రాజు, మంత్రి మారువేషాల్లో ఒక పేద రైతు ఇంట బసచేశారు. వారికి గొప్ప అతిథ్యం ఇచ్చాడారైతు. అతడి ఋణం తీర్చుకోవడానికి రాజు, మంత్రి పొరుగూర్లో ఆ రైతు వియ్యంకుడి దగ్గరకువెళ్ళి పేదరైతు ఇవ్వాల్సిన కట్నం బాకీ తీర్చబోయారు. వెంటనే ఆ వియ్యంకుడు కట్నం ఇవ్వడం–తీసుకోవడం రెండూ నేరమే అని అనినీతి నిర్మూలనాధికారిని పిలిచాడు. అతడి నిజాయితీచూసి రాజు ఆశ్చర్యపోయాడు. ఇంతకీ ఇక్కడ అబద్ధం చెప్పిందెవరు? అసలు ఆ రాజ్యంలో ఏం జరుగుతోంది?…

పట్టువదలని విక్రమార్కుడు చెట్టువద్దకు తిరిగివెళ్లి, చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, ‘‘రాజా, నన్ను తీసుకురమ్మని ఓ అపరిచితుడు కోరితే, ఆ కోరికనే శాసనంగా భావించి, ఈ అపరాత్రిపూట నిద్ర మానుకుని తిరుగుతున్నావు. ఆ శాసనంవల్ల ఎవరికి మేలు జరుగుతుందో తెలియదు. అసలు మేలనేది ఉందో లేదో కూడా తెలియదు. వెనుకటికి యశోవర్ధనుడనే రాజు జనం మేలుకోరి తనుచేసిన రాజశాసనాలకే జనాదరణలేదని తెలుసుకున్నాడు. నువ్వు నీ శాసనం గురించి ఏమాలోచిస్తావోగానీ, - శ్రమ తెలియకుండా నీకు ఆ కథ చెబుతాను. విను’’ అని ఇలా చెప్పసాగాడు.

విదర్భ దేశానికి యశోవర్ధనుడు కొత్తగా రాజయ్యాడు. ఆయనకు దైవభక్తి ఉంది. సంప్రదాయమంటే గౌరవముంది. కానీ భక్తి, సంప్రదాయం పేరిట మూర్ఖత్వంతో పాటించే దురాచారాలంటే చిరాకు.సింహాసనం అధిష్టించగానే యశోవర్ధనుడు రాజ్యంలో పాటిస్తున్న దురాచారాలపై ఆరా తీసి, వాటిని నిరసిస్తూ, నిషేధిస్తూ ఎన్నో శాసనాలు చేశాడు. వాటిని అమలు జరపడానికి, రాజ్యంలో అనేక ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా వివిధసంస్థలు ఏర్పాటుచేశాడు. జనం ఓ పట్టాన దురాచారాలను వదలరని గ్రహించి, శాసనం వ్యతిరేకించినవారికి కఠినశిక్షలు నిర్ణయించాడు.ఇన్ని చేసినా రాజ్యంలో కొన్ని దురాచారాలు యథాతథంగా కొనసాగుతున్నట్లు రాజుకి తెలిసింది. వాటిలో ముఖ్యమైనవి వరకట్నం, లంచగొండితనం. వరకట్న దురాచారంవల్ల ఎందరో పేద యువతుల బ్రతుకు దుర్భరమైంది. రాజోద్యోగుల్లో ఎక్కువగా లంచగొండితనం ఉంటోంది. ఎంత ప్రయత్నించినా వీటిని అరికట్టడం ఎలాగో తెలియడంలేదు. ఎందుకంటే, రాజశాసనాలు చేసినప్పటినుంచీ, దురాచార బాధితుల నుంచి ఫిర్యాదులు పూర్తిగా ఆగిపోయాయి.