బలహీనుడి బలంరచనః వసుంధరపూర్వం వింధ్యారణ్యంలో మోక్షగామి అనే ఋషి తపస్సు చేసుకునేవాడు. అప్పుడా అరణ్యంలో ఎన్నో క్రూరజంతువులు ఉండేవి. అవి ఆహారంకోసం సాధు జంతువుల్ని వేటాడి చంపి తినేవి. తన పరిసరాల్లో జంతు హింస జరగటం ఇష్టం లేని ఋషి తన తపోబలంతో అక్కడి క్రూరజంతువు లన్నింటినీ ఇతర అరణ్యాలకు పంపేశాడు. ఫలితంగా వింధ్యారణ్యంలో సాధు జంతువులు మాత్రమే మిగిలి, సుఖంగా జీవిస్తున్నాయి.మోక్షగామి వింధ్యారణ్యంలో పాతికేళ్లు తపస్సు చేశాడు. తర్వాత ఆయన ఇంకా ఉగ్ర తపస్సు చేయడం కోసం హిమాలయాలకు వెళ్లిపోయాడు. ఆయన వెళ్లిన కొద్ది నెలలకు, ఆ అడవిలో ఓ సింహం ప్రవేశించింది. విచ్చలవిడిగా తిరుగుతున్న సాధుజంతువులు దానికి కనుల విందు చేశాయి. అది అందిన జంతువునల్లా వేటాడి చంపేసి, తనకు కావలసినంత తిని, మిగతాది అక్కడే వదలి, ఆశ్రయం కోసం ఓ గుహను వెతుక్కుంది. ఆ గుహలోనే ఉంటూ రోజూ అంకినన్ని సాధుజంతువుల్ని వేటాడేది. ఇలా కొన్నాళ్లు జరిగేసరికి సాధుజంతువులన్నీ బెదిరిపోయి ఈ ఉపద్రవాన్ని తప్పించుకునే ఉపాయాన్ని అన్వేషింషడానికి ఒక చోట సమావేశమయ్యాయి.'చాలాకాలంగా ఈ అడవిలో సింహాలు లేవు. ఇప్పుడిది ఎక్కడినుంచి వచ్చిందో, ఇంకా ఎన్నింటిని తీసుకొస్తుందో ఆరా తీయాలి!' అంది ఏనుగు. మిగతా జంతువులన్నీ ఔనన్నాయి. అక్కడే చెట్టుపైన కూర్చుని ఈ సమావేశాన్ని కుతూహలంగా చూస్తున్న కాకి ఒకటి వెంటనే, 'ఈ సింహం గురించి నాకు తెలుసు. ఇది దండకారణ్యానికి చెందినది. అక్కడ మనుషులు కొందరు దీనిని తెలివిగా బోనులోకి ఎక్కించి, ఈ అరణ్యపు పక్క ఊరికి తెచ్చారు. ఒక రాత్రివేళ కాపలావాడి పొరపాటువల్ల బోను తలుపు తెరుచుకుపోతే, ఇది అక్కణ్ణించి పారిపోయి ఇక్కడ ప్రవేశించింది' అంది.ఈ మాటలు విన్న ఏనుగు కాకికి కృతజ్ఞతలు చెప్పి, 'అయితే దీనితోపాటు మరిన్ని ఇతర క్రూర జంతువులు వస్తాయన్న భయం అనవసరం. కాబట్టి, మనలో ఎవరైనా ఈ సింహం వద్దకు రాయబారానికి వెళ్లాలి. అందుకు ఎవరు సిద్ధంగా ఉన్నారు?' అంది.ఆ మాటకు అక్కడున్నవాటిలో ఒక్క జంతువు కూడా కిమ్మనలేదు. అప్పుడు కాకి, 'మీరు సింహానికి ఆహారం కాబట్టి, దానితో మాట్లాడ్డం మీ వల్లకాదు. మీ తరఫున నేను రాయబారం చేస్తాను. ఏం చెప్పాలి?' అని అడిగింది. జంతువులన్నీ ముందు కాకికి కృతజ్ఞతలు తెలిపాయి. తర్వాత, కొంత ఆలోచించి, 'సింహం మా జోలికి రాకూడదు. అడవిలోకి ఇతర క్రూరమృగాల్ని రానివ్వకూడదు. అందుకు ఒప్పుకుంటే మాలో ఒకరు రోజుకొకరు చొప్పున స్వయంగా వెళ్లి సింహానికి ఆహారం అవుతామని చెప్పు' అన్నాయి.