బంగారు పళ్లెరానికైనా గోడచేర్పు కావాలి. ఎంత బ్రహ్మాండమైన చదువులు చదివిన వాడికైనా ఒకానొక సంక్లిష్ట సమయంలో ఆత్మీయుల సలహాలు అవసరం అవుతాయి. అతనికి కూడా అలాగే అలాంటి కీలక సమయంలో వాళ్ళ మామయ్య గొప్పసలహా ఇచ్చాడు. చాలాసేపు వాళ్ళిద్దరి మధ్య చర్చ సాగిన తర్వాత ఆ సలహా అతడి నోట్లోంచి బయటకొచ్చింది. ఇంతకీ మామయ్య ఏం చెప్పాడు? అతడికి వచ్చిన సమస్య ఏమిటి?

***********************

‘‘ఇది సివిలైజ్‌డ్‌ యుద్ధం. నాగరికత ముసుగులో ఉన్న యుద్ధం. అందుకని, అన్నీ డీసెంటుగా, డెమొక్రటిక్‌గా, న్యాయంగా సంస్కారపరంగా ఉండాలని అనుకుంటే అది ఎండమావే అవు తుంది’’ అని అంటున్న మామయ్య వైపు అయోమయంగా చూశాను.‘అంతేనా..నాతో శలభ్‌ యుద్ధం చేస్తున్నాడా! వాడి ముందు నేనెంత? నాకు ఇంత అన్యాయం చేస్తాడా? ఇంత మోసం చేస్తాడా! మాటకీ స్నేహానికీ విలువలేదా! ఇంతగా దిగజారిపోయాడా! చదువుకునే రోజుల్లో చెప్పిన సిద్ధాంతాలన్నీ ఏమయ్యాయి?చదువుకుంటున్నప్పుడు నేర్చుకున్న ఎథిక్స్‌ ఏమయ్యాయి? అవన్నీ అంతగా బలహీనపడిపోయాయా!’ అదే అన్నాను, మామయ్యతో.‘‘మార్క్స్‌ ఏనాడో చెప్పాడు, ఈ ప్రపంచంలో ఉన్నవి రెండే వర్గాలు. దోచుకునే వాళ్ళు, దోచుకో బడే వాళ్ళు అని, ఇప్పుడు అదే జరిగింది’’.‘‘నాకింకా నమ్మకం కలగడం లేదు మామయ్యా, ఆ రోజు మామూలుగానే కంపెనీకి వెళ్ళాను.

నన్ను చూడగానే అకౌంట్స్‌ సెక్షన్‌కి వెళ్ళి నీకు రావలసింది తీసుకో అన్నాడు. మరో మాటికి ఛాన్స్‌ ఇవ్వలేదు. కారణాలు తెలవాలికదా. ఈ రోజు వరకూ కారణం తెలీదు, వాడి మాటల్ని జీర్ణించుకోలేకపోతున్నాను. ఇద్దరం చదివింది ఒకటే. అయినా వాడు నా బాస్‌ అది నేనెప్పుడూ గుర్తుపెట్టుకునే ప్రవర్తించేవాడిని కూడా. నేనెప్పుడూ వాడి మాట కాదనలేదు. వాదించలేదు, అయినా....’’‘‘అదే మరి, మంచిగా ఉండాలనుకునేవాడు, మంచిగా లేనివాళ్ళకన్నా ఎక్కువ నష్టపోతాడు. నీ విషయంలో అదే జరిగింది. నెపోలియన్‌ అన్నట్లుగా, ఓ వెల్వెట్‌ తొడుగులో నీ ఫ్రెండు తన ఇనప చెయ్యిని ఉంచుకున్నాడు.

నువ్వు పై తొడుగు చూశావు. నమ్మావు, అది నీ తప్పుకాదు. నీ బాధ నాకర్థమైంది. జరిగింది మరచిపోనంతవరకూ నువ్వు మరో ఉద్యోగానికి ప్రయత్నించవు, అందుకని జరిగింది ఇంక మర్చిపో. నువ్వు మరో ఉద్యోగానికి ప్రయత్నించు. నేను నీకిచ్చే సలహా ఇదే. నీ పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. వాళ్ళ గురించి కూడా నువ్వు ఆలోచించాలి. ప్రయత్నిస్తే ఉద్యోగం దొరక్కపోదు. నామాట విని నువ్వు శివకుమార్‌ని కలవడం మంచిది. వాడి ఆఫీసు, మాదాపూర్‌, రోమా చేంబర్స్‌లో శ్రేయా ప్లేస్మెంట్స్‌. ఏం వెళ్తావా? కావాలంటే నేను కూడా నీతో వస్తాను’’ అన్నాడు మామయ్య.