రాత్రి 12.00 గంటలు .... హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. 1.30 గంటలకు సింగపూర్‌ విమానం ... అక్కడ నుంచి ఇండోనేసియాలోని బాలి దీవులకు ... తిరుగు ప్రయాణంలో బ్యాంకాక్‌కు .. ఒక స్పాన్సర్‌షిప్‌పై ఏడుగురితో కూడిన చిన్న బృందం పర్యటన. స్పాన్సర్‌షిప్‌ అంటే ఆయాదేశాల పర్యాటక, సాంస్కృతిక శాఖలో, ప్రైవేటు, కార్పొరేట్‌ సంస్థలో ఏర్పాటు చేస్తాయనుకునేరు. డబ్బున్న స్నేహితులు, కాంట్రాక్టర్లు, చోటామోటా వ్యాపారవేత్తలూ ఏర్పాటు చేయవచ్చు. స్పాన్సర్లు ఎవరైతేనేమి మా ఏడుగురికీ ఆ అవకాశం దక్కింది. మాలో ఒకరిద్దరు తొలిసారి విదేశాలకెళుతున్న వారూ ఉన్నారు.నాదీ అదే బాపతు. తొలి విదేశీ పర్యటనే కాదు... తొలి విమానయానం కూడా. రాను పోను మొత్తం నాలుగు విమానాల్లో ప్రయాణం చేయబోతున్నాను. సమయం 1.30. ఫార్మాలిటీస్‌ అన్నీ పూర్తి కావడం, మేము ప్రయాణించాల్సిన విమానంలోకి ప్రవేశించడం నింపాదిగా జరిగి పోయాయి. కోరుకున్న విండో సీట్‌ దక్కింది నాకు. విమానంలో విహరిస్తూ సూర్యోదయం చూడటం ఒక అద్భుతం అని ఆఫీసులోని ఒక సీనియర్‌ కొలీగ్‌ చెప్పారు.

లెక్కలు వేసుకున్నాను .... హైదరాబాద్‌కు, సింగపూర్‌కు మధ్య కాలం రెండున్నర గంటల వ్యత్యాసం. అంటే నాలుగు గంటలకే తెల్లవారుతుంది. ఆ సమయానికి మెలకువతో ఉండాలన్న కుతూహలంతోనే నిద్రలోకి జారుకున్నాను.మెలకువ వచ్చేటప్పటికి కళ్ళు చెదిరిపోయే దృశ్యాలు సాక్షాత్కరించాయి. మేఘాల పైగా విమానం భారంగా కదులుతున్నట్లుంది. కింద ఉన్న ఆకాశం కాంతులీనుతోంది. మబ్బులు తునకలై కాసేపు, గుంపులై కాసేపు గందరగోళ పరుస్తున్నాయి. మొత్తంపై నీలాకాశం అర గంట సేపు సప్త వర్ణాల శోభితంగా మనస్సును రాగ రంజితం చేసింది. స్థానిక కాలమానం ప్రకారం 8.30 గంటలకు సింగపూర్‌ విమానాశ్రయంలో దిగాం..... మధ్యాహ్నం ఒకటిన్నరకు బాలీకి మరో ఫ్లయిట్‌లో బయలుదేరాం. ఆకాశంలోనిఆ అందాలు తగ్గక పోయినప్పటికీ నా అను భూతి సాయంత్రానికి పలచబడింది. అనుభవంలోకి వచ్చే కొలదీ తత్వం బోధపడుతుందనేది తిరుగు ప్రయాణం సమయానికి పూర్తిగా తేటతెల్లమైంది.మొత్తం అయిదు రోజుల కార్యక్రమం. హోటల్‌ గదులు విలాసవంతంగా ఉన్నాయి. స్విమ్మింగ్‌ పూల్స్‌ సరేసరి. చల్లని నీళ్ళల్లో వెచ్చని శరీరాలు ఓలలాడుతున్నాయి. షెడ్యూల్‌ ప్రకారం మొదటి రోజు బాలిలో గుళ్ళు, గోపురాలు తిరిగాం. పూజలతో ప్రారంభమయ్యే మా ప్రయాణం ఆఖరి రోజు బ్యాంకాక్‌లో ‘రంగ పూజ’తో ముగుస్తుందని నిర్వాహకులు నిర్ధారించారు. ఇంకేమి సుడిగాలిలా తిరుగుతున్నాం. ‘ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి’ అని ఆఫీసులో నా బాస్‌ చెప్పిన మాట మెదడుకు పట్టేసినట్లుంది. కష్టమైన తిండిని ఇష్టంగా తింటున్నాను.. అలవాటు లేని వ్యవహారాలను వంటబట్టించుకుంటున్నాను.