ఆమెకో పెద్ద సమస్య వచ్చింది. ఏంచెయ్యాలో తెలియక ఆఫీసులో కొలీగ్‌ని సలహా అడిగింది. సరిగ్గా నాకూ ఇలాంటి సమస్యే వచ్చిందనీ, అత్తారింట్లో ఈ సమస్యను చర్చకు పెడితే మా హజ్బెండ్‌ ఒప్పుకోకపోవడంతో విడాకులు తీసుకున్నానని తన అనుభవం వివరించి చెప్పింది ఆ కొలీగ్‌. అంటే నా సమస్యకు కూడా పరిష్కారం విడాకులేనా? అని భయపడింది ఆమె. ఇంతకీ ఆమె సమస్య ఏంటి? ఆమెకెలాంటి పరిష్కారం లభించింది?

బస్సులో కూచున్నాను గానీ, అమ్మ చెప్పిన విషయం గురించే ఆలోచిస్తున్నాను.‘‘మీనాన్నకి ఈమధ్య మతిమరుపు ఎక్కువైంది. ఏదో వయసు పైబడుతోంది కదా మరుపు సహజం అనుకున్నాను. పెద్దగా పట్టించుకోలేదు. కానీ పట్టించుకునే సమయం వచ్చింది.మొన్న సాయంత్రం ఎప్పటిలాగానే బయటికివెళ్ళారు. చీకటిపడిపోయింది. ఎంతసేపటికీ రాలేదు, ఏం చెయ్యాలో తెలీలేదు. ఎక్కడని వెతకను? ఏంచెప్పి వెతకను? ఎటని వెళ్ళను? ఏదైనా యాక్సిడెంటు అయిందా‌! అని పోలీస్టేషన్‌కెళ్ళి రిపోర్టుకూడా ఇచ్చాను. ఎలాంటి వార్త వినాల్సివస్తుందో అని ఆ రాత్రంతా భయంభయంగా గడిపాను. కానీ మర్నాడు పోలీసులు తీసుకొచ్చి ఇంట్లోదింపి వెళ్ళారు. జాగ్రత్తగా, కనిపెట్టుకుని ఉండండి. ఎవరైనా డాక్టరుకి చూపించండి అనిచెప్పి వెళ్ళారు. అది విన్నాక ఏంచేయాలో తోచలేదు. ఎక్కడికి వెళ్ళారని అడిగితే చెప్పరు. ఆఖరికి చెప్పారు, మన ఇంటిసందు మర్చిపోయానని. ఆ మాట విన్నాక ఇంకా భయం వేసింది.

నిన్న ఇంకో భయంకరమైన విషయం, నన్నే గుర్తుపట్టలేదు. నువ్వు ఎవరు? అని అడిగారు. ఇదివరకటిలా పూజాపునస్కారాలవీ చేయడంలేదు. ఆయనకు ఏదీ గుర్తుండడంలేదు. నాకెందుకో భయంగా ఉంది. నువ్వు చాలాదూరంగా ఉన్నావు. నీ సంసారం నీకుంది, అయినా రమ్మంటున్నాను, నువ్వు నాపక్కనుంటే ఏంచెయ్యాలో తెలుస్తుంది, ఒక్కసారి రా. నువ్వుతప్ప ఇంకెవరున్నారు నాకు....’’అమ్మ మాటలు విన్నాక నాకు ఏంచెయ్యాలో తెలీలేదు. కొలీగ్‌ స్మిత దగ్గరకెళ్ళి విషయం చెప్పాను.‘‘ఇంక ఆలోచించకు. వాళ్ళిద్దర్నీ నీదగ్గరకి తెచ్చుకో. సరిగ్గా నాక్కూడా ఇలాంటి సమస్యే వచ్చింది. మా పేరెంట్స్‌కి, మేము ఇద్దరు ఆడపిల్లలం. అక్క యూఎస్‌లో ఉంటోంది. నేను ఇక్కడ. అమ్మకీ,నాన్నకీ వయసు డెబ్భై దాటింది. ఏపనీ చేసుకోలేని పరిస్థితి. ప్రతిదానికీ పక్కవాళ్ళమీద ఆధారపడుతున్న పేరెంట్స్‌ని ఇక్కడికి తెచ్చుకుంటానని ఇంట్లో అన్నాను. దానికి పెద్దగొడవ. ఎందుకంటే అత్తగారూ, మామగారూ మా ఇంట్లోనే ఉంటున్నారు. ‘పరాయివాళ్ళు ఎందుకు?’ అన్నారు. మా అమ్మావాళ్ళు పరాయివాళ్ళెలా అవుతారు? అన్నాను. పెళ్ళయ్యాక నీకు ఆ ఇంట్లో వాళ్ళంతా పరాయివాళ్ళేకదా! అంతగా అయితే వాళ్ళను విడిగా ఉండమన్నారు.

నేను ఒప్పుకోలేదు. అందరం కలిసే ఉందామన్నాను. మా హజ్బెండ్‌ కుదరదన్నారు. లేకపోతే విడాకులే! అన్నారు. ఆశ్చర్యం వేసింది, ఎంత సులభంగా పరిష్కారం చూపించారో అని. ఏం చెయ్యాలీ...? పోట్లాటలు. మా వాళ్ళని వదులుకోలేను. రోజూ ఈ గొడవలు భరించలేను. బాగా ఆలోచించి ఓ నిర్ణయం తీసుకున్నాను. విడాకులు తప్పలేదు. తీసుకున్నాను. అమ్మావాళ్ళను తెచ్చుకున్నాను. ఇక్కడ మనకి కర్తవ్యం, బాధ్యత రెండూ ఉంటాయి. అంతకుమించి మానవత్వం ఉంది. అందుకని ఏంచెయ్యాలో బాగాఆలోచించుకో...’’ అంది. ఆమె మాటలు విన్నాకా ఆలోచనలోపడ్డాను. ఈ సమస్యకి కూడా పరిష్కారం విడాకులేనా...! ఇంత కన్నా మంచిదిలేదా...! ఏం చేయాలి? నన్ను కని, పెంచి విద్యాబుద్ధులు చెప్పించి నాకో జీవితాన్నిచ్చిన వారిపట్ల నేను చూపించాల్సింది, కర్తవ్యమా! బాధ్యతా....! మరి నా భర్త ఒప్పు కోకపోతే...! ఏం చెయ్యాలీ? సంఘర్షణ.