కల్యాణ నగరాధీశుడు ఇంద్రవర్మకు ముగ్గురు కుమారులు. పెద్దవాడి పేరు ఇంద్రుడు. రెండవ వాడిపేరు ఇంద్రసేనుడు. మూడవ వాడిపేరు ఇలుడు. ముగ్గురూ ఆటపాటలతో కాలాన్ని వెళ్ళబుచ్చడమే తప్ప, చదువు జోలికి పోయేవారు కాదు. పిల్లలు అలా గాలి పట్టిపోవడం రాజుకీ, రాణికీ బాధగా ఉండేది. ఒకరోజు రాజాస్థానానికి ఓ బ్రాహ్మణుడు వచ్చాడు. తన పేరు చండుడు అనీ, రాకుమారులకి విద్య నేర్పేందుకే వచ్చాననీ చెప్పాడు. ఆ మాటలకు సంతోషించాడు రాజు.‘‘మహారాజా! నాకు అవకాశం ఇస్తే నీ ముగ్గురు కుమారులనీ మహా విద్వాంసులను చేస్తాను. పండితులను చేస్తాను.’’ అన్నాడు చండుడు.‘‘మీరు మాట నిలబెట్టుకుంటే...నా ఆస్తిపాస్తులు సగం మీ పరం చేస్తాను.’’ అన్నాడు రాజు. దానికి అంగీకరించనట్టుగా అడ్డంగా తలూపాడు చండుడు.‘‘అర్థరాజ్యం ఇస్తాను.’’ అన్నాడు రాజు. దానికీ తల అడ్డంగా ఊపాడు చండుడు.‘‘మరేం కావాలో మీరే సెలవీయండి.’’ ప్రార్థించాడు రాజు.దీర్ఘంగా ఆలోచించాడు చండుడు. అప్పుడు అన్నాడిలా.‘‘ముగ్గురికీ సమానంగా విద్యాబుద్ధులు చెప్పి, పండితులను చేసి, నీ దగ్గరకు తీసుకుని వస్తాను. నచ్చిన ఇద్దరు కుమారులను నువ్వు తీసుకో! నాకు ఒకణ్ణి కానుకగా సమర్పించు.’’సరేనన్నాడు రాజు. రాకుమారులు ముగ్గురినీ వెంటబెట్టుకుని వెళ్ళిపోయాడు చండుడు. అతికొద్దికాలంలోనే రాకుమారులసహా వెను తిరిగి వచ్చాడు.

వారిని రాజుకి చూపించాడు చండుడు. చెప్పాడిలా.‘‘రాజా! నీకు మాట ఇచ్చినట్టుగానే ముగ్గురినీ గొప్ప పండితుల్ని చేశాను. విద్యలన్నిటా ముగ్గురూ సమానులే! నీకు కావాల్సిన ఇద్దరినీ నువ్వు తీసుకో.’’పెద్దవాడు ఇంద్రుణ్ణి రాజు తీసుకున్నాడు. చిన్నవాడు ఇలుణ్ణి రాణి తీసుకుంది. మిగిలిన ఇంద్రసేనుణ్ణి తీసుకుని, చండుడు బయల్దేరాడు అక్కణ్ణుంచి. వారం రోజులు ప్రయాణించి, పెద్ద భవంతికి చేరుకున్నాడు.‘‘ఈ భవంతి మనదే! ఈ భవంతిలో తండ్రీ కొడుకులుగా ఇక మీదట నువ్వూ నేనూ నివసిస్తాం. తాళాలు తీసుకో! లోపలికి వెళ్ళి విశ్రాంతి తీసుకో! నేను అలా ఆశ్రమవాటికకు వెళ్ళి, మిత్రులను కలసి వస్తాను.’’ అన్నాడు చండుడు. వెళ్ళిపోయాడు.ఇంద్రసేనుడు భవంతి తాళం తీసి లోపలికి ప్రవేశించాడు. లోపల హంసతూలికా తల్పాలూ, బంగారం పోతపోసిన విగ్రహాలూ, ఖరీదైన సంగీత పరికరాలూ చాలా ఉన్నాయి. వాటిని చూసి ఆశ్చర్యపోయాడు. గదులు కూడా చాలా ఉన్నాయి. అయితే అవి అన్నీ మూసి ఉన్నాయి. తెరిచి చూడాలనిపించింది ఇంద్రసేనుడికి. ఆ ప్రయత్నంలో ముందుకు నడిచాడు.