జనానికి నీతిబోధలు చేసి, వారిలో మార్పు తీసుకువచ్చేందుకు పూనుకున్నాడు శివానందుడనే యువ సన్యాసి. ఒక ఊరు వెళ్ళి ప్రజలకు నీతిగా ఉండమని బోధించేవాడు. జనం అతడి మాటలు శ్రద్ధగా వినేవారు. కానీ తొందర తొందరగా తమ కోర్కెలు తీర్చే దేవుడు ఉంటే పాపాలు చేయడం మానేస్తామన్నారు. అప్పుడు శివానందుదు పాపహారి అనే దేవతను సృష్టించాడు. భక్తుల పాపాలు హరించేందుకు కొన్ని పద్ధతులు ప్రవేశపెట్టాడు. అప్పుడు ఏం జరిగిందంటే.......

పట్టు వదలని విక్రమార్కుడు చెట్టువద్దకు తిరిగివెళ్లి, చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, ‘‘రాజా, అర్థరాత్రిపూట నిన్నిక్కడకు రప్పించి నీచేత మౌనదీక్ష పట్టించినవాడు మంచివాడని అనుకున్నావు. మంచివాడు కాకపోయినా వాణ్ణి మంచివాడుగా మార్చగలవని నీ నమ్మకం. మరి అబద్ధపు పుణ్యదీక్ష పట్టిన సుమంతుడి కథని నేను చెప్పగా విన్నావుగా. ఆ సుమంతుడు స్వలాభం కోసం ఆ పని చెయ్యడంవల్ల నరకానికి పోయాడని నువ్వన్నది కూడా నిజమే. ఐతే స్వలాభాపేక్ష లేకుండా మనుషుల పాపాలు పోగొట్టాలనుకున్నా, ప్రపంచానికి పాపభారం తగ్గాలంటే, ముందు మనుషుల్లో మార్పు రావాలి. కానీ మనుషుల్లో మార్పు ఇంచుమించు అసాధ్యం. అది గ్రహించక, మనుషుల్లో మార్పుకోసం ప్రయత్నించి భంగపడిన శివానందుడిగురించి నీవు తెలుసుకోవాల్సి ఉంది. శ్రమ తెలియకుండా నీకాకథ చెబుతాను. విను’’ అంటూ ఇలా చెప్పసాగాడు.

సదానందుడనే సన్యాసివద్ద శివానందుడు చాలాకాలం శుశ్రూషచేసి వేదాంతజ్ఞానం పొందాడు. అప్పుడు అతడికి మానవసేవ చేయాలన్న కోరిక కలిగింది. గురువు అతడి కోరిక విని, ‘‘కొంతకాలం మనుషులమధ్య తిరుగు, వాళ్లకు మంచిచెడ్డలు వివరించి చెప్పు. చెడ్డవారిని మార్చాలనిగానీ, మంచివారికి సాయపడాలనిగానీ మాత్రం ఆలోచించకు‍’’ అని సలహా ఇచ్చి పంపాడు.సరేనని శివానందుడు బహుపురమనే పట్నం చేరుకున్నాడు. అక్కడ అతడు పగలంతా ఇంటింటికీ తిరిగి నీతిబోధలు చేసేవాడు. ప్రతివాళ్లూ అతడు చెప్పేది భక్తిశ్రద్ధలతో వినేవారు. కానీ నీతిసూత్రాలు పాటించాలంటే అందరికీ ఏదో ఇబ్బంది ఎదురవుతూనే ఉండేది. అన్నింటికంటే ముఖ్యమైనది డబ్బు ఇబ్బంది.ఒకడు కొడుకుపెళ్ళికి కట్నం పుచ్చుకున్నాడు. అది నేరం. కానీ ఏం చేస్తాడు? కూతురుకి పెళ్ళీడు వచ్చింది. కట్నం ఇవ్వనిదే ఆమెకు పెళ్ళికాదు. రాచకొలువులో చేసే ఒకతని తలిదండ్రులు దీర్ఘరోగంతో బాధపడుతున్నారు. వైద్యానికి బోలెడు ఖర్చవుతోంది. వచ్చే జీతం అందుకు సరిపోవడంలేదు. అందుకని నేరమని తెలిసికూడా, లంచం పుచ్చుకుంటున్నాడు.