అతడ్ని పరీక్ష చేశాక, తెర కవతలికెళ్ళాడు డాక్టరు.‘‘ఆపరేషన్‌ చేయాలనుకుంటే రెండు రోజుల్లోపల చేయాలి. వద్దనుకుంటే యిప్పుడే యింటికెళ్ళిపోవచ్చు. ఆపరేషను చేస్తే యెక్కువ రోజులు బతుకుతాడో, చేయకుండా యిలాగే వదిలిపెడ్తే యెక్కువ రోజులు బతుకుతాడో చెప్పలేం. అంతా లక్‌ పైనే ఆధారపడివుంది. ఆ పైన మీ యిష్టం’’ - అతడికి వినబడాలనే పెద్దగా చెప్తున్నాడు డాక్టరు. 

టూబీ ఆర్‌ నాట్టుబీ - అదీ ప్రశ్న. కొడుకేం చెప్తాడోనని చెవులు రిక్కించి విన్నాడతను.‘‘అంతా కలిసి మాట్లాడుకున్నాక డెసిషన్‌ తీసుకుంటాం సార్‌! కొంచెం టయమివ్వండి’’ - కొడుకు గొంతు జీరబోతోంది.‘‘అది మీ యిష్టం. వీలయినంత త్వరగా చెప్పాలి మీరు. ఆపరేషనయితే యెల్లుండి చేసెయ్యాలి. చేస్తే ప్రమాదం ముంచుకు రానూ వచ్చు. చేయకపోతే యింకొన్ని రోజులు యెక్కువగా బతకనూ వచ్చు. చేయకపోతే డేంజరులో పడే ఆస్కారమూ వుంది...’’కొడుకు నీరసంగా తెర కివతలికొచ్చి ‘‘అదే ట్రీట్‌మెంటు కంటిన్యూ చేయమన్నారు నాన్నా! యింకో లెగ్‌ కీమోతెరపీ చెయ్యాలన్నాడు’’ అన్నాడు. అతుకుతున్నట్టు అబద్ధం చెప్తున్న కొడుకు కేసి చూస్తూ నీరసంగా నవ్వడానికి ప్రయత్నించాడతను.అతడి ముఖంలో తెల్లటి ముళ్లలా పెరిగిన వెంట్రుకల మధ్యలోంచీ కన్నీటి చార పాకుతోంది. తెరకవతలి కెళ్ళిన కొడుకు తల్లితో యేదో గొణుగుతున్నాడు. వాళ్ళు కావాలని తనకు వినబడేలా గొణుగుతున్నారని అనుమానం కలుగుతోందతడికి. ఆ విద్యలో వాళ్ళింత నిపుణులెప్పుడయ్యారని ఆలోచించే స్థితిలో లేడతను.

ఆపరేషను చేస్తే ఆ దొంగ జబ్బు త్వరగా అల్లుకుపోయి చావును దగ్గరికి లాక్కోవచ్చు. ఆపరేషను వద్దనుకుంటే అదే జబ్బు త్వరగా ముదిరి చావును ఇంకా త్వరగా కౌగలించుకోవచ్చు. యేం చేస్తే యేమవుతుందో డాక్టరే తేల్చుకోలేకపోతున్నాడు. కానీ నిర్ణయమేదో తీసుకోక తప్పదు. యెవరు తీసుకుంటారు? డాక్టరు బంతిని యివతలి కోర్టులోకి విసిరేసి వెళ్ళాడు. దాదాపు ముప్పయ్యేళ్ళ క్రితం తానొక నిర్ణయాన్ని తీసుకోకుండా వుంటే డాక్టరు తన పరిస్థితిలోనూ, తాను డాక్టరున్న స్థానంలోనూ వుండే వాడినేమో గదా, అనుకున్నాడతను. అయితే ఆ నిర్ణయానికీ, తన శరీరంలో వచ్చిన మార్పుకూ సంబంధమేముంది? దానికదే, దీనికిదే, అనుకున్నాడు. అప్పుడు అతనొప్పుకుని వుంటే ప్రభావతి నిచ్చి పెళ్ళి చేయడానికి అతని మేనమామ యెగిరి గంతేసి వుండే వాడు. అయితే ఆ మేనమామ మామూలు బడిపంతులు. అప్పుడు ప్రభావతి ప్రయివేటుగా బియ్యే చేసి బియ్యీడీ చేయడం కోసం కాలేజీలు వెతుక్కుంటోంది. సరిగ్గా అప్పుడే సంధ్య సంబంధం వచ్చింది. వాళ్ళ నాన్నది కమీషను వ్యాపారం. నగరంలో మూడిండ్లు, రెండు కార్లు, యెన్నెన్నో ప్లాట్లూ. ఆస్థిని కొడుక్కూ, కూతురికీ సమానంగా రాసిస్తానంటున్నాడు.