‘‘అయ్యో అమ్మాయి పుట్టినరోజు ఇంకా వారంరోజులే ఉంది. పిల్లల్ని పిలవాలి, కేక్‌ ఆర్డర్‌ ఇవ్వాలి’’ అంటూ హడావుడి పడుతున్న భార్యను చూసి చిరునవ్వు నవ్వాడు మాధవరావు.‘‘మీకు నవ్వులాటగా ఉన్నట్లుంది. ఎన్నిపనులో? అన్నీ మనమే చేసుకోవాలి. రోజుకి ఒకరోజు వయసు పెరుగుతుంది కానీ తరగదు కదా!’’ అంది తను కూడా నవ్వుతూ రాజ్యం.ఆమె నవ్వు వెనక ఉన్న కన్నీళ్ళు తెలుసు అతనికి. ఇద్దరూ ఒకరికి కనబడకుండా ఒకరు దాచుకుంటారు. గత ఐదేళ్ళగా అలవాటైన పనే. ఐనాగానీ ప్రతీ ఏడాదీ కొత్తగా చేస్తున్నట్లుగా హడావుడి చేస్తుంది రాజ్యం.

లోపలికి వెళ్ళి పెన్నూ కాగితం పట్టుకొచ్చి చేయవలసిన పనుల జాబితా రాసుకుంది. ముందుగా పిలవవలసినవాళ్ళ పేర్లు. అలా అని ఎక్కువమంది లేరు స్నేహితులు మాత్రమే. ఆ తరువాత తినడానికి ఏం చెయ్యాలో రాసుకుంది.‘‘నువ్వు చెయ్యలేవు, బైట ఆర్డర్‌ చేద్దామన్నా ఒప్పుకోవు’’ అంటాడు మాధవరావు. ‘‘పిల్లలకు నా చేత్తో చేసినవే ఇష్టం’’ అంటుంది రాజ్యం. అన్నట్టుగానే, స్వీట్స్‌ ముందు రోజే చేసేస్తుంది. కేక్‌ ఒక్కటే బైట ఆర్డర్‌ చేస్తుంది. ఆ జాబితా తయారుచెయ్యడం పూర్తయ్యాక పిలుపులు పిలవడానికి ఫోన్‌ దగ్గరకు వెళ్ళి ఒక స్టూల్‌ వేసుకుని కూర్చుంది. సెల్‌ఫోన్‌ ఉన్నా లాండ్‌ లైన్‌ వాడడానికే ఇష్టపడుతుంది రాజ్యం.

ఫోన్‌ రింగ్‌ అవగానే అవతలనించి ‘‘చెప్పండి అమ్మా, మీరు పిలవకపోయినా మేం తప్పకుండా వస్తాం. కానీ ఆప్యాయత నిండిన మీ పిలుపుకోసం ఎదురుచూడడం మాకు అలవాటై పోయింది. మిగిలిన వాళ్ళకు నేను ఫోన్లు చేసి పిలవనా?’’ అంది అవతలి వైపు నించి నీలిమ.‘‘అమ్మదొంగా నా ఆనందాన్ని తీసేసుకుందామనే. ఈ పిలుపుల్లో నేను పొందే ఆనందం నా ఒక్కదానికే సొంతం. ఇందులో ఆయనకి కూడా తావు లేదు’’ అంది.