పి చూశాడు. ఆమె వినలేదు. అవసరమైతే తనకు పుట్టింటి వారిచ్చిన కాస్తో కూస్తో బంగారం అమ్మేస్తానంది. ఇంకా చాలకపోతే, ఇంటిని తెగనమ్మేద్దామని ఆలోచన చెప్పింది. ‘‘దాన్ని షటిల్‌లో రాణించనీవే, అప్పుడే అది జిల్లాస్థాయిలో విజయాలు సాధిస్తోంది’’ అని ఎంతగా చెప్పినా, మమ్మల్ని శత్రువులుగా చూసింది. నానాయాగీ చేసింది.