‘‘రావోయ్‌ కూచో’’ తలుపు తీసి ఆనంద్‌ని ఆహ్వానించింది సరిత.‘‘మీ ఒక్కదానికి ఇల్లు చాలా పెద్దదిలా లేదూ?’’ ఇంటిని నలుమూలలా పరిశీలిస్తూ అన్నాడు ఆనంద్‌.‘‘లేదూ ఏమిటి, ఉంది. నేను ఒక్క మనిషిని. కానీ ఇంట్లో రెండు బెడ్‌రూమ్‌లూ, రెండు బాత్‌రూములూ, హాలూ, కిచెన్‌, ఒక లివింగ్‌రూమ్‌..ఇన్నున్నాయి. నా ఒక్కదానికి ఎక్కువే.’’

‘‘మరి, ఇంకెవరినైనా ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నారా?’’‘‘అంటే మీ ఉద్దేశ్యం...త్వరలో నాకు మ్యారేజ్‌ ఐపోతే సంసారంతో ఉంటాననా?’’‘‘అలా అనుకోవటంలో తప్పేం ఉంది?’’‘‘తప్పే ఉంది. ఎదుటివాళ్ళ విషయంలో ఊహాగానాలెందుకు? ఎవరి జీవితం వారిది.’’‘‘మీకు కోపం వచ్చినట్టుంది. కొంచెం కాఫీ ఇస్తారా? కోపం మరచిపోవడానికి’’‘‘ఇది బాగుంది. కోపం వచ్చింది నాకు, కాఫీ తాగేది మీరూనా?’’ఇద్దరి పెదవులపై నవ్వు మెరిసింది.ఇద్దరూ కాఫీ తాగాక ‘‘వస్తానక్కా’’ అంటూ వెళ్లిపోడానికి లేచాడు ఆనంద్‌.‘‘అలాగేనోయ్‌’’ అంది సరిత నవ్వుతూ.‘‘ఓయ్‌’’ అనడంతో ఉలిక్కిపడ్డాడు ఆనంద్‌.‘‘అక్కా అంటేనూ...’’ అని మళ్ళీ నవ్వింది సరిత.రెండోసారి ఆనంద్‌ వచ్చినప్పుడు సరిత డబ్బాలోంచి ఏదో ఫలహారం తీసుకుని తింటోంది.

ఆ రోజు ఆదివారం అవటాన్న చాలా లీజర్లీగా ఫీలవుతోంది. మంచంమీద కూచుని కాళ్ళూపుకుంటూ తింటోందిఎవరో తలుపు తట్టారు.‘‘కమిన్‌, తలుపు తీసే ఉంది’’ఆనంద్‌ లోపలికి వచ్చాడు.‘‘ఆదివారాన్ని ఎంజాయ్‌ చేస్తున్నారన్నమాట.’’‘‘లేదండీ, సన్‌డేని ఆనందిస్తున్నాను.’’ఆనంద్‌, సరితను ఒకేసారి తదేకంగా చూసి, ‘‘ఈ ఇంట్లో ఇంత జాగా ఉండిపోయింది కదా, ఎవరైనా మీతోపాటు అద్దెకి ఉండవచ్చుగా.’’‘‘ఏం మీ రెలెటివ్స్‌ ఎవరైనా అమ్మాయి ఒంటరిగా ఉండాల్సి వస్తోందా?’’ అంది సరిత ఒక ప్లేటులో జంతికలు, కజ్జికాయలు తెచ్చి ఆనంద్‌కి ఇస్తూ.‘‘అవును, వరసకి మేనకోడలు అవుతుంది. ఈ ఊళ్లో బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. ఆ అమ్మాయి ఇక్కడ ఉండడానికి కుదురుతుందేమోనని...’’