ఆమె అత్తగారు మహంకాళి. పేరుకుతగ్గట్టే క్రూరంగా ఉంటూ కోడల్ని నానా కష్టాలు పెట్టేది. భర్త, మామగారు, తల్లిదండ్రులుసహా ఇరుగుపొరుగువారెవరూ ఆమె మొర ఆలకించలేదు. సర్దుకునిపో అని సలహా ఇచ్చారు. ఇక ఆత్మహత్యే ‌శరణ్యమనుకుంది ఆ కోడలు. కానీ ఆమె ఆత్మహత్య చేసుకోలేదు. తెల్లవారి నిద్రలేవగానే ఆమెలో కొత్త చైతన్యం వచ్చింది. ఇక అప్పటినుంచీ ఆమె కాలుమీద కాలేసుకుని మహారాణిగా ఉండటం ప్రారంభించింది. అదెలా సాధ్యపడింది? దాని పర్యవసానాలేంటి?

*********************

పట్టు వదలని విక్రమార్కుడు చెట్టువద్దకు తిరిగివెళ్లి, చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, ‘‘రాజా, ఈ అపరాత్రివేళ నీవు సుఖనిద్రను వదులుకుని ఇక్కడికి వచ్చావంటే, ఆందుకు కారణం నీ పరోపకారబుద్ధి కాకపోవచ్చుననిపిస్తోంది. నిన్నిక్కడికి రప్పించిన భిక్షువు నీపై అనుకూలమంత్రం ప్రయోగించాడా అని నా అనుమానం. ఒకప్పుడు వేదపురిలో ఉండే కామాక్షి అదే చేసింది. శ్రమతెలియకుండా నీకా కథ చెబుతాను. విను’’ అంటూ ఇలా చెప్పసాగాడు.వేదపురిలో బ్రహ్మయ్య అనే భూస్వామి ఉండేవాడు. ఆయన భార్య వాణి అనుకూలవతి. ఆ దంపతులకి ఇద్దరు కొడుకులు. పెద్దవాడు సూర్యం, చిన్నవాడు సత్యం. ఇద్దరూ బుద్ధిమంతులు. ఊరివారంతా ఆ కుటుంబాన్ని చూసి ఎంతో ముచ్చటపడేవారు.సూర్యం మెతకమనిషి. తండ్రిచాటునే ఉంటూ వ్యవసాయం పనులు నేర్చుకుని ఆయనకు చేదోడువాదోడుగా ఉంటున్నాడు. సత్యం చురుకైనవాడు.

బాగా చదువుకుని పట్నంవెళ్లి ఉద్యోగం చేస్తున్నాడు.కొన్నాళ్లకు బ్రహ్మయ్య కొడుకులిద్దరికీ పెళ్ళిళ్ళు చేశాడు. సత్యం భార్యని తీసుకుని పట్నంవెళ్లిపోతూ తలిదండ్రుల్ని తనతో వచ్చెయ్యమన్నాడు. కానీ వాళ్లు ఉన్నఊరిని వదిలిరాలేక పెద్దకొడుకువద్దనే ఉండిపోయారు.సూర్యం భార్య మహంకాళి మహాగయ్యాళి. పెళ్ళికిముందే ఆమె జాతకంచూసిన ఊరు పురోహితుడు, ‘‘ఈమెకు అత్తమామలతో పడదు. కానీ ఈమెకు పుట్టే కొడుకువల్ల ఊరందరికీ ఉపకారం జరుగుతుంది’’ అని చెప్పాడు. వంశాంకురంవల్ల పేరు ప్రతిష్ఠలొస్తాయని ఆశపడిన బ్రహ్మయ్య ఆ సంబంధానికి సరేనన్నాడు. కానీ మహంకాళి కాపురానికి వచ్చాకగానీ ఆమె ఎంత గడ్డుదో తెలియలేదు. అయిందానికీ, కాందానికీ అందరిమీదా విరుచుకు పడేది. పెద్దాచిన్నా అని చూడకుండా ఎవరినైనా ఎంతమాటైనా అనేసేది. ఆమెను అదుపుచెయ్యడానికి అత్తమామలు కొన్నిప్రయత్నాలు చేసి, ఇక తమవల్లకాదని గ్రహించాక, ‘‘నీ భార్యని నువ్వే అదుపులో పెట్టాలి’’ అని సూర్యాన్ని గట్టిగా మందలించారు.