నరకలోకం.. భూలోకంలో మనుషులు చేసిన పాపపుణ్యాలను చిత్రగుప్తుని చిట్టాలో నమోదు చేసి,సదరు మానవులు మరణించి వచ్చిన తరువాత వారు చేసిన దుష్కర్మలను విచారించి తగిన శిక్షలు వేసి శిక్షించే న్యాయలోకం.ఎక్కడచూసినా తమ పాపాలకు తగినశిక్షలు అనుభవిస్తున్న పాపాత్ములే కనిపిస్తున్నారు. వాటిని భరించలేక బాధతో వాళ్ళు చేస్తున్న ఆర్తనాదాలతో నరకలోకమంతా మారుమ్రోగుతోంది.

అటువంటి ఆ ప్రదేశంలో ఓ ప్రత్యేక విభాగం ఉంది. అది కేవలం అత్తలకోసమే నిర్దేశించబడిన విభాగం. అందులో అత్తలందరూ శిక్షలు అనుభవిస్తున్నారు. ఆ విభాగానికో విశేషముంది. ఆయుర్దాయం తీరి మరణించిన అత్తలను నేరుగా తీసుకొచ్చి ఈ విభాగంలో పడేస్తారు.ఏ విచారణాలేకుండా వాళ్ళకి శిక్షలు అమలుపరుస్తారు. అత్తలు అంటే కోడళ్ళను రాచిరంపాన పెట్టే రాక్షసులన్న ఉద్దేశ్యం మనసులో స్థిరపడిన ఆ నరకలోకాధిపతి స్వయంగా తీసుకున్న నిర్ణయం అది. ఈ అత్తలందరి ప్రధానధ్యేయం కోడళ్ళని హింసించడమే అని ఆ సమవర్తి మెదడులో ముద్రించుకుపోవడం వలన నరకానికొచ్చిన ఏ అత్తనూ కూడా విచారించే సమస్య ఉండదు.వాళ్ళను నేరుగా ఈ విభాగానికే పంపించేస్తారు.

అప్పుడక్కడ వాళ్ళకి అనేకరకాల శిక్షలు అమలు పరుస్తారు.అలా శిక్షలు అనుభవిస్తున్నవారిలో కోడళ్ళను కడుపులో పెట్టుకుని కూతుళ్ళలా చూసుకునే ‘అంజలీదేవి’ లాంటి సాధుస్వభావులైన అత్తలు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా చేయనితప్పులకి బలవుతూ శిక్షలు అనుభవిస్తూనే ఉన్నారు.ప్రస్తుతానికి వస్తే....అప్పటివరకు మరిగే నూనెలో వేయించబడి అప్పుడే బయటకొచ్చి దీనవదనంతో కూర్చుంది సావిత్రమ్మ అనే ఓ అత్త.‘‘ఏం సావిత్రమ్మా, అలా దిగులుగా కూర్చున్నావు? అప్పుడే నీ శిక్ష పూర్తయ్యిందా!’’ అడిగింది గిరిజమ్మ అనే ఇంకో అత్త.