గురువు దగ్గర వైద్యవిద్య పూర్తిచేశారు ఇద్దరు శిష్యులు. ఏడాదిపాటు సేవలు చేయమని చెరోగ్రామానికీ వారిని పంపాడు ఆ గురువు. ఒక శిష్యుడు అనతికాలంలోనే అపరధన్వంతరిగా గ్రామ ప్రజల ఆదరణపొందాడు. మరో శిష్యుడికి కష్టాలెదురయ్యాయి. ప్రజలు సొంతంగా ఇంటివైద్యం చేసుకుంటున్నారు. వారే ఆ వైద్యుడికి సలహాలు చెప్పేవారు. అతడితో వాదించేవారు. వైద్యుడివి నువ్వా నేనా? అని చిరాకుపడేవాడతను. ఇక భరించలేక గురువుకు మొరపెట్టుకున్నాడు. అప్పుడేమైందంటే.....

*********************

పట్టు వదలని విక్రమార్కుడు చెట్టువద్దకు తిరిగివెళ్లి, చెట్టుపైనుంచి శవాన్నిదించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, ‘‘రాజా, ఎవరికో సాయపడాలని ఈ అపరాత్రివేళ ఇక్కడికొచ్చావు. నన్ను భుజాన మోస్తున్నావు. కానీ నువ్వు సాయపడాలనుకున్నవారే నీకు సాయపడుతున్నారేమో! లేదా నీ సంకల్పానికి ఆటంకం కలిగిస్తున్న నేనే నీకు సాయపడుతున్నానేమో! ఈ సందర్భం చూస్తుంటే, రోగులకి చికిత్స చెయ్యడానికి వెళ్లి వారినే గురువులుగా భావించి వైద్య పరిజ్ఞానం పెంచుకున్న ఓ వైద్యుడి కథ గుర్తుకొస్తోంది. శ్రమ తెలియకుండా నీకా కథ చెబుతాను. విను’’ అంటూ ఇలా చెప్పసాగాడు.హరితారణ్యంలో గురుకులాశ్రమం నడిపే ప్రమోదుడు వైద్యశాస్త్రంలో దిట్ట. వైద్యవిద్యని అభ్యసించడానికి ఆయనవద్దకు ఎక్కడెక్కడినుంచో విద్యార్థులు వచ్చేవారు.

‘‘వైద్యవృత్తి ఏర్పడింది రోగులకోసం. రోగాలకంటే మిన్నగా రోగుల్ని అర్థం చేసుకోవడం వైద్యుల కర్తవ్యం. అందుకే వైద్యవిద్యలో విద్యాభ్యాసంతోపాటు వైద్యాభ్యాసం కూడా అవసరం. చదువు పూర్తయ్యేక మీరు ఓ ఏడాదిపాటు నేను చెప్పిన గ్రామాలకు వెళ్లి అక్కడ జనాలకు ఉచితంగా వైద్యం చెయ్యాలి. గడువు పూర్తయ్యాక మళ్లీ నా దగ్గరకు రావాలి. నేను మరోసారి తగినవిధంగా పరీక్షించి, మీరు వైద్యవృత్తిని ప్రారంభించడానికి అర్హులా, కాదా అన్న విషయం నిర్ణయిస్తాను. అందుకు ఒప్పుకునేవారే ఇక్కడ చేరండి’’ అని తనవద్దకొచ్చే శిష్యులకు ముందే చేప్పేవాడు ప్రమోదుడు.

అలా ఒకసారి ఆయన తన గురుకులంలో చదువు పూర్తిచేసిన మనోహరుడనే శిష్యుణ్ణి వ్యధాపురానికీ, కుతూహలుడనే శిష్యుణ్ణి సుధాపురానికీ పంపాడు.కుతూహలుడు సుధాపురం చేరుకుని గ్రామాధికారిని కలుసుకుని తను వచ్చినపని చెప్పాడు. ఆయన ఎంతో సంతోషించి అతణ్ణి సాదరంగా ఆహ్వానించి ఊళ్లో ఉచిత భోజన వసతులు ఏర్పాటు చేశాడు. అప్పటికే సుధాపురంలో సనాతుడనే నాటువైద్యుడున్నాడు. ఆయనకి కొందరుశిష్యులు కూడా ఉన్నారు. జనుల అజ్ఞానాన్ని ఆధారం చేసుకుని వాళ్లక్కడ వైద్యులుగా చెలామణీ ఐపోతున్నారు.